Author Topic: జీవిత ధీమా!  (Read 178 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
జీవిత ధీమా!
« on: December 24, 2013, 07:50:13 AM »
జీవితంలో సక్సెస్ అంటే ఏమిటి?
 ఇంగ్లిష్ మీడియంలతో గట్టెక్కడమా?
 ఇంజనీరింగ్ పట్టాలతో ఒడ్డెక్కడమా?
 సెక్యూర్ జాబ్‌ని దక్కించుకోవడమా?
 కానీ సక్సెస్ అంటే ఇవి మాత్రమే కాదంటున్నారు వెంకటేశ్వరరావు.
 పుట్టిపెరిగింది పల్లెటూరైనా... చదువులు చెట్టెక్కిపోయినా...
 తాను ఉట్టికెగరలేనేమోనని నిరాశపడని నిత్య ఆశావాదంతో
 ఏకంగా భూతల స్వర్గం అనుకునే అమెరికాకు ఎగిరారు.
 అక్కడి క్లయింట్లను కూడా అవలీలగా ఆకట్టుకున్నారు.
 లక్ష క్లయింట్లను లక్ష్యంగా పెట్టుకున్న ఈయన
 కోట్ల కమీషన్‌తో ఫోర్బ్స్ మ్యాగజీన్‌లో స్థానం పొందారు.
 కోటీశ్వరుల సరసన తానూ ధీమాగా నిలబడ్డారు.
 ఆ పాలసీ బీముడి వాస్తవ కథ... ఆ జీవితభీముడి విజయగాథ...
 నేటి ప్రజాంశంలో...

 
రెండు వేల మంది క్లయింట్స్... 40 దేశాల్లో కార్యకలాపాలు...  ఏటా కోట్లరూపాయల ఆదాయం... రాష్ట్ర రాజధానిలోని నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు... 1.89 కోట్లు ఖరీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్... ఇవన్నీ ఉన్నాయంటే అతనొక బిజినెస్ టైకూనో, బడాబడా సంస్థ సీఈఓనో అనుకుంటున్నారా! కానే కాదు... ఆయన ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. యథాలాపంగా ఎల్‌ఐసీ ఏజెన్సీ తీసుకుని... ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. గడిచిన ఏడాది 2 కోట్ల రూపాయలకు పైగా కమీషన్ పొందారు. అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫోర్బ్స్ మ్యాగజీన్‌లో గతనెల (నవంబర్) స్థానం సంపాదించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివసిస్తున్న ఎల్‌ఐసీ ఏజెంట్ వాకలపూడి వెంకటేశ్వరరావును ఈ సందర్భంగా కలిసినప్పుడు తన విజయప్రస్థానాన్ని ఇలా వివరించారు. అది ఆయన మాటల్లోనే...
 
ఇంగ్లిష్ మీడియంలో చదవలేక... ఇంజినీరింగ్‌లో ఫెయిలై...

మాది పశ్చిమ గోదావరిజిల్లా తణుకు సమీపంలోని కాల్దరి గ్రామం. ఇంటర్మీడియట్ తరవాత ఇంజనీరింగ్ కోసం 1986లో హైదరాబాద్ వచ్చాను. అప్పటివరకు  తెలుగు మాధ్యమంలో కొనసాగిన చదువు ఒకేసారి ఆంగ్లమాధ్యమంలోకి మారడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. వరుసగా మూడేళ్లు ఫెయిలయ్యాను. దాంతో మా నాన్నగారు ఫీజు కోసం డబ్బు పంపడం మానేశారు. ఇంటికి వచ్చేసి, వ్యవసాయం చేయమన్నారు. అప్పుడు నా వయస్సు 19 ఏళ్లు. తిరిగి వెళ్లడం ఇష్టం లేక రూ.50 వేల రుణంతో సికింద్రాబాద్‌లో నోట్‌బుక్ తయారీ యూనిట్ ఒకటి ప్రారంభించాను. దాంట్లో నష్టాలు రావడంతో మూడేళ్ల తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీకి మారాను. 1997లో నాన్నగారు మరణించడంతో వైజాగ్ వెళ్లి పౌల్ట్రీ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టి 2005 వరకు ఇదే వ్యాపారం చేస్తూ దూరవిద్య ద్వారా ఎం.ఏ. పూర్తి చేశాను. ఈ వ్యాపారం రెండుమూడేళ్లు బాగున్నా... ఆ తరవాత అందులో కూడా నష్టాలే వచ్చాయి.
 
ఏజెంట్‌గా మారతానని ఊహించలేదు
 
 నెలకు 50 వేల  రూపాయల జీతంతో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు స్నేహితులు, ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు కోసం ఎల్‌ఐసీ పాలసీ గురించి నన్ను సంప్రదించారు. వారి కోసమని, నా చేత  పాలసీలు చేయించిన ఏజెంట్‌ను రమ్మన్నాను. అయితే అతను రెండు నెలలైనా రాలేదు. ఒకవైపు స్నేహితుల నుంచి తీవ్రమైన ఒత్తిడి. అప్పటి కొవ్వూరు ఎమ్మెల్యే కృష్ణబాబు గారి ప్రోద్బలంతో నేనే ఏజెంట్‌గా చేరాను. ప్రోద్బలం అనడం కన్నా... ఓ రకంగా ఒత్తిడి చేశారనవచ్చు. నిజానికి ఆయన మాట కాదనలేక ఏజెన్సీ తీసుకున్నాను. నా మిత్రులు ఆరుగురికి పాలసీ చేసిన తరవాత, నేను ఏజెంట్‌గా తగనని భావించి, కొద్దో గొప్పో తెలిసిన పౌల్ట్రీ వ్యాపారంలోకి మళ్లీ వెళ్లాను.
 
మలుపుతిప్పిన జీవన్‌శ్రీ
 
 ఎల్‌ఐసిలో బాగా పాపులరైన జీవన్‌శ్రీ పాలసీ 2001లో క్లోజ్ అవుతున్న సమయంలో...  మా డెవలప్‌మెంట్ ఆఫీసర్ రఘు పట్టుబట్టి, పాలసీలు చేయమని నన్ను ప్రోత్సహించారు. అప్పట్లో ఆ పాలసీ చేయడానికి జనం ఎగబడుతుండటంతో... ఆఖరి 15 రోజుల్లో 4.5 కోట్ల రూపాయల వ్యాపారం చేశాను. ఇది నన్ను అమెరికా బాట పట్టించింది. అక్కడి ఎండీఆర్‌టీఏ సభ్యుడిగా 2002లో మొదటిసారిగా అమెరికా వెళ్లాను. లాస్‌వెగాస్‌లో సెవెన్ స్టార్ హోటల్‌లో బస ఏర్పాటుచేశారు. (ఎండీఆర్‌టీఏ అంటే మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్. ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏజెంట్స్/అడ్వయిజర్స్‌ను ఆయా ఇన్సూరెన్స్ సంస్థలు ఎండీఆర్‌టీఏకి నామినేట్ చేస్తాయి. ఆయా రంగాలలో అభివృద్ధి చెందడానికి అవసరమైన శిక్షణలను అది ఇస్తుంది).
 
 అప్పటివరకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే నా దృష్టిలో పంచెకట్టుకుని, డొక్కువాహనంపై, ఫైలు పట్టుకుని తిరుగుతూ ఉండేవారే. జీవన్‌శ్రీ పుణ్యమాని రూ.4.5 కోట్ల వ్యాపారం చేసినా, నా దృష్టి మారలేదు. అయితే లాస్‌వెగాస్ పర్యటన నా ఈ దృక్పథాన్ని మార్చేసింది. అక్కడ నుంచి తిరిగి వచ్చాక, ఎల్‌ఐసీ ఏజెన్సీతో పాటు పౌల్ట్రీ వ్యాపారం కూడా కొనసాగించాను. 2005లో మా అమ్మ మరణించారు. పౌల్ట్రీ వ్యాపారంలో నష్టాలు పెరిగాయి. దాంతో పూర్తిస్థాయి ఎల్‌ఐసీ ఏజెంట్‌గా మారాను. ఇక వెనుతిరిగి చూడలేదు.
 
స్వచ్ఛందసంస్థ ఏర్పాటుచేసి...
 
ఆర్థికంగా వెనుకబడి ఉన్న పల్లె ప్రజలను ఆదుకోవాలనుకున్నాను. దీనికోసం నా స్నేహితులు, క్లయింట్ల సాయంతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాను. ఐఎస్‌బీలో నేర్చుకున్న విషయాలతో పాటు ప్రొఫెసర్ల సాయంతో ఆ ఐఎస్‌బీకే కోర్సు రూపొందించి, అక్కడ ఎన్నో అంశాలను బోధిస్తున్నాను.
 
ఏజెంట్లకు గర్వకారణం అనేదే సంతృప్తి
 
నన్ను, నా స్థాయిని చూసి ఎన్నో రంగాలకు చెందిన వారు ఎల్‌ఐసీ ఏజెంట్స్‌గా మారారు. ఇది అన్నింటికంటే తృప్తినిస్తోంది. నా దగ్గర ఒకసారి పాలసీ చేసినవాళ్లు నా కుటుంబంగా మారిపోతారు. వారివల్లే నేను ఈ స్థాయికి వచ్చాను... అంటూ సంతృప్తిగా ముగించారు వెంకట్. ఆంగ్లమాధ్యమంలో చదవలేక చదువుకే దూరమైన వ్యక్తి దాదాపు 40 దేశాలు తిరిగి, ఎల్‌ఐసి వంటి అతిపెద్ద సంస్థ తరపున బిజినెస్ స్కూల్‌కు కోర్సు డిజైన్ చేసే స్థాయికి ఎదిగిన వైనాన్ని విశ్లేషిస్తే... తన బలాన్ని గుర్తించిన మనిషికి అదే బలంగానూ, ఆ నిత్యవిజయ కాంక్షే అతిపెద్ద బలహీనతగా మారుతుందనే వాస్తవం మనకు అవగతమవుతుంది.
 
- శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
 
విక్టోరియాస్ విన్నర్స్సీక్రెట్‌నే ఫాలో అయ్యాను

 విక్టోరియా యుద్ధవీరులు పడవలపై యుద్ధానికి వెళ్లినప్పుడు రాత్రి వేళ తీరాన్ని చేరుకుంటారు. ఆ వెంటనే వారు వచ్చిన పడవల్ని కాల్చేస్తారు. దీంతో యుద్ధరంగం నుంచి మడమతిప్పే అవకాశం ఉండదు. కేవలం డూ ఆర్ డై ఆప్షన్ మాత్రమే మిగులుతుంది. ఆ స్థితి వారిలోని పోరాట పటిమను పెంచుతుంది. దీన్నే విక్టోరియాస్ విన్నర్స్ సీక్రెట్ అంటారని అమెరికాలోని ఎండీ ఆర్‌టీఏ (మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అసోసియేషన్)లో బోధించారు. ప్రతి ఏడాదీ ఇలాంటి గోల్‌నే ఏర్పాటు చేసుకుంటాను.  2020 నాటికి ప్రతి వ్యక్తికీ ఓ పాలసీ ఉండాలన్నది ఎల్‌ఐసీ లక్ష్యమైతే, ఈ లోపే లక్ష పాలసీలు పూర్తి చేసి మరో రికార్డ్ సృష్టించాలనేదే నా గోల్!