Author Topic: రాజ్యాంగ సవరణ తప్పదు?  (Read 239 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
రాజ్యాంగ సవరణ తప్పదు?
« on: November 16, 2013, 07:29:05 AM »
‘హైదరాబాద్’ను తేల్చాకే ఆర్థిక నివేదిక
కీలకాంశాలపై జీవోఎం తర్జనభర్జన
అటార్నీ జనరల్‌తో మంత్రుల బృందం భేటీ
సీమాంధ్రకు రెండు రైల్వే జోన్లు: రైల్వే శాఖ సిఫార్సు
------------
రెండు ప్రాంతాలకూ వివాదాస్పదంగా తయారైన 371(డి) అమలు అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో, జీవోఎంకు సమస్య సవాల్‌గా మారుతోంది. రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన 371(డి) అధికరణాన్ని ఆర్డినెన్సు ద్వారా తొలగించేందుకు ఎంతమాత్రం వీల్లేదని న్యాయ శాఖ చెప్పడంతో సమస్య మరింత బిగుస్తోంది.
--------------
న్యూఢిల్లీ, నవంబర్ 14: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాదు స్థాయి ఏమిటి? 371(డి) సమస్యను ఎలా పరిష్కరించాలి? ఈ అంశాలపై హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలోని జీవోఎం తర్జనభర్జనలు పడుతోంది. 371(డి), హైదరాబాదు హోదా అంశంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు జీవోఎం శుక్రవారం భారత అటార్నీ జనరల్ జి వాహనావతిని తమ వద్దకు పిలిపించుకుని లోతుగా చర్చలు జరపటం గమనార్హం. అటార్నీ జనరల్‌తోపాటు న్యాయ శాఖ కార్యదర్శి కూడా జీవోఎం ముందు విడిగా హాజరై రెండు వివాదాస్పద అంశాలపై తమ అభిప్రాయాలను మంత్రులకు వివరించాల్సి వచ్చింది. నాలుగున్నర గంటలపాటు సాగిన జీవోఎం -ప్రభుత్వ కార్యదర్శుల భేటీలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లు రూపకల్పనపై లోతుగా చర్చలు జరిగాయి. 2013లోగా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి చేయాలనే పట్టుదలతో శరవేగంతో ముందుకు సాగుతున్న జీవోఎం, ప్రభుత్వ కార్యదర్శులతో మరో రెండు దఫాలుగా చర్చలు జరపనుందని అంటున్నారు. విభజన తరువాత ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలు ఒక భాగంగా, విధాన సభ తదితర శాసన సంబంధమైన అంశాలపై చర్చించేందుకు జీవోఎం మరో రెండుసార్లు కార్యదర్శులతో భేటీ జరిపే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదు పరిధి, హోదాపై హోంశాఖ తుది నిర్ణయం తీసుకున్న తరువాతే ఆర్థికపరమైన అంశాలపై తమ నివేదిక అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికార్లు జీవోఎంకు సూచించినట్టు సమాచారం. రాష్ట్ర విభజనతో దక్షిణ మధ్య రైల్వే రెండుగా విడిపోవాల్సి ఉన్నందున, కొత్త రాష్ట్రానికి రెండు లేదా మూడు రైల్వే జోన్లను కేటాయించాలని రైల్వే శాఖ సఫారసు చేసినట్టు తెలిసింది. హైదరాబాదు తరువాత రాష్ట్రంలో పెద్ద నగరాలుగా గుర్తింపు పొందిన విజయవాడ, విశాఖపట్నంలో ఈ జోన్లు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల బదిలీలపై స్పష్టత సాధించినట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ఉద్యోగుల విషయంలో కూడా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. సీమాంధ్రలో అదనంగా రెండు ఓడరేవులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రుల రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని న్యాయ, ఆర్థిక, హోం, రవాణా, పౌరవిమానయానం, ప్రాథమిక సదుపాయాలు, రైల్వే శాఖల కార్యదర్శులతో జీవోఎం గురువారం సుదీర్ఘ చర్చలు జరిపింది. రెండు ప్రాంతాలకూ వివాదాస్పదంగా తయారైన 371(డి) అమలు అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో, అటార్నీ జనరల్ సలహాను జీవోఎం కోరింది. రాజ్యాంగ సవరణ ద్వారా లభించిన 371(డి) అధికారాన్ని వదులుకునేందుకు రెండు ప్రాంతాల వారూ ఇష్టపడక పోవటం గమనార్హం. అయితే తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఈ అధికరణాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ అధికరణతో తమకు పనిలేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వాదిస్తున్నారు. అయితే తెలంగాణ రాజకీయ జెఏసి చైర్మన్ కోదండరాం మాత్రం 371(డి) ఉండితీరాలని పట్టుబడుతున్నారు. ఇదిలావుంటే రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన 371(డి) అధికరణాన్ని ఆర్డినెన్సు ద్వారా తొలగించేందుకు ఎంతమాత్రం వీల్లేదని న్యాయ శాఖ అభిప్రాయపడినట్టు తెలిసింది. 371(డి)ని రద్దు చేయాలంటే మరోసారి రాజ్యాంగాన్ని సవరించి యాభై శాతం రాష్ట్రాల అనుమతి పొందాల్సి ఉంటుందని న్యాయ శాఖ జీవోఎంకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీనిపై జీవోఎం ప్రభుత్వంలోని ఇతరులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయానికి వస్తుందని అంటున్నారు. ఇక హైదరాబాదు స్థాయి విషయంలో ఏ చట్టం ద్వారా శాంతి భద్రతలు, రెవెన్యూ, భూమి అంశాలను గవర్నురు లేదా కేంద్ర హోం శాఖ పరిధిలోకి తీసుకురాగలుగుతామనే అంశంపై జీవోఎం తలమునకలై ఉంది. అత్యంత కీలకమైన జల వనరుల పంపిణీకి ఉన్నతస్థాయి యాజమాన్య బోర్డును నియమించాలా? లేక అధికారులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయాలా? అనేది జీవోఎం తేల్చాల్సి ఉంది. జల వివాదాల పరిష్కారానికి సంబంధించినంత వరకూ ఏ రాష్ట్రం కూడా ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతరు చేయటం లేదనేది అందరికీ తెలసిందే. అందుకే రాష్ట్ర విభజన అనంతరం ఎదురయ్యే జల వివాదాల పరిశీలనకు కేంద్ర జలవనరుల మంత్రి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసి, దాన్ని కేంద్ర జల సంఘంతో అనుసంధానం చేయాలని కేంద్రం యోచిస్తోంది. దాదాపు మూడు గంటలు జరిగిన జీవోఎం కార్యదర్శుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. గురువారం జీవోఎం సమావేశానికి షిండేతో గ్రామీణాభివృద్ధి మత్రి జైరాం రమేష్, పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు.

టాస్క్ఫోర్సు వివరణ
ప్రభుత్వ కార్యదర్శులతో సమావేశం జరిపేందుకు ముందు హోం శాఖ సలహాదారు విజయకుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సు తన నివేదికపై జీవోఎంకు పూర్తి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. రెండు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సిబ్బంది పెంపుదల, ఆధునిక సదుపాయాల ఏర్పాటు, తీవ్రవాదంపై టాస్క్ఫోర్సు తన అభిప్రాయాలను జీవోఎంకు వివరించింది.