Author Topic: ‘మండలి’వైపే కాంగ్రెస్ మొగ్గు!  (Read 272 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
అధికారాలు, కేంద్ర నిధుల కేటాయింపు
పార్లమెంట్ సమావేశాల్లోపు నిర్ణయం?
రాజ్యాంగంలోని 371 డి ఆర్టికల్ అమలుకు పటిష్ట చర్యలు
రాష్ట్ర ఉన్నతాధికారులతో కేంద్రం సమావేశం.. ఆర్టికల్ 371 డి వివరాలు అందించిన అధికారులు
కర్ణాటక కోరిన 371 జె ఆర్టికల్‌కు కూడా కేంద్రం ఓకే..
గుల్బర్గా, బీదర్, రాయచూర్, కొప్పల్, యాద్గిర్, బళ్లారిలతో కొత్తగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి మండలి ఏర్పాటు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇటీవలి కాలంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశంపై త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఆ దిశగా కేంద్రం ముమ్మర కసరత్తు చేపట్టింది. రాష్ట్ర పార్టీలో, ప్రభుత్వంలో మార్పులు తలపెట్టిన నేపథ్యంలో వాటితో ముడిపడిన తెలంగాణ అంశంపైన కూడా నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాజకీయ కోణంలో సుదీర్ఘ సమాలోచనల అనంతరం తెలంగాణకు ప్యాకేజీతో కూడిన ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటుకే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గుచూపినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

యూపీఏకు మద్దతునిస్తున్న పార్టీలకు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం తగ్గిన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా ఒక అభివృద్ధి మండలి ఏర్పాటు చేయడమే మంచిదన్న ఆలోచనకు వచ్చినట్టు ఆ వర్గాలు చెప్పాయి. ఈ నిర్ణయం వెల్లడించడానికి ప్రత్యేకంగా కాలపరిమితిని నిర్దేశించనప్పటికీ, ఈ నెల 22న ప్రారంభంకానున్న పార్లమెంట్ సమావేశాల్లోగానే దీనిపై నిర్ణయం జరగొచ్చని చెబుతున్నాయి. ఇదివరకటి ప్రాంతీయ అభివృద్ధి మండలిలా కాకుండా కొన్ని విస్తృత అధికారాలు, కేంద్ర నిధులతో ప్రత్యేక ప్యాకే జీ ఇందులో ఇమిడి ఉంటుంది. ఈ మండలి ఏర్పాటుపై రాష్ట్రంలోని పార్టీకి చెందిన ముఖ్యుల అభిప్రాయాలను ఏఐసీసీ పెద్దలు తీసుకున్నారు. దీనికి తోడు స్థానిక రిజర్వేషన్లకు సంబంధించి గతంలో రాజ్యాంగంలో చేర్చిన 371 డి ఆర్టికల్‌ను కేంద్రం ప్రత్యేకంగా మరోసారి పరిశీలించినట్టు సమాచారం. ఈ ఆర్టికల్ అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన సాంకేతికాంశాలను ఇప్పటికే రాష్ట్రం నుంచి సేకరించినట్టు చెబుతున్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ నేపథ్యంలోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కర్ణాటక రాష్ట్రం కోరిన విధంగా రాజ్యాంగంలో 118వ సవరణ ద్వారా 371 జె ప్రకరణను చేర్చాలని కూడా కేంద్రం నిర్ణయించింది. కర్ణాటకలో వెనుకబడిన గుల్బర్గా, బీదర్, రాయ్‌చూర్, కొప్పల్, యాద్గిర్, బళ్లారి జిల్లాలకు ప్రత్యేకంగా హైదరాబాద్-కర్ణాటక అభివృద్ధి మండలి ఏర్పాటుకు రాజ్యాంగంలో కొత్తగా 371 జె ప్రకరణను చేర్చి తద్వారా రాజ్యాంగపరమైన అధికారాలను కల్పించాలని ఆ రాష్ట్రం కోరిన విషయం తెలిసిందే. బీజేపీ పాలిత కర్ణాటక రాష్ట్రం కోరిన 371 జె ప్రకరణను రాజ్యాంగంలో చేర్చడానికి సంబంధించిన సవరణ బిల్లుకు త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయనున్నారు.

ఇతర రాష్ట్రాల డిమాండ్ల నేపథ్యంలోనే..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయిస్తే దేశంలోని ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడతాయన్న ఆందోళన ఢిల్లీ పెద్దల్లో ఉంది. తెలంగాణ అంశం దేశంలోని ఇతర డిమాండ్లతో ముడిపడి ఉందని ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే కూడా చెప్పారు. నిజానికి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన, అనంతర పరిణామాల్లోనే తెలంగాణ ఉద్యమం తీవ్రమైందని, ఆ ఉద్యమం తీవ్రత తగ్గితేనే కేంద్రం వైఖరిని వెల్లడించాలన్న ఆలోచనలో పార్టీ ఢిల్లీ నేతలు ఉన్నారని చెబుతున్నారు. దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు కాలేదన్న భావనతో నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నట్టు ఢిల్లీలోని కీలక నేత ఒకరు చెప్పారు.

తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలన్న ఆలోచన నేపథ్యంలోనే రాష్ట్రంలో నాయకత్వాల మార్పు చేయాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని చెబుతున్నారు. ఈ రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నందున కేంద్ర నాయకత్వం ఇటీవలి కాలంలో అన్ని కోణాల నుంచి సమీకరణలను అధ్యయనం చేసినట్టు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడం, బీజేపీ కొంతమేర బలాన్ని పెంచుకోవడాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికిఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడినందున తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీతో కూడిన ఒక అభివృద్ధి మండలి ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని, తద్వారా బీజేపీని సైతం రాజకీయంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని ఢిల్లీ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర నాయకుడొకరు చెప్పారు.

ఆ కోణంలోనే మార్పుచేర్పులు..

తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తే స్థానికంగా రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే రాష్ట్ర నాయకత్వంలోనూ మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణకు చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించడంతోపాటు ప్రత్యేక అభివృద్ధి మండలికి ఒక సీనియర్ నేతను చైర్మన్‌గా నియమించాలన్న అభిప్రాయానికి వచ్చారు. ‘‘2014 సాధారణ ఎన్నికలను ఎదుర్కొనడం కాంగ్రెస్ ముందున్న ప్రధాన సమస్య. దాని కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించడమే మా ముందున్న అంశం’’ అని ఢిల్లీ వ్యవహారాల్లో కీలకంగా ఉంటున్న నాయకుడొకరు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చలు

రాష్ట్రంలో విద్య, ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్లు, బదిలీలు, వాటితో ముడిపడి ఉన్న 371 డి ప్రకరణను రాష్ట్రంలో అమలు చేసిన తీరు, ప్రస్తుతం దాని పర్యవసనాలపై హోం శాఖ స్టాండింగ్ కమిటీ ఇటీవలే రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. వీటికి సంబంధించి పలు వివరాలను కోరుతూ సమావేశానికి హాజరు కావాలని ఆ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది. వివిధ కారణాలతో సీఎస్ హాజరుకానప్పటికీ రాష్ట్రం తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) అజయ్ మిశ్రా, స్టాంపులు, రిజిస్ట్రేషన్స్ ఐజీ, జీవో 610 అమలు పర్యవేక్షణాధికారి విజయ్‌కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో 371 డి ప్రకరణ, దాని నేపథ్యంపై ఈ సమావేశంలో అధికారులు వివరించినట్టు తెలిసింది. మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు చెందిన అధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు.

కర్ణాటకలో హైదరాబాద్-కర్ణాటక అభివృద్ధి మండలి

హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ కర్ణాటక రాష్ట్ర శాసనసభ, శాసన మండలి 2012 మార్చిలో ఒక తీర్మానం ఆమోదించింది. అంతర్‌ప్రాంతీయ, అంతర్ జిల్లాల మధ్య అసమానతలను తొలగించి సమాన ప్రాతిపదికన అభివృద్ధి పరచడం ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం. ఈ తీర్మానంపై గత సెప్టెంబర్ 7న పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 118 రాజ్యాంగ సవరణ ద్వారా 371 జె ఆర్టికల్‌ను చేరుస్తారు. ప్రస్తుతం ఇది బీజేపీ నేత వెంకయ్యనాయుడు చైర్మన్‌గా ఉన్న హోం శాఖ స్టాండింగ్ కమిటీ పరిశీలనలో ఉంది. శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే ఈ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా ఆ రాష్ట్రంలోని గుల్బర్గా, బీదర్, రాయ్‌చూర్, కొప్పల్, యాద్గిర్, బళ్లారి జిల్లాలు హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోకి వస్తాయి. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు వీలవుతుంది. తద్వారా ఎలాంటి వివక్ష లేకుండా నిధులు కేటాయిస్తారు. విద్య, ఉద్యోగ కల్పనలో ఈ ప్రాంతీయులకు రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్రపతి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర గవర్నర్ ఈ చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
Source: Sakshi