Author Topic: భవిష్యత్తు రోబో శాండ్‌దే!  (Read 256 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
కొన్ని నిర్మాణాల్లో 100 శాతం వినియోగానికి అవకాశం
హైదరాబాద్‌లో దీనికి మంచి డిమాండ్
ఇప్పటికే ఉపయోగించిన రిలయన్స్, జీఎంఆర్, జెన్‌ప్యాక్ట్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న ఇల్లు నుంచి బహుళ అంతస్తుల భవనం వరకు, కల్వర్టు నుంచి భారీ బ్రిడ్జిల నిర్మాణం వరకు అన్నింట్లోనూ ఉపయోగించే ‘ఇసుక’కు కరువొచ్చింది. ఒకవైపు పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు కోర్టులు, ప్రభుత్వాల ఆంక్షలతో ఇసుకే బంగారమవుతోంది. నిర్మాణాల కోసం ఎడా పెడా ఇసుకను తోడేస్తుండటంతో నదులు, వాగులు, వంకలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుకకు ‘రోబో శాండే’ప్రత్యామ్నాయమని అంటున్నారు నిపుణులు. యంత్రాలతో తయారు చేసిన రాతి పొడినే రోబో శాండ్‌గా పిలుస్తున్నారు.

భారత్‌లో రోబో శాండ్‌ను తయారు చేసే తొలి ప్లాంటు హైదరాబాద్‌లోనే ఏర్పాటవడం ఒక విశేషం. రోబో సిలికాన్ అనే సంస్థ దీనిని ఏర్పాటు చేసింది. 2001 నుంచే మాన్యుఫాక్చర్డ్ శాండ్ ఉత్పత్తిని ప్రారంభించింది. యంత్రాలతో తయారు చేసే ఇసుక కాబట్టి ఇది ‘రోబో శాండ్’గా పేరొందింది. 50-60 ఏళ్లుగా ఈ కాన్సెప్ట్ ఉన్నా.. ఇటీవలే ఊపందుకొంటోంది. సిమెంటు, స్టీలు, కలప వంటి అన్ని ముడిసరుకుల ధరలూ పెరుగుతున్నట్లే ఇసుక ధరలూ పెరిగిపోతుండటం వినియోగదారులకు పెను భారంగా మారుతోంది. దీంతో విరివిగా లభించే బండరాళ్లను పిండి చేసి తక్కువ ఖర్చులోనే ఇసుక తయారు చేసే ప్రక్రియ ప్రాచుర్యం పొందుతోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో భారీ నిర్మాణాలకు ఈ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు.

బడా సంస్థల్లో వినియోగం అధికం..
రోబో శాండ్‌ను 2005లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ తన జామ్‌నగర్ ప్లాంటు విస్తరణకు ఉపయోగించింది. సుమారు 30 లక్షల టన్నుల రోబో శాండ్‌ను వినియోగించారు. హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రి నిర్మాణంలోనూ వాడారు. హైదరాబాద్, ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో జీఎంఆర్ గ్రూప్ ఈ శాండ్‌ను వాడింది. హైదరాబాద్‌లోని మెట్టుగూడ రైల్వే బ్రిడ్జి, హబ్సిగూడలోని జెన్‌ప్యాక్ట్ ఆఫీసు, జయభేరి గ్రూప్, మీనాక్షి అపార్ట్‌మెంట్స్ వంటి సంస్థలు ఇందుకు కొన్ని ఉదాహరణలు. రాజధానిలోని ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ల నిర్మాణంలోనూ వాడారు. రోబో శాండ్ వినియోగానికి రైల్వే శాఖ అనుమతిస్తోంది. కర్ణాటక ప్రభుత్వమూ దీన్ని అధికారికంగా ఆమోదించగా.. ప్రస్తుతం మన రాష్ట్రంలోనూ ఈ దిశగా అడుగులు పడుతున్నాయి.

పనితీరు ఎలా ఉంటుంది?: ఇసుకకు ఉండే సహజ స్వభావం ఈ రోబో శాండ్‌కు ఉంటుందా అన్న అనుమానం చాలా మందిని తొలుస్తోంది. అయితే, దీనిపై జరిపిన అధ్యయనాల్లో మాత్రం ఇది 100% వరకు ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు తగినదేనని తేలింది. ఫౌండేషన్లు, పిల్లర్లు, బీమ్‌ల నిర్మాణం వరకు దీన్ని వాడుతున్నారు. ప్లాస్టింగ్‌కు ఉపయోగించడం లేదు. త్వరలో ఇందుకోసం కొత్త ఉత్పత్తులు రాబోతున్నాయి.

ఎలా తయారు చేస్తారు..: స్టోన్ క్రషర్‌లో వర్టికల్ షాఫ్ట్ ఇంపాక్టర్(వీఎస్‌ఐ) అనే యంత్రంలోకి ‘0-40’ ఎంఎం సైజు కంకర రాళ్లను పంపించి ఒక క్రమ పద్ధతిలో ఒత్తిడి కలిగిస్తారు. ఒక రాయిని మరో రాయి కొట్టుకోవడం వల్ల నదుల్లో ఇసుక తయారవుతుంది. సరిగ్గా అదే విధానాన్ని ఇక్కడ యంత్రాల సాయంతో అమలు చేస్తారు. దీంతో ‘0-4.75’ ఎంఎం సైజులో ఇసుక వంటి మిశ్రమ రాతి పొడి లభిస్తుంది. ఇసుక గుండ్రంగా ఉంటుంది కానీ రోబో శాండ్ క్యూబికల్ ఆకారంలో తయారవుతుంది. ఇది ఇసుక స్వభావానికి అతి దగ్గరగా ఉంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. సాధారణ స్టోన్ క్రషర్లలో లభించే డస్ట్‌ను మాత్రం రోబో శాండ్‌గా పరిగణించకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఇందుకోసం పైన పేర్కొన్న సాంకేతిక అంశాలే కీలకమని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలో సుమారు 20 స్టోన్ క్రషర్లు ప్రత్యేకంగా రోబో శాండ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.

ధర, మార్కెటింగ్ అవకాశాలు...: ఒక టన్ను ఇసుక ధర హైదరాబాద్‌లో రూ.1,000-1,200 చొప్పున లభిస్తోంది. అదే రోబో శాండ్‌ను టన్నుకు రూ.650-750 ధరలో(పన్నులతో కలిపి డెలివరీ చేసే రేటు) విక్రయిస్తున్నారు. కొన్ని సంస్థలు ఇంకా తక్కువ ధరకే దీనిని విక్రయిస్తున్నాయి. హైదరాబాద్‌లో వివిధ నిర్మాణాల కోసం రోజుకు కనీసం 3,000 ట్రక్కుల ఇసుకను వాడుతున్నట్లు ప్రభుత్వ అంచనా ఉంది. నెలకు దాదాపు 18 లక్షల టన్నులుగా దీనిని లెక్క కట్టారు. ప్రస్తుతం రోబో శాండ్ విక్రయాలు నెలకు సుమారు 5 లక్షల టన్నుల మేరకు ఉంటున్నాయి.

నాణ్యత పాటించకపోతే కష్టం...
తయారు చేసిన ఇసుక( మాన్యుఫాక్చర్డ్ శాండ్) వాడకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. తగిన ప్రమాణాలు, కచ్చితమైన సైజులో దీన్ని ఉత్పత్తి చేస్తే కాంక్రీట్ నిర్మాణాల్లో వినియోగించవచ్చు. అప్పుడు మాత్రమే భద్రతాపరంగా పూర్తిగా విశ్వసించే అవకాశం ఉంటుంది. కానీ మన దగ్గర దీని నాణ్యతను సర్టిఫై చేసే థర్డ్ పార్టీ సంస్థలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం గానీ లేదా నిర్మాణరంగానికి చెందిన పరిశోధన సంస్థలు గానీ నాణ్యతను పరిశీలిస్తే బాగుంటుంది.
- సి.శేఖర్ రెడ్డి, క్రెడాయ్ ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్