Author Topic: దక్కన్ క్రానికల్ దగా  (Read 363 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,672
దక్కన్ క్రానికల్ దగా
« on: August 02, 2012, 07:51:11 AM »
హైదరాబాద్, ఆగస్టు1: రాష్ట్రానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థ దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు తమను దారుణంగా వంచించారని ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డీమ్యాట్ ఖాతాల్లో లేని షేర్లను ఉన్నట్టుగా నమ్మించేందుకు తమ పేరుతో పత్రాలను ఫోర్జరీ చేశారని పేర్కొంటూ దక్కన్ క్రానికల్ ప్రమోటర్లపై కార్వీ కేసు పెట్టింది.

ఈ పత్రాలను చూపించి లేని షేర్లను ఉన్నట్టుగా నమ్మించి షేర్ల తాకట్టుపేరుతో పైనాన్షియల్ సర్వీసుల సంస్థ ఫ్యూచర్ కాపిటల్‌ను దాదాపు రూ.170 కోట్ల మేరకు దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు టి.వెంకట్రామ్‌రెడ్డి, టి.వినాయక్ రవి రెడ్డి, పికె అయ్యర్ మోసగించారని కార్వీ పేర్కొంది. సత్యం కంప్యూటర్స్, జగన్ కంపెనీ లు.. ఇదే పరంపరలో ఇప్పుడు దక్కన్ క్రానికల్ చేరింది. పారిశ్రామిక వాణిజ్యరంగాల్లో ఆంధ్రప్రదేశ్ పేరెత్తితేనే వణుకుపుట్టేలా ఈ కంపెనీలు చేస్తున్నాయి.

దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రమోటర్ల దగాపై కార్వీ ఉద్యోగి ఉమామహేశ్వర్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ సెంట్ర ల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులోని మూ డు సంస్థలు దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్, కార్వీ గ్రూప్, ఫ్యూచర్ కాపిటల్ దేశీయ కార్పొరేట్ రంగంలో పేరున్న వి కావడం గమనార్హం.

అసలేం జరిగింది... కార్వీ ఫిర్యాదు పత్రం, కోర్టులో పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం... దక్కన్ క్రానికల్ హోల్డింగ్ ప్రమోటర్లు ఉమ్మడిగా కంపెనీ ఈక్విటీలో 54 శాతం షేర్లను తాకట్టుపెట్టి ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ ఫ్యూచ ర్ కాపిటల్ నుంచి రూ.170 కోట్లు సమీకరించారు. ఇం దులో రూ.150 కోట్లు దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు, మిగిలిన రూ.20 కోట్లు ఎవియోటెక్ ప్రమోటర్లు (వారూ వీరు ఒక్కటే) తీసుకున్నారు.

స్టాక్ బ్రోకింగ్, డిపాజిటరీ సర్వీసుల్లో ఉన్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌లోని తమ డీమ్యాట్ ఖాతాల్లో మొత్తం 11,28,51,000 డీసీహెచ్ఎల్ షేర్లు (కంపెనీ ఈక్విటీలో 54 శాతం వాటాకు సమానం) ఉన్నట్టు ఫ్యూచర్ కాపిటల్‌కు తెలియజేశారు. తాకట్టు కారణంగా ఈ షేర్లను ఫ్యూచర్ కాపిటల్ ఆమో దం లేకుండా వేరొకరు తాకే వీల్లేదు. దక్కన్ క్రానికల్ ప్రమోటర్లతో తమ డీల్ గురించి వెల్లడిస్తూ, వారి డీమ్యా ట్ ఖాతాల్లోని షేర్ల వివరాలను తెలియజేయాలని, ఫ్యూచర్ కాపిటల్ పేరిట తయారుచేసిన నాన్ డిస్పోజల్ -పవర్ ఆఫ్ అటార్నీ (ఎన్‌డియు-పీవోఏ)పై కౌంటర్ సైన్ చేయాలని కోరుతూ కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు ఫ్యూచ ర్ కాపిటల్ లేఖ రాసింది.

ఆ నాటికి ఈ ముగ్గురి డిపాజిటరీ ఖాతాల్లో నికరంగా 6,04,50,000 దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు మాత్రమే ఉన్నాయి. వారు కోరినట్లు ఎన్‌డీయు-పీవోఏపై సంతకాలు చేస్తూ, ఇవే వివరాలను ఫ్యూచర్ కాపిటల్‌కు కార్వీ తెలియజేసింది. తర్వాత కొద్దిరోజులకు మే 28న దక్కన్ క్రానికల్ ప్రమోటర్ల డిపాజిటరీ ఖాతాల్లో షేర్ల సంఖ్య పెరిగిందా లేదా చెప్పాల్సిందిగా కోరుతూ ఫ్యూచర్ కాపిటల్ నుంచి మరో లేఖ కార్వీకి అందింది. ఈ విషయం దక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు తెలియజేస్తూ వెంటనే డిపాజటరీ ఖాతాల్లోకి అవసరమైన షేర్లను బదిలీ చేయాల్సిందిగా కార్వీ సూచించింది.

అయితే ఆ అవసరం లేదని ఫ్యూచర్ కాపిటల్‌తో ఒప్పందం రద్దైనందున, కార్వీ సంతకం చేసిన నాన్ డిస్పోజల్ అండర్‌టేకింగ్-పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ కూడా రద్దైనట్టేనని దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు తెలియజేశారు. దీనికి సంబంధించిన పత్రాలు త్వరలోనే కార్వీకి అందుతాయని నమ్మబలికారు. కంపెనీ స్థాయి, ప్రమోటర్ల అంతస్తు, ట్రాక్ రికార్డు దృష్ట్యా వారి మాటలను కార్వీ విశ్వసించింది.

నమ్మకంపై గేమ్.. కార్వీని నమ్మించిన దక్కన్ క్రానికల్ ప్రమోటర్లు, తమ షేర్లలో కొంతభాగాన్ని రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ అనే మరో సంస్థలోని తమ డిపాజిటరీ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. మరికొన్నిటిని ఐడీఎఫ్‌సీకి తాకట్టు పెట్టి కొత్త రుణాలు తీసుకున్నారు. తాకట్టు తొలగిందన్న భావనతో వారు కోరినట్లు షేర్ల బదిలీకి కార్వీ అనుమతించింది.

కానీ, ఫ్యూచర్ కాపిటల్‌తో ఒప్పందం రద్దు, పవర్ ఆఫ్ అటార్నీ రద్దుకు సంబంధించిన పత్రాలు జూలై రెండో వారందాకా అందకపోవడంతో కార్వీ మళ్లీ మళ్లీ దక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు లేఖలు రాసింది. వారి నుంచి సమాధానం లేదు. ఈ లోగా జూలై 17న కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు ఫ్యూచర్ కాపిటల్ నుంచి మరో లేఖ అందింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్‌లో ్ల వెంకట్రామ్‌రెడ్డి, వినాయక్ రవిరెడ్డి, పికె అయ్యర్ పేరుతో ఉన్న డిమ్యాట్ ఖాతాల్లోని మొత్తం 11,28,51,000 డిసిహెచ్ఎల్ షేర్ల ను తమకు తాకట్టు పెట్టినందున ఈ షేర్లపై అధికారం తమకే ఉందని ఆ లేఖలో ఫ్యూచర్ కాపిటల్ పేర్కొంది.

ఈ లేఖతో పాటు ఈ మూడు ఖాతాల్లో ముందుగా ఉన్న 6,04,50,000 షేర్లకు తోడుగా ప్రతి ఖాతాలోనూ అదనంగా 1,74,67,000 షేర్లు (మొత్తం 5,24,01,000 షేర్లు) జమైనట్టు కార్వీ రాసిన లేఖ ప్రతిని కూడా ఫ్యూచ ర్ కాపిటల్ జత చేసింది. దీంతో కార్వీకి దిమ్మతిరిగింది. ఈ లేఖ తాము రాయనేలేదని పేర్కొంటూ వివరణ ఇవ్వాల్సిందిగా దక్కన్ క్రానికల్ ప్రమోటర్లను నిలదీసిం ది.

ఆ ఖాతాల్లో షేర్లు పెరగకపోగా ఉన్న షేర్లు కూడా తరిగిపోవడంతో కార్వీ బెంబేలెత్తింది. డిసి ప్రమోటర్ల వివరణ కోరుతూ జూలై 20న లేఖ రాసింది. వారి నుంచి సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిం ది. ఈ నేపథ్యంలో డీసీహెచ్ఎల్ షేరు ధర బుధవారం నాడు 13.95 రూపాయల కనిష్ఠస్థాయిని తాకింది.

డీమ్యాట్ అకౌంట్: గతంలో కంపెనీలు వాటాదారులకు కాగితంపై ముద్రించిన షేర్ సర్టిఫికెట్లను (ఫిజికల్) అందజేసేవి. ఇప్పుడు వాటి స్థానే ఇ-సర్టిఫికెట్స్ వచ్చాయి. డిపాజిటరీ పార్టిసిపెంట్స్‌గా ఉన్న సంస్థల్లో ఖాతాలు తెరిచి వాటిలో ఇ-షేర్లను నిల్వచేస్తారు. స్టాక్ మార్కెట్ క్రయవిక్రయాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున ఈ షేర్ల బదిలీ కూడా ఆన్‌లైన్‌లోనే ఒక ఖాతాలోంచి మరో ఖాతాలోకి జరుగుతుంది.

ఆ షేర్లు ఏమైనట్టు?
కార్వీ ఫిర్యాదును బట్టి ఫ్యూచర్ కాపిటల్ దగ్గర తాకట్టుపెట్టినట్టు చెబుతున్న 54శాతం వాటాలు ఫ్యూచర్ కాపిటల్ దగ్గరలేవు. అవి ఏమైనట్టు? ఈ కేసులో ఫ్యూచర్ కాపిటల్ స్పందన ఇంతవరకు తెలియలేదు. దక్కన్ క్రానికల్ ప్రమోటర్ల చేతుల్లో రూ. 170 కోట్ల మేర మోసపోయిన ఫ్యూచర్ కాపిటల్ ఇప్పటివరకైతే ఎలాంటి ప్రకటన చేయలేదు.

దక్కన్ క్రానికల్‌లో ముగ్గురు ప్రమోటర్లకు 73.8 శాతం వాటా ఉంది. కార్వీ ఫిర్యాదులోని అంశాల ప్రకారం రెలిగేర్‌వద్ద తాకట్టు పెట్టిన షేర్లు కూడా దక్కన్ క్రానికల్ ప్రమోటర్లవేనని అర్ధం అవుతోంది. ఈ షేర్లు 14 శాతం మాత్రమే. వీరికి ఎన్ని సంస్థల్లో డిమ్యాట్ ఖాతాలున్నాయి. వాటిలో నిల్వ ఉన్న షేర్లు ఎన్ని? తాకట్టులో ఉన్న షేర్ల మొత్తం ఎంత? ఫ్రీగా ఉన్న షేర్లు ఎన్ని? తాకట్టు పేరుతో వారు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిల నుంచి సమీకరించింది ఎంత? కార్వీని, ఫ్యూచర్ కాపిటల్‌ను మోసగించినట్టే ఇతర సంస్థల్లోనూ ఇలాంటి దందా జరిగిందా? ఈ ప్రశ్నలకు జవాబు రావాల్సి ఉంది.

మరోవైపు ఈ మొత్తం ఉదంతంపై సెబి, కంపెనీ వ్యవహారాల మం త్రిత్వ శాఖ కూడా దృష్టి సారించినట్టు చెబుతున్నారు. మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు స్థానిక అధికారులనుంచి నివేదిక కోరినట్టు తెలిసింది. రానున్న రెండుమూడు రోజుల్లో ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,672
హైదరాబాద్: దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌పై రకరకాలుగా మీడియా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ చైర్మన్ టి. వెంకట్రామ్ రెడ్డి ఓ ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన ఆయనకు చెందిన ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చింది. దాన్ని ఇక్కడ యధాతథంగా ఇస్తున్నాం -
డక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి, రుణ ఒప్పందాల కింద చెల్లింపుల జాప్యం గురించి కొద్ది రోజులుగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.
అసలు సమస్య ద్రవ్యలభ్యత సంక్షోభమనీ... ఇండియాలో దేశీయ, మల్టీనేషనల్ కంపెనీలు అడ్వర్టయిజ్‌మెంట్ ఖర్చును గణనీయంగా తగ్గించిన కారణంవల్ల ఇది ఉత్పన్నమైందనీ యాజమాన్యం స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం, యూరోపియన్ సంక్షోభాల ప్రభావం భారత ఆర్థిక రంగంపై గణనీయంగా పడింది.

డక్కన్ క్రానికల్ సంస్థ నికర విలువ ఇప్పుడు చెల్లించవలసిన బకాయిలకంటే చాలా ఎక్కువ. రుణాల బకాయిలు, ఇతర బాకీలు కడచిన రెండునెలలలో జరగవలసిన చెల్లింపులకు సంబంధించినవి మాత్రమే.

75 ఏళ్ల చరిత్రగల అగ్రగామి దినపత్రికగా డక్కన్ క్రానికల్ విలువ, భూములు, భవనాల స్థిరాస్థి విలువ, చాలా ప్రాంతాల్లోని ప్లాంట్లు, మెషినరీ విలువ, డక్కన్ చార్జర్స్ ఐ.పి.ఎల్. టీము విలువ కంపెనీకున్న రుణభారం కంటే చాలా ఎక్కువ.
కంపెనీ చేసిన అప్పు మామూలు వ్యాపార నిర్వహణ క్రమంలో చేసినదే. అది వేలకోట్ల రూపాయల్లో ఉన్నట్టు మీడియా కథనాల్లో పేర్కొన్నది అబద్ధం. ఢిల్లీ ట్రిబ్యునల్ వద్ద రుణం రికవరీకి కేసు వేసిన ఐ.ఎఫ్.సి.ఐ 25 కోట్ల రూపాయల చెల్లింపులో జాప్యానికిగాను కంపెనీ లిక్విడేషనుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంకో పిటిషన్‌ను వేసింది.
ఇంతకాలం తన కార్యకలాపాలన్నిటిలో అండగా నిలిచిన రుణదాతలకు డక్కన్ క్రానికల్ సంస్థ కృతజ్ఞతను, సంపూర్ణ నిబద్ధతను తెలియజేస్తున్నది. ప్రస్తుత ద్రవ్య సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు వారితో చురుకుగా సంప్రదింపులు జరుపుతున్నది.
- టి.వెంకట్రామ్‌రెడ్డి
చైర్మన్, డి.సి.హెచ్.ఎల్