Author Topic: ఉపాసన నన్ను ప్రేమకథలు చేయమంటోంది!  (Read 331 times)

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672

ఒకే కోవలోని సినిమాలు చేయడానికి రామ్‌చరణ్ అస్సలు ఇష్టపడరు. ఆయన నటించిన తొలి మూడు సినిమాలే అందుకు ఉదాహరణలు. కొత్తదనం కోసం పరితపించడం తండ్రి చిరంజీవి నుంచి చరణ్‌కి అబ్బిన లక్షణం. రచ్చ, ఎవడు, నాయక్... చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని, అక్టోబర్ 1న ‘గోవిందుడు అందరివాడేలే’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారాయన. ఈ సందర్భంగా చరణ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
 
‘గోవిందుడు అందరివాడేలే’ అని టైటిల్ పెట్టడానికి కారణమేంటి?
 హీరో పాత్ర తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అది. అంతేతప్ప ఆ సినిమాలో నా పేరు గోవిందుడేం కాదు. ఇందులో నా పేరు ‘అభిమన్యు’. ఎన్నారైని. తాత కోసం ఇండియా వస్తాను. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఇప్పటివరకూ ఇలాంటి కోవలోని సినిమా నేను చేయలేదు.
 
మీరూ, మీ నాన్నగారూ ఈ సినిమా చూశారా?
 విడివిడిగా చూశాం. అయితే... ఇద్దరం పూర్తిగా చూడలేదు. ఎడిటింగ్ టైమ్‌లో నేను కొంత చూశాను. నిజానికి ‘మగధీర’ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. అప్పుడు కుటుంబ కథల కోసం చాలా ప్రయత్నించాను. చాలామంది కథలు వినిపించారు కూడా. అయితే... ఎవరూ నన్ను ఒప్పించలేకపోయారు. ప్రతి ఒక్కరూ కుటుంబ కథ అని మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ చెప్పేవారు. మిక్స్‌డ్‌గా ఉంటే బావుంటుందని వాళ్లెంత చెప్పినా నాకెందుకో మింగుడు పడేది కాదు. కృష్ణవంశీ ఈ కథ చెప్పినప్పుడు... నేను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కథ ఇదే అనిపించింది. పైగా కృష్ణవంశీతో సినిమా చేయాలని నాకెప్పట్నుంచో కోరిక.. ఇలాంటి కథల్ని తెరకెక్కించడంలో ఆయన మాస్టర్. చాలామంది... మురారి, చందమామ చిత్రాల పోలికలు ఈ సినిమాలో ఉంటాయనుకుంటున్నారు. కొందరైతే... ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంతో కూడా పోల్చి మాట్లాడుతున్నారు. వారి అంచనాల్లో నిజం లేదు. ఇదొక ఫ్రెష్ సినిమా. ఇందులో ఏ సినిమాల పోలికలూ ఉండవు.
 
సినిమారంగంలో అందరూ సక్సెస్ వైపే పరుగెడుతుంటారు. మీరేంటి... పరాజయాల్లో ఉన్న కృష్ణవంశీతో సినిమా చేశారు?
 నేనెప్పుడూ సక్సెస్ వైపు పరిగెత్తలేదు. నాకు కథ ముఖ్యం. అందుకే తొందరపడి ఎవరికీ కమిట్ అవ్వను కూడా. మీరన్నట్లు కృష్ణవంశీ గత చిత్రాలు కొన్ని ఫ్లాపై ఉండొచ్చు. కానీ దర్శకునిగా ఆయన మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ఇది నిజం. పైగా కృష్ణవంశీ ఏ విషయంలోనూ రాజీ పడరు. నాకు అలాంటి దర్శకుడే కావాలి. అందుకే చేశాను.
 
ఎవరితోనూ తొందరపడి కమిట్ కాను అన్నారు. మరి మొదలై ఆగిన ధరణి దర్శకత్వంలోని ‘మెరుపు’, కొరటాల శివ సినిమాల మాటేంటి? అవి మొదలై ఆగిపోయాయి కదా?
 కథ నచ్చితేనే నిర్మాత దగ్గర్నుంచి డబ్బు తీసుకుంటాను. కొరటాల శివ కథ నాకు చూచాయగా నచ్చింది. అయితే... సంతృప్తిగా రాలేదు. అయితే... బండ్ల గణేశ్ ఒత్తిడి చేయడంతో ఆ సినిమాకు చెక్ తీసుకున్నాను. ఓపెనింగ్‌లో కూడా పాల్గొన్నాను. ఆ కథ కూడా ‘గోవిందుడు...’ లాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందుకే పక్కన పెట్టాల్సివచ్చింది.  ఇప్పుడు కాకపోయినా... తర్వాతైనా కొరటాల శివతో సినిమా చేస్తాను.
 
కథల విషయంలో చిరంజీవిగారి ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందంటారు నిజమేనా? ఆయనకు నచ్చకపోవడం వల్లే ‘గోవిందుడు...’ ఆలస్యమైందని పలువురి అభిప్రాయం.
 
 డెరైక్టర్ కోరుకుంటేనే నాన్నగారి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. అంతేతప్ప అనవసరంగా జోక్యం చేసుకోరు. ‘గోవిందుడు’ విషయం కొన్ని సీన్స్ నేటివిటీకి దూరంగా ఉన్నాయి. నాన్న సలహా మేరకు వాటిని మార్చాం.
 
రాజ్‌కిరణ్‌ని తప్పించి, ప్రకాశ్‌రాజ్‌ని తీసుకోవడం ఎవరి ఆలోచన?
 నాన్నగారితో పాటు అందరి నిర్ణయం అది. రాజ్‌కిరణ్ గొప్ప ఆర్టిస్ట్. కానీ... ఎందుకో ఆ పాత్రకు ఆయనకంటే ప్రకాశ్‌రాజ్ కరెక్ట్ అనిపించింది. ఒకప్పుడు ఎస్వీరంగారావుగారిలా... ఈ తరానికి ప్రకాశ్‌రాజ్ అనాలి. ఆయన్ను మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదంతే. అనుకున్నదానికంటే అద్భుతంగా నటించారాయన. ఆయన సూచనలు కూడా మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రకాశ్‌రాజ్ సీన్స్ తీయడం వల్ల అయిదు కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని చాలామంది అంటున్నారు కానీ... అలాంటిదేం లేదు. ఓ విధంగా బడ్జెట్ తగ్గింది. కృష్ణవంశీ సినిమాలకు భిన్నంగా... తక్కువ ఖర్చుతో, తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తయిన సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’.
 
కృష్ణవంశీ ఆర్టిస్టుల్ని పిండేస్తారని, ఆయనకు ఏదీ ఓ పట్టాన నచ్చదని అంటుంటారు. నిజమేనా?
 ఆయన ఆర్టిస్టుల్ని పిండేస్తారు. అలాగే... మేమూ ఆయన్ను పిండేశాం. ఒకటి మాత్రం నిజం. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకోవడంలో కృష్ణవంశీ దిట్ట. సీన్ పేపర్ చదవగానే... ఈ సీన్ ఇలా చేయాలని ప్రిపేర్ అవుతాం. కానీ లొకేషన్లోకి వెళ్లాక... అదే సీన్‌ని ఆయన మరోలా నేరేట్ చేస్తారు. చాలా కొత్తగా ఉంటుంది. ‘ఇలా కూడా చేయొచ్చా?’ అనిపిస్తుంది.
 
ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందని బండ్ల గణేశ్, యాభై ఏళ్లు గుర్తుంటుందని కృష్ణవంశీ అంటున్నారు. మీరేం అంటారు?
 కోరికలుంటాయి. తప్పేం లేదు. నా వరకు సినిమా బాగా ఆడి నిర్మాతకు డబ్బులొస్తే చాలు.

 ఇంతకూ... శ్రీను వైట్ల సినిమా ఉన్నట్లా? లేనట్లా?

 కథ నచ్చితే కచ్చితంగా చేస్తా. త్వరలోనే ఆ విషయం చెబుతా.
 
మణిరత్నం సినిమా చేస్తున్నారని వార్తలొచ్చాయి?
 ఆయన దర్శకత్వంలో నటించాలని ఎవరికుండదండీ. ఆయన ఫ్రేమింగ్, టేకింగ్ అద్భుతం. అయితే సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ డబ్బులు రావడం ముఖ్యం. ఆయన చెప్పిన కథ నాకు నచ్చలేదు. ఇప్పుడు ఆ కథతోనే ఆయన మమ్ముట్టి కుమారుడితో సినిమా చేస్తున్నారు. మంచి కథ దొరికితే ఆయనతో చేస్తా.
 
కోన వెంకట్, గోపీమోహన్‌ల కథ ఫైనల్ చేశారట?
 వారి కథ బాగుంది. అయితే... డెరైక్టర్ కోసం చూస్తున్నాం. అది కూడా త్వరలో చెబుతా. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది.
 
బాలీవుడ్ ‘జంజీర్’ ఫలితం నుంచి నుంచి మీరు నేర్చుకున్నదేంటి?
 నేర్చుకున్నదేం లేదు. అది ఆడలేదంతే.
 
‘లగాన్’ ఫేమ్ ఆశుతోశ్ గోవారీకర్‌తో సినిమా చేస్తున్నారట కదా?
 అవును. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా ఉంటుంది.
 
మీ సినిమాల విషయంలో మీ భార్య ఉపాసన ఏమైనా సలహాలిస్తుంటారా?
 ఆమె ప్రేమకథల్ని చేయమంటోంది. మంచి కథలొస్తే చేయొచ్చు. నిజానికి సరిగ్గా ట్రీట్ చేస్తే ‘ఆరంజ్’ మంచి ప్రయత్నం. కానీ ఆడలేదు... ఏం చేస్తాం.
 
మీ నాన్నగారి 150వ సినిమాకు దర్శకుడు ఫైనల్ అయ్యారా?
 లేదు. సిట్టింగులు జరుగుతూనే ఉన్నాయి. మంచి ఎంటర్‌టైనింగ్ కథ కోసం చూస్తున్నాం.
 
మీ నాన్నగారు తెలుగు సినిమాలో నంబర్‌వన్‌గా రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. దాని కోసం మీరు కూడా పోటీ పడుతున్నారా?
 నాన్న నంబర్‌వన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. వచ్చిన సినిమాల్లో మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్లారు. అనుకోకుండా ఆ స్థానం వరించింది. నేనూ అంతే... వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్తాను. ‘నంబర్‌వన్’ కావాలని మాత్రం ఆశించను.
 
మీ బాబాయి ‘గోపాల గోపాల’ అంటున్నారు. మీరేమో ‘గోవిందుడు అందరివాడేలే’ అంటున్నారు. మీ తమ్ముడు వరుణ్‌తేజ్ ‘ముకుంద’ అంటున్నారు. ఏంటి మీ ఫ్యామిలీ మొత్తం కృష్ణుడి మీద పడ్డారు?
 ఏంటో అలా సెట్ అయ్యింది. అనుకుని చేసేదేం కాదు కదా.
 
మీ బాబాయి పవన్‌కల్యాణ్‌తో కథల విషయంలో డిస్కస్ చేస్తారా?
 ఇంట్లో అందరం కలిసినప్పుడు చర్చించుకుంటాం. ఆయన కూడా సలహాలిస్తుంటారు.
 
పవన్‌కల్యాణ్ ఎనిమిదో సినిమా ‘జానీ’. మహేశ్‌బాబు ఎనిమిదో సినిమా ‘నిజం’, ఎన్టీఆర్ ఎనిమిదో సినిమా ‘ఆంధ్రావాలా’. ప్రభాస్ ఎనిమిదో సినిమా ‘యోగి’, బన్నీ ఎనిమిదో సినిమా ‘ఆర్య-2’. ఇప్పుడు మీ ఎనిమిదో సినిమాగా ‘గోవిందుడు...’ రాబోతున్నాడు. ఈ ఎనిమిదో ప్రమాదం నుంచి గట్టెక్కగలరా?
 ‘గోవిందుడు అందరివాడేలే’ దాన్ని కచ్చితంగా బ్రేక్... చేసి, పెద్ద విజయం సాధిస్తుంది.
 
వైజాగ్‌లో స్టూడియో కడుతున్నారని తెలిసింది నిజమేనా? తెలుగు సినిమా అక్కడ కూడా అభివృద్ది చెందే అవకాశం ఉందంటారా?
 కట్టాలనుకుంటున్నాం. అయితే... ఎక్కడో ఇప్పుడే చెప్పలేను. పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి తరలుతుందని చెప్పలేం. ఎందుకంటే మద్రాసు నుంచి రావడానికే చాలా టైమ్ పట్టింది కదా. అయితే... ప్రత్యామ్నాయంగా మరో చోట సినిమా అభివృద్ధి చెందడం అవసరమే. అమెరికాలో చాలా ప్రాంతాల్లో స్టూడియోలు ఉన్నాయి.

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
ప్రకాశ్‌రాజ్‌ ఈ కాలపు ఎస్వీఆర్‌

‘‘ఆ కాలంలో ఎస్వీ రంగారావు గారు ఎలా ఉండేవారో, ఈ కాలానికి ప్రకాశ్‌రాజ్‌ అలా ఉన్నారనేది నో డౌట్‌. ఆయనను మనం సరిగా వాడుకోలేదు. ఆయన నటనా సామర్థ్యం ఏమిటో ఈ సినిమాతో తెలుస్తుంది’’ అని చెప్పారు రామ్‌చరణ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై బండ్ల గణేశ్‌ నిర్మించిన ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తన స్వగృహంలో పత్రికలవారితో సంభాషించారు చరణ్‌. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
ఇందులో నా పేరు గోవిందుడు కాదు, అభిరామ్‌. నేను అందరివాడినని చెప్పడానికి ‘గోవిందుడు అందరివాడేలే’ అనిపెట్టాం. లండన్‌లో పుట్టి పెరిగే పాత్ర నాది. అయినా మన సంస్కృతిని మర్చిపోని పాత్ర. హైదరాబాద్‌లో పుట్టి పెరిగినవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అభిరామ్‌. ఇందులో నా అభిమానులను అలరించే అంశాలు తప్పకుండా ఉంటాయి. ఇది ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా. చాలా రోజుల నుంచి ఫ్యామిలీ సినిమా చేద్దామని చూస్తున్నా. ‘మగధీర’ తర్వాత నేను చేయాల్సిన సినిమా ఇది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు చేయలేకపోయాం. అప్పట్నించీ కృష్ణవంశీ, నేను మాట్లాడుకుంటూనే ఉన్నాం. ‘ఎవడు’ తర్వాత ఫ్యామిలీ సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాకు వంశీయే గుర్తుకువచ్చారు. మధ్యలో కొంతమంది దర్శకులు వచ్చి కథలు చెప్పారు. వంశీతప్ప మరే డైరెక్టరూ తమ కథలతో నన్ను కన్విన్స్‌ చెయ్యలేకపోయారు. చరణ్‌ని పెట్టుకొని కూడా మాస్‌ అప్పీల్‌ మిస్సవకుండా ఫ్యామిలీ సినిమా చేసి హిట్‌ కొట్టగలననే నమ్మకం దర్శకుడిలో ఉండాలి. వంశీలో ఆ నమ్మకం ఎక్కువగా కనిపించింది. ఇది నా ఎనిమిదో సినిమా. అయితే ఎయిత్‌ ఫిల్మ్‌ ఫోబియా అనేదాని గురించి నాకు తెలీదు. నాకలాంటి సెంటిమెంట్స్‌ లేవు. ఆ సెంటిమెంట్‌ను ఈ సినిమా కచ్చితంగా బ్రేక్‌ చేస్తుంది.

కథే ముఖ్యం
నేనెప్పుడూ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్‌ వెనకాల తిరగలేదు. ‘రచ్చ’ నుంచి చూసుకున్నా, నేను కథను నమ్ముకొనే సినిమాలు చేశాను. అఫ్‌కోర్స్‌.. వినాయక్‌ సక్సెస్‌లోనే ఉన్నాడనుకోండి. ఆయన కథ నచ్చే చేశాను. నాకు కథే ముఖ్యం. ఏ డైరెక్టర్‌ కథ నచ్చితే ఆ డైరెక్టర్‌తో చేస్తాను. కృష్ణవంశీ విషయానికొస్తే, ఆయన చేసిన సినిమాలు ఫెయిలయ్యాయేమో కానీ, డైరెక్టర్‌గా ఆయన ఫెయిలవలేదు. ‘పైసా’ కానీ, ‘డేంజర్‌’ కానీ.. ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్‌ ఫెయిలయ్యిందంతే. ఓ కథను నమ్ముకున్నప్పుడు రాజీపడకుండా తీసే వంశీ వంటి డైరెక్టరే నాకు కావాలి. నటీనటుల నుంచి నటనను రాబట్టే విషయంలో నెంబర్‌వన్‌ డైరెక్టర్‌ ఆయన. సినిమాలో నాకు బాగా నచ్చింది నా కేరక్టర్‌. దాన్ని తీర్చిదిద్దిన విధానం కానీ, నటునిగా నాలో కొత్త కొత్త కోణాలను కృష్ణవంశీ ఆవిష్కరించిన తీరు కానీ బాగా నచ్చాయి.

ఆయన కనెక్ట్‌ కాలేదు
రాజ్‌కిరణ్‌ బదులు ప్రకాశ్‌రాజ్‌ రావడం వల్ల ‘ఫీల్‌ ఆఫ్‌ ద ఫిల్మ్‌’ పూర్తిగా మారిపోయింది. ప్రకాశ్‌ రావడం వల్ల ఇంకా ఎన్నో సీన్లు చెయ్యడానికి స్కోప్‌ వచ్చింది. కొత్త సీన్లు రాశాం. ఆయన కూడా చాలా ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. సినిమా మొదటి షెడ్యూల్‌ అయినప్పుడు నాన్నగారు, నేను రషెస్‌ చూశాం. సినిమాతో సరిగా కనెక్ట్‌ కాలేకపోయాం. రాజ్‌కిరణ్‌ ఎక్కడో మనకు కనెక్టవలేదు. ఆయన కూడా చాలా పెద్ద నటుడు. అందుకే ఆయన బదులు ప్రకాశ్‌రాజ్‌ అయితే బాగుంటుందని అనుకుని ఆయనను అప్రోచ్‌ అయ్యాం. నా సినిమాలన్నింటిలో ఏ రోజూ ఓవర్‌ బడ్జెట్‌ అవకుండా చివరిదాకా అనుకున్న బడ్జెట్‌లో తీసి, రిలీజ్‌ చేస్తున్న సినిమా ఇది. ఇవాళ 130 నుంచి 150 రోజులు తీస్తుంటే, మేం 95 రోజుల్లోనే దీన్ని పూర్తిచేశాం. ప్రకాశ్‌రాజ్‌ను పెట్టడం వల్ల కొన్ని సన్నివేశాలు రీషూట్‌ చేశాం. దానివల్ల గణేశ్‌కు రూ. రెండు కోట్లు అదనంగా అయి ఉండవచ్చు. అయితే ఆయన రావడం వల్ల సినిమాకు రూ. పది కోట్లు లాభమే కానీ, నష్టం లేదు.

‘సీతారామయ్యగారి మనవరాలు’ ప్రేరణ
ఒక్కసారి వంశీతో సింక్‌ అయితే ఆయనతో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో మన పర్ఫార్మెన్స్‌ను కొత్త కోణం లో చూస్తాం. ఆయన తీసినవాటిలో ‘నిన్నే పెళ్లాడుతా’, ‘మురారి’, ‘చందమామ’ వంటివి బాగా ఇష్టం. అయితే ఈ కథ వాటికి భిన్నం. ఓ సీన్‌ అనుకున్న తర్వాత, స్పాట్‌లో ఇలా కూడా చేయొచ్చని, దాన్ని ఇంకో రకంగా చెపుతారు వంశీ. అలాంటి సందర్భాలు ఈ సినిమాలో నాకు బోలెడున్నాయి. మనం డబ్బింగ్‌ చెప్పే తీరుతో సినిమా తీరును మార్చవచ్చని, ఈ సినిమాకి డబ్బింగ్‌ చెప్పేప్పుడు తెలుసుకున్నా. ఈ సినిమాపై ‘సీతారామయ్యగారి మనవరాలు’ ఇన్‌స్పిరేషన్‌ ఉంది. అయితే పూర్తిగా కాదు. దీని కథ వేరే. స్ర్కీన్‌ప్లే వేరే.

‘ఆరెంజ్‌’ కూడా ఫేవరేటే
అన్ని తరహా సినిమాలను చేయాలనేది నా కోరిక. ‘మగధీర’ తర్వాత మంచి లవ్‌స్టోరీ చెయ్యాలని ‘ఆరెంజ్‌’ చేశాను. అది సరిగా ఆడలేదు. అయినా నా ఫేవరేట్‌ సినిమాల్లో అదొకటి. సరిగా ట్రీట్‌ చేసినట్లయితే అది కూడా కచ్చితంగా మంచి సినిమా అయ్యేది. బాలీవుడ్‌లో వచ్చే ఏడాది చేద్దామనే ఆలోచనలో ఉన్నా. ‘జంజీర్‌’ సరిగా ఆడలేదు. సమ్‌టైమ్స్‌ వియ్‌ మిస్‌ ద కేరక్టర్‌. ఆ పాత్రను నేను సరిగా అర్థం చేసుకోలేక పోయానేమో. దాని ఫెయిల్యూర్‌కు నేనెవర్నీ తప్పుపట్టను. అది చేసినందుకు నాకేమీ బాధలేదు.

నాన్న సాయం తీసుకుంటా
డైరెక్టర్‌ కోరుకున్నప్పుడే నాన్న ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఉంటుంది. డైరెక్టర్‌కు ఆయన ఇన్‌వాల్వ్‌మెంట్‌ అవసరం లేదనుకున్నప్పుడు ఆయన కలగజేసుకోరు. స్టోరీ సెలక్షన్‌ అప్పుడు కచ్చితంగా ఆయన సాయం తీసుకుంటాను. ఇద్దరం కలిసే స్టోరీ ఫైనలైజ్‌ చేస్తాం. అయితే ఫైనల్‌ డెసిషన్‌ మాత్రం నాకే వదిలేస్తారు నాన్న. ఆయన 150వ సినిమాకు డైరెక్టర్‌ ఎవరనేది ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. మేం రెండు కథలను లాక్‌ చేసి పెట్టాం. వాటిమీద వర్కవుట్‌ చేస్తున్నాం. అది పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని చెప్పగలను. అమ్మకు ఎప్పట్నించో సినిమా నిర్మించాలని ఉంది. అందుకే మేమే దాన్ని తీయాలని నిర్ణయించుకున్నాం.

బాధ్యత పెంచాయి
నాన్నగారు ఫీలయితే తప్ప ఈ సినిమా ఆడియో వేడుకలో అలా ప్రశంసించరు. దానిని గౌరవంగా భావిస్తున్నా. అయితే ఆ ప్రశంసలు నా బాధ్యతను మరింతగా పెంచాయి. నాకు నెంబర్ల గోల పట్టదు. మంచి సినిమాలు చేసుకుంటూ పోవడమే. నాన్న కూడా నెంబర్‌వన్‌ కావాలని ఫైట్‌ చెయ్యలేదు. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించలేదు.

ఆబ్లిగేషన్‌ పెట్టుకోను
శ్రీను వైట్లతో చర్చలు నడుస్తున్నాయి. ఇంకా కమిట్‌ కాలేదు. అతను నాకు చెప్పింది, డెఫినెట్‌గా కొత్త తరహా కథ. తనకూ, నాకూ కూడా కొత్తే. నేను కథతోనే కమిట్‌ అవుతాను. కొరటాల శివ సినిమా విషయానికొస్తే నేను నిర్మాత నుంచి నయా పైసా అడ్వాన్స్‌ తీసుకోలేదు. నాకు ఆబ్లిగేషన్‌ ఉండకూడదు. డబ్బు తీసుకుంటే సినిమా చెయ్యాలనేది మన మైండ్‌లో ఉంటుంది. అప్పుడు ఆబ్లిగేషన్‌గా చెయ్యాలి. తీసుకోకపోతే అదేమీ ఉండదు. అప్పుడు కథ ఓకే కాకపోయినా మంచిరోజని చెప్పి బలవంతంగా పూజ చేయించాడు గణేశ్‌. కొరటాల చెప్పింది మంచి కథే. ఆ టైమ్‌లో నాకు ఫ్యామిలీ సినిమా చెయ్యాలని ఉంది. అందుకే అది చెయ్యలేదు. భవిష్యత్తులో కచ్చితంగా అతనితో సినిమా చేస్తా. బోయపాటి శ్రీను కూడా రెండు, మూడు కథలు చెప్పారు కానీ నాకు నచ్చలేదు.

మణిరత్నంతో సినిమా
మణిరత్నంగారు కూడా కథ చెప్పారు. అయితే మా ఇద్దరి కాంబినేషన్‌కు అది కరెక్ట్‌ సబ్జెక్ట్‌ కాదనిపించింది. ఇప్పుడు అదే సబ్జెక్టుతో మోహన్‌లాల్‌గారి అబ్బాయితో చేస్తున్నారు. సినిమా చేసినందుకు పేరే కాదు, నిర్మాతకు డబ్బులు కూడా రావాలి. లేదంటే మణిరత్నం డైరెక్షన్‌లో సినిమా అంటే ఎవరు వద్దంటారు? అందరూ ఆయనతో కలిసి చేయాలని కోరుకుంటారు. అయితే పదిమందికీ డబ్బులు తెచ్చే సినిమా చేయాలనేది నా అభిప్రాయం. అలాంటి సినిమా ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా అయ్యాక మేం కలిసి పనిచేస్తాం. గౌతమ్‌ మీనన్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇద్దరికీ నచ్చిన సబ్జెక్ట్‌ దొరికితే వెంటనే చేస్తాం. అది తెలుగు, తమిళ భాషలు రెండింటిలోనూ ఉంటుంది. అలాగే మణిరత్నంగారితో చేసే సినిమా కూడా.
Andhrajyothy

Offline siva

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 25,672
ఆ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాను!

ఏడేళ్ల సినీ ప్రయాణంలో తాను నటుడిగా ఎంతో పరిణితి సాధించానని చెప్పారు రామ్‌చరణ్. నటన తప్ప తనకు మరో వ్యాపకం లేదని, ప్రతిక్షణం సినిమా గురించే ఆలోచిస్తానని అన్నారాయన. వ్యక్తిగతంగా సంతృప్తినిస్తూ, నిర్మాతలకు లాభల్ని తెచ్చిపెట్టే సినిమాల్ని చేయడానికి ప్రాధాన్యతనిస్తానని పేర్కొన్నారు. కుటుంబమంటే తనకు ప్రాణమని..తన చుట్టూ ఎప్పుడూ పదిమంది మనుషులుండాలని కోరుకుంటానని తెలిపారు. మెగాస్టార్ నటవారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్‌చరణ్ ఏడేళ్ల నటప్రయాణంలో తనకంటూ ఓ స్టార్‌డమ్‌ను సృష్టించుకొని అగ్రహీరోల్లో ఒకరిగా చలామణి అవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గోవిందుడు అందరివాడేలే. కృష్ణవంశీ దర్శకుడు. అక్టోబర్ 1న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు రామ్‌చరణ్. ఆయన మనోభావాలివి...

charan గోవిందుడు అందరివాడేలేలో మీ పాత్ర చిత్రణ ఎలా వుంటుంది? ఆ టైటిల్ పెట్టడానికి కారణమేమిటి?

ఇందులో నేను లండన్‌లో పుట్టిపెరిగిన ఎన్.ఆర్.ఐ. యువకుడిగా కనిపిస్తాను. నా పాత్రపేరు అభిరామ్. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే ఎనలేని గౌరవముంటుంది. అతడు ఏ లక్ష్యం కోసం పల్లెలోకి అడుగుపెట్టాడన్నదే చిత్ర ఇతివృత్తం. హీరో వ్యక్తిత్వానికి అద్దంపట్టేలా ఆ టైటిల్‌ను పెట్టాం. ఈ వ్యక్తి అందరివాడు...అందరినీ కలుపుకుపోతాడు. ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పాటుపడతాడు అనే విస్తృతార్థంలో ఈ టైటిల్‌ను పెట్టాం.

విజయాలతో ఫామ్‌లో వున్న దర్శకులకే సినీరంగంలో ప్రాధాన్యతనిస్తారు. అందుకు విరుద్ధంగా వరుస వైఫల్యాలతో వున్న కృష్ణవంశీ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు?
నా కెరీర్‌ను గమనిస్తే నేనెప్పుడూ సక్సెస్‌లో వున్న దర్శకులు, రచయితల వెంట పరుగులు పెట్టలేదు. నాకు కథే ముఖ్యం. కథ ఫైనలైజ్ అయితేనే నేను సినిమాలకు కమిట్ అవుతాను. నా దృష్టిలో కృష్ణవంశీ సినిమాలు, కాన్సెప్ట్స్ ఫెయిల్ అయ్యాయి కానీ దర్శకుడిగా ఆయనెప్పుడూ విఫలం కాలేదు.
సినిమాకు సంబంధించిన ఏ విషయంలోనూ కృష్ణవంశీ రాజీపడరంటారు.

ఆయన్ని మీరు ఎలా సంతృప్తిపరచగలిగారు?
ఆయనలాంటి అంకితభావం కలిగిన దర్శకుల దగ్గర పనిచేయడడానికి నేను ఇష్టపడతాను. కృష్ణవంశీ కథను నమ్మి సినిమాలు చేస్తారు. ప్రతి కళాకారుడి దగ్గరి నుంచి అత్యుత్తమ ప్రతిభ రాబట్టాలని తపిస్తారు. అందుకే ఆయనతో పనిచేయడం చాలా సౌకర్యవంతంగా అనిపించింది.
రచ్చ నాయక్‌లాంటి మాస్ సినిమాల తర్వాత పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం చేయడానికి కారణమేమిటి?
నాకు అన్ని జోనర్ చిత్రాల్ని చేయాలని వుంటుంది. మగధీర తర్వాత లవ్‌స్టోరీ చేద్దామనుకొని ఆరెంజ్ చేశాను. అది బాగా ఆడలేదు. సరిగ్గా ట్రీట్ చేసి వుంటే ఆరెంజ్ పెద్ద విజయాన్ని సాధించేది. ఇప్పటికీ నాకిష్టమైన సినిమాల్లో అదొకటి.తాతయ్య పాత్రలో తొలుత రాజ్‌కిరణ్‌ను అనుకొని తప్పించారు. ఆ స్థానంలో ప్రకాష్‌రాజ్‌ను తీసుకున్నారు.

ఈ మార్పు ప్రభావం సినిమాపై ఏ మేరకు వుంది?
ప్రకాష్‌రాజ్ రావడం వల్ల సినిమాకు సరికొత్త ఫీల్ వచ్చింది. ఆయన చేరికతో కథలో మరికొన్ని సీన్స్ జత చేశాం. నిజంగా ఆయన తాతయ్యే అనే భావనతో నటించాను. నాటి తరంలో యస్.వి.రంగారావులా ఈ తరంలో ప్రకాష్‌రాజ్‌ను పోల్చవచ్చు. రాజ్‌కిరణ్ మంచి నటుడే కానీ ఆయన వల్ల ఎక్కడో నేటివిటీ మిస్ అయ్యామనే భావన కలిగింది.

సినిమాలో ఎన్.ఆర్.ఐ. యువకుడిగా నటించారు. నిజజీవితంలో ప్రవాస భారతీయుల జీవన విధానం గురించి మీరేమంటారు?
ఈ మధ్యనే మేము లండన్‌లో షూటింగ్ చేశాం. అక్కడ మమ్మల్ని చాలా మంది ప్రవాస భారతీయులు కలిశారు. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల వారికి ఎంతో గౌరవముంది. మనకంటే వారికి సెంటిమెంట్స్ ఎక్కువేమో అనిపించింది. పండగల్ని మనలాగే భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం గమనించాను.
కృష్ణవంశీ నటీనటుల్ని పూర్తిగా పిండేస్తారని అంటారు? మిమ్మల్ని ఆయన ఎంతవరకు పిండుకున్నారు?
కృష్ణవంశీ మమ్మల్ని పిండటం కాదు. మేము కూడా ఆయన్ని పిండేశాం కదా (నవ్వుతూ). కృష్ణవంశీని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయనతో పనిచేయడం చాలా సులభం. ప్రతి సన్నివేశంలో పర్‌ఫెక్షన్ కోసం తపిస్తారు కృష్ణవంశీ. అందుకే కొన్ని సీన్స్‌లో ఎక్కువగా రీటేక్‌లకు వెళతారాయన.

సీతారామయ్యగారి మనవరాలి చిత్రానికి మరో రూపంగా ఈ సినిమా వుంటుందని అంటున్నారు?
సీతారామయ్యగారి మనవరాలి సినిమా స్ఫూర్తి వుంటుంది. అంతేకానీ కథాపరంగా ఎలాంటి సంబంధముండదు.మీ సినిమాల విషయంలో నాన్నగారి జోక్యం ఎంత వరకు వుంటుంది?
దర్శకులు కోరితేనే ఆయన సలహాలిస్తారు తప్ప అనవసరంగా ఏ విషయంలోనూ జోక్యం చేసుకోరు. ఇక నా సినిమా కథల ఎంపికలో నాన్న సలహా తప్పకుండా తీసుకుంటాను. అయితే అంతిమ నిర్ణయాన్ని మాత్రం నాకే వదిలేస్తారాయన.

శ్రీను వైట్ల సినిమా ఎంతవరకు వచ్చింది?
ఆ సినిమా విషయంలో చర్చలు జరుగుతున్నాయి. కథ బాగుంటే శ్రీనువైట్ల సినిమా చేస్తాను. నేనెప్పుడు నిర్మాతకో, దర్శకుడికో కమిట్ అవ్వను. కథకే కమిట్ అయి సినిమాలు చేస్తాను.

మరి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఆగిపోవడానికి కారణమేమిటి?
సినిమా మొదలయ్యే వరకు నేను అడ్వాన్స్‌లు తీసుకోను. కొరటాల శివ సినిమాకు కూడా అడ్వాన్స్ తీసుకోలేదు. నిర్మాత బండ్ల గణేష్ తొందరపెట్టడం వల్ల పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి వచ్చింది. కథ ఓకే అవలేదు కదా అని చెప్పినా గణేష్ వినలేదు. మంచిరోజని చెప్పి సినిమా ప్రారంభించారు. అయితే భవిష్యత్తులో కొరటాల శివ దర్శకత్వంలో తప్పకుండా ఓ సినిమా చేస్తాను.

మణిరత్నం సినిమా ఎందుకు కార్యరూపం దాల్చలేదు?
మణిరత్నంతో సినిమా చేద్దామకున్నాను. కథా చర్చలు కూడా జరిగాయి. అయితే ఎందుకో ఆయన చెప్పిన కథ నాకు సరిపోదనిపించింది. ఇప్పుడు అదే కథతో మమ్ముట్టి తనయుడ్ని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నారు. మణిరత్నం సినిమాలో నటించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సినిమా చేస్తే పేరు మాత్రమే కాదు... పది మందికి డబ్బులు కూడా రావాలన్నది నేను నమ్మిన సిద్ధాంతం.
బాలీవుడ్‌లో అశుతోష్‌గోవారికర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారనే వార్తలొచ్చాయి.

ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది?
ఆ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్‌పైకొచ్చే అవకాశముంది.

మీరు ఎయిర్‌లైన్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. వ్యాపారవేత్తగా ఎలా ఫీలవుతున్నారు?
అసలు నాకు వ్యాపారమంటే ఏమిటో తెలియదు. ఎయిర్‌లైన్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడం అనుకోకుండా జరిగిపోయింది. ఈ బిజినెస్‌ను ఉపాసన చూసుకుంటోంది. వ్యాపారం చేయాలంటే మంచి ఆలోచనా శక్తి వుండాలి. ఎయిర్‌లైన్స్ బిజినెస్‌లో నా భాగస్వామ్యం చాలా తక్కువ. దానికి నేనొక బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే వ్యవహరిస్తున్నాను.

వైజాగ్‌లో ఫిల్మ్ స్టూడియో పెడుతున్నారని తెలిసింది. వైజాగ్‌లో చిత్రపరిశ్రమ నిలదొక్కుకునే అవకాశాలు ఎంత వరకు వున్నాయి?
ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. వైజాగ్‌లో ఇప్పటికిప్పుడు చిత్ర పరిశ్రమ స్థిరపడుతుందని చెప్పలేం. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఇండస్ట్రీ తరలిరావడానికి చాలా సమయం పట్టింది. అయితే ప్రతి రంగానికి ప్రత్యామ్నాయాలు వుండటంలో తప్పులేదు. అమెరికాలో ప్రతి స్టూడియోలు వుంటాయి. ఎవరి సౌకర్యాన్ని బట్టి వారు షూటింగ్ చేసుకునే వెసులుబాటు వుంటుంది.

సినిమాల ఎంపిక విషయంలో మీ సతీమణి ఉపాసన ఏమైనా సలహాలు ఇస్తుందా?
ప్రత్యేకంగా సలహాలు ఇవ్వదు. కానీ మంచి ప్రేమకథా చిత్రాలు చేయమని చెబుతుంది. ఉపాసనకు లవ్‌స్టోరీస్ అంటే చాలా ఇష్టం.

నాన్న నటించే 150 సినిమా ఎంతవరకు వచ్చింది? దానికి దర్శకుడెవరు?
ఆ సినిమా కోసం మూడు కథల్ని ఓకే చేశాం. ప్రస్తుతం అందులోంచి మంచి కథను ఎంచుకునే పనిలో వున్నాం. ఆ సినిమా గురించి త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తాను.
షూటింగ్ లొకేషన్‌లో కృష్ణవంశీ అప్పటికప్పుడు సీన్‌లు మార్చేస్తారని చెబుతుంటారు.

మీకు అలాంటి అనుభవం ఎదురైందా?
సీన్‌లో బెటర్‌మెంట్ కోసం ఆయన ఒక్కోసారి మార్పుల్ని సూచిస్తారు. ప్రతి సీన్‌ను వివిధ కోణాల్లో పరిశీలిస్తారాయన. అంతేకాని కథను మార్చి కొత్త సన్నివేశాల్ని క్రియేట్ చేయరు. నాకు అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు.

కోన వెంకట్, గోపీమోహన్ కథ ఓకే చేశారని తెలిసింది?
అవును. ఆ కథ బాగుంది. వచ్చే ఏడాది సినిమా చేస్తాను. దర్శకుడెవరో త్వరలో తెలియజేస్తాను. అదే సమయంలో గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఓ సినిమా చేయాలనే ఆలోచన వుంది. మంచి కథ కుదిరితే మణిరత్నం దర్శకత్వంలో కూడా సినిమా చేసే ఆలోచన వుంది.
చిరంజీవి నంబర్‌వన్ స్ధానం ఇంకా ఖాళీగానే వుంది. మీరు ఆ స్థానం కోసం పోటీలో వున్నారా?
నెంబర్‌వన్ స్థానం కోసం నాన్నగారు ఎప్పుడూ పోటీపడలేదు. ఆయన విశ్రాంతి లేకుండా సినిమాలు చేశారు. నేను కూడా నాన్నలా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. నంబర్‌గేమ్‌పై నాకు ఆసక్తిలేదు.మీరు సెంటిమెంట్స్‌ను నమ్ముతారా? తెలుగులో ప్రస్తుతమున్న అగ్రహీరోల ఎనిమిదవ చిత్రాలన్నీ అపజయం పాలయ్యాయి. గోవిందుడు అందరివాడేలే మీ ఎనిమిదో చిత్రం.

సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భయపడుతున్నారా?
నేను సెంటిమెంట్స్ గురించి అస్సలు ఆలోచించను. మీరు అంటున్న సెంటిమెంట్‌ను గోవిందుడు అందరివాడేలే చిత్రంతో నేను బ్రేక్ చేసి విజయాన్ని సాధిస్తాననే విశ్వాసముంది.
అన్ని జోనర్ సినిమాలు చేయాలన్నది మీ లక్ష్యమని చెప్పారు.

ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధంగా వున్నారా?
నిర్మాతల్ని నష్టపరిచే ప్రయోగాలు చేయను. అలాగనీ పూర్తిగా సేఫ్ జోనర్ సినిమాలు చేయను. అందరూ బాగుండే సినిమాలే చేస్తాను.
namastetelangana

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,241
 • DIE HARD FAN OF POWERSTAR
రామ్‌చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ ఈ సినిమా గురించి చెప్పిన కొన్ని విశేషాలు:

హీరో పాత్ర తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అది. అంతేతప్ప ఆ సినిమాలో నా పేరు గోవిందుడేం కాదు. ఇందులో నా పేరు ‘అభిరామ్’. ఎన్నారైని. తాత కోసం ఇండియా వస్తాను. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఇప్పటివరకూ ఇలాంటి కోవలోని సినిమా నేను చేయలేదు.
ఈ సినిమాలో మీరు ఇప్పటి వరకూ చూసిన కాజల్ కంటే చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది.
ఫ్యామిలీ మూవీలో ఫ్యామిలీ మూవీలానే ఉండాలి, అందులో యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఉండకూడదు. నాకేమో ప్యూర్ ఫ్యామిలీ కంటెంట్ మాత్రమే చెయ్యాలని ఉంది. అలా చెయ్యాలి అంటే చరణ్ ని పెట్టుకొని కూడా నేను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ మూవీ చెయ్యగలననే నమ్మకం డైరెక్టర్ కి ఉండాలి. ఆ నమ్మకం నేను కృష్ణవంశీలో చూసాను.
కృష్ణవంశీ అంటారా ఆయన డైరెక్టర్ గా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆయన ఎంచుకున్న పాయింట్స్ ఫెయిల్ అయ్యాయి అంతే. నాకు ఆయన తీసిన ‘మురారి’, ‘నిన్నేపెళ్ళాడతా’, ‘చందమామ’ సినిమాలు అంటే ఇష్టం.
ఓ యాంగిల్ లో ఈ సినిమా “సీతారామయ్య గారి మనవరాలు “కి స్ఫూర్తి అని అనుకోవచ్చు కానీ ఈ సినిమా కథ – కథనం – టేకింగ్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే అందులో ఉండే విషాద ముగింపు ఇందులో ఉండదు. ఇదొక ఎనర్జిటిక్ అండ్ ఫుల్ లెంగ్త్ పాజిటివ్ మూవీ.
ఈ మూవీ ఆల్బంలో మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి కానీ సినిమా పరంగా ఆరో పాట పెడితే ఎక్కడో ఫీల్ మిస్ అవుతోంది. అందుకే ఆ పాట తీసేసాం. చెప్పాలంటే కో కోడి సాంగ్ నా ఫేవరైట్ సాంగ్. అందుకే సినిమా రిలీజ్ అయిన 12 లేదా 13 వ రోజు స్పెషల్ బోనస్ లా ఆ సాంగ్ ని జత చేయాలనుకుంటున్నాం.
అభిమానులు ఆశించే అన్నీ ఉంటాయి. గత 3-4 సంవత్సరాలుగా వచ్చిన సినిమాలు ఒక ఫార్మాట్ లో ఉన్నాయి. ఇది కూడా అదే ఫార్మాట్ లో ఉంటుంది. ట్రీట్ మెంట్ కాస్త కొత్తగా ఉంటుంది. అంతే కానీ అర్థం కాని ఫార్మాట్ అయితే కాదు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది.

source: pawanfans.com

 

Related Topics

  Subject / Started by Replies Views Last post
3 Replies 296 Views Last post May 22, 2012, 11:17:30 PM
by lokesh