Author Topic: నలంద నవశకం  (Read 215 times)

Offline siva

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 25,661
నలంద నవశకం
« on: October 11, 2014, 08:36:59 AM »
నలంద నవశకం

నలంద విశ్వవిద్యాలయం.. శతాబ్దాల కిందటే ప్రపంచం దృష్టి భారత్‌పై నిలిచేలా చేసిన  అత్యుత్తమ విద్యా సంస్థ. భారతీయ విద్యా విధానాన్ని, సంస్కృతీ, సాంప్రదాయాలను, శాస్త్ర విజ్ఞానాన్ని  వ్యాపింపచేసి దేశవిదేశాల విద్యార్థులను ఆకర్షించిన ఈ యూనివర్సిటీ తర్వాతి కాలంలో దండయాత్రలకు ధ్వంసమైంది. తాజాగా నాటి వైభవాన్ని గుర్తుకు తెచ్చేలా నవశకానికి నాంది పలుకుతూ ప్రాచీన నలంద యూనివర్సిటీ మళ్లీ మన ముందుకు వచ్చింది. బీహార్ రాజధాని పాట్నా సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ యూనివర్సిటీ.. గత నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. నలంద యూనివర్సిటీతోపాటు దేశ స్వాతంత్య్రానికి ముందు నుంచీ ఉన్న విశ్వవిద్యాలయాలపై ప్రత్యేక కథనం..
 
గుప్తుల కాలంలో..

భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణ యుగంగా పిలుస్తారు. వీరికాలంలోనే క్రీ.శ 427 (ఐదో శతాబ్దం)లో పాటలీపుత్రం (ప్రస్తుతం బీహార్ రాజధాని పాట్నా) సమీపంలోని రాజ్‌గిర్‌లో నలంద యూనివర్సిటీ ఏర్పాటైంది. ప్రారంభించిన కొన్నేళ్లకే ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా భాసిల్లింది. ఆ కాలంలోనే వివిధ పుస్తకాలతో కూడిన గొప్ప గ్రంథాలయం ఉండేది. ఇందులో చిత్రలేఖనం, వైద్యశాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, బౌద్ధం.. జైనమతాల సాహిత్యానికి సంబంధించిన వేలాది గ్రంథాలు విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. దేశవిదేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసించడానికి నలందకు వచ్చేవారు. మూడు రౌండల్లో జరిగే పరీక్ష ద్వారా ప్రవేశం కల్పించేవారు. ఆ రోజుల్లోనే 10 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది ఫ్యాకల్టీ క్యాంపస్‌లోనే నివాసం ఉండేవారు. ఇలా ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులతో కొన్ని వందల ఏళ్లపాటు వైభవంగా వర్ధిల్లిన ఈ యూనివర్సిటీ.. భక్తియార్ ఖిల్జీ 12వ శతాబ్దంలో జరిపిన దాడిలో.. తీవ్రంగా నష్టపోయింది. తొంభై ల క్షలకుపైగా లిఖితప్రతులు అగ్నికి ఆహుతి అయ్యాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎక్కువ భాగం ఈ దాడిలో ధ్వంసమైంది. ప్రపంచదేశాల విశ్వగురువుగా భారత్‌ను నిలిపిన నాటి నలంద విశ్వవిద్యాలయం అలా చరిత్రలో కలిసిపోయింది.

నలంద పునరుద్ధరణ

నాటి నలంద యూనివర్సిటీని మళ్లీ పునరుద్ధరించాలని 2006లో మొదట ప్రతిపాదించింది.. ప్రముఖ శాస్త్రవేత్త, దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్. 2010లో నలంద యూనివర్సిటీ ఏర్పాటు బిల్లు.. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదాన్ని పొందింది. తర్వాత రాష్ట్రపతి కూడా ఆ బిల్లును ఆమోదించారు. 2010 నవంబర్‌లో పార్లమెంటు చట్టం ద్వారా నలంద యూనివర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇక ప్రవేశాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల నుంచి 1000 దరఖాస్తులు వచ్చాయి. యూఎస్, రష్యా, ఇంగ్లండ్, యూరోపియన్ దేశాలు, ఆగ్నేయ ఆసియా, ఆసియా దేశాల నుంచి కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ వేయిమంది నుంచి చివరకు 15 మంది విద్యార్థులను మాత్రమే ఎంపిక చేశారు. వీరిలో ఐదుగురు మహిళలు. అంతేకాకుండా భూటాన్ యూనివర్సిటీ డీన్, బుద్ధిస్ట్ స్టడీస్‌పై పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తున్న జపనీస్ విద్యార్థి కూడా ఈ 15మందిలో ఉన్నారు. ప్రాచీన నలంద యూనివర్సిటీ ప్రమాణాలకు తగినట్లుగా ఎంపిక ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంది. ఇందుకు నిదర్శనం వేయిమంది దరఖాస్తు చేసుకుంటే 15 మంది ఎంపిక కావడమే. ఎంపికైన విద్యార్థులకు పాట్నా సమీపంలోని రాజ్‌గిర్‌లో సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యాయి.
 
రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్
యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువచ్చే క్రమంలో అకడమిక్ ఎక్స్‌లెన్స్‌కు పెద్దపీట వేయనున్నారు. విద్యార్థులకు ఆయా అంశాలపై లోతైన పరిజ్ఞానం అందిస్తూ.. పరిశోధనపరమైన అధ్యయనాన్ని ప్రోత్సహించాలనే ల క్ష్యంతో ఉన్నారు. తద్వారా విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ అందుతుందని యూనివర్సిటీ వర్గాల భావన. ఈ క్రమంలో అంతర్జాతీయ అవ సరాలకనుగుణంగా కరిక్యులం, బోధన పద్ధతులను ప్రవేశపెట్టారు. ప్రధానంగా రీసెర్చ్ ఓరియెంటెడ్ యూనివర్సిటీగా నలందను తీర్చిదిద్దనున్నారు.
 
ముందుగా రెండు స్కూళ్లు
నలంద యూనివర్సిటీలో ముందుగా రెండు స్కూళ్లను ఏర్పాటు చేశారు. అవి..
 1. స్కూల్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్: ఇది నేచురల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్ విభాగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
 2. స్కూల్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్: ఇది ప్రపంచ చరిత్ర, మధ్య ఆసియా సంబంధాలు, ఆర్కియాలజీ, ఆర్ట్ హిస్టరీ అండ్ ఎకనమిక్ హిస్టరీ వంటివాటిలో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతుంది. 2020 నాటికి పరిశోధన, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టడీస్ కోసం మరో ఏడు స్కూళ్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో యూనివర్సిటీ ఉంది. ఈ క్రమంలో 2016 నాటికి రెండు స్కూళ్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నలంద యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా.. అత్యుత్తమ విద్యను అందించాలని కంకణం కట్టుకుంది.
 
వివిధ సంస్థలతో ఒప్పందాలు

ప్రాచీన కాలం నాటి వైభవాన్ని మరోమారు అందుకునే నేపథ్యంలో.. యూనివర్సిటీ.. దేశవిదేశాలకు చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. యేల్ యూనివర్సిటీ, పెకింగ్ యూనివర్సిటీ, యూరోపియన్ కన్‌సోర్టియం ఫర్ ఏషియన్ ఫీల్డ్ స్టడీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటివాటి సహకారంతో ముందడుగు వేస్తోంది. యూనివర్సిటీ పాలనలో కూడా నిష్ణాతులైన నిపుణులు ఉన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అమర్త్యసేన్.. యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. గవర్నింగ్ బాడీ సభ్యులుగా వివిధ అంశాల్లో నిష్ణాతులైన నిపుణులు ఉన్నారు.
 
నిపుణులైన ఫ్యాకల్టీ
నలంద యూనివర్సిటీని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే క్రమంలో.. దేశవిదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీలకు చెందిన విద్యావేత్తలు ఇక్కడ పాఠాలు బోధిస్తున్నారు. బోధనలోనూ సంప్రదాయ విధానాలకు దూరంగా.. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా వివిధ అంశాలపై అధ్యయనం చేసే విద్యార్థులకు మరింత సమగ్ర సమాచారం అందించేలా బోధన ఉంటోంది. ఫ్యాకల్టీ, విద్యార్థుల నిష్పత్తి కూడా 1:8 (ప్రతి ఎనిమిది మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ)గా ఉంటుంది. తద్వారా విద్యార్థులకు వీలైనంత ఎక్కువమంది ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. వీరివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఇలా మంచి ఫ్యాకల్టీ లభించడం వల్ల ఎక్కువమంది విద్యార్థులు నలంద యూనివర్సిటీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.
 
అత్యాధునిక సదుపాయాలతో క్యాంపస్
ప్రాచీన నలంద యూనివర్సిటీ ఏర్పాటైన ప్రదేశం దగ్గరలోనే ప్రస్తుత నలంద యూనివర్సిటీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం మొత్తం 455 ఎకరాలు కేటాయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయి. అత్యాధునిక లైబ్రరీ, ల్యాబ్‌లు, తరగతి గదులను నిర్మిస్తున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 2700 కోట్లను కేటాయించింది. వీటిని రానున్న పదేళ్లలో విశ్వవిద్యాలయ అవసరాలకు ఖర్చు చేస్తారు. గత నాలుగేళ్లుగా రూ.46 కోట్లను మంజూరు చేశారు. యూఎస్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ప్రభుత్వ విభాగాలు కూడా ఈ క్రతువులో తమ వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి.
 వెబ్‌సైట్: www.nalandauniv.edu.in

 
స్వాతంత్య్రానికి ముందే ఏర్పడిన ప్రముఖ యూనివర్సిటీలు
నలంద యూనివర్సిటీతోపాటు మరికొన్ని యూనివర్సిటీలు మనదేశానికి స్వాతంత్య్రం రాకముందే ఏర్పడ్డాయి. కొన్ని సిపాయిల తిరుగుబాటు (1857) కాలం నాటికే ప్రారంభమై తమ విద్యా వెలుగులను నలుదిశలా ప్రసరింపచేశాయి. దేశంలో కొన్ని లక్షల మంది విద్యార్థులను భావి భారతాన్ని తీర్చిదిద్దే అత్యుత్తమ పౌరులుగా రూపుదిద్దుతున్నాయి. అలాంటివాటిలో కొన్ని..
ఐఐటీ - రూర్కీ: 1847లోనే ఏర్పాటైంది. థామసన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అని మొదట్లో పిలిచేవారు. 1949లో యూనివర్సిటీ ఆఫ్ రూర్కీగా మారింది. 2001లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఒకటిగా రూపుదాల్చింది.
వెబ్‌సైట్: www.iitr.ac.in
బాంబే యూనివర్సిటీ: 1857లో డాక్టర్ జాన్ విల్సన్ స్థాపించారు. ఆయనే యూనివర్సిటీ మొదటి వైస్ ఛాన్సలర్.
వెబ్‌సైట్: www.mu.ac.in
యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా (1857): దక్షిణాసియాలో పాశ్చాత్య శైలిలో ఏర్పడిన మొట్టమొదటి మల్టీడిసిప్లినరీ యూనివర్సిటీ.

వెబ్‌సైట్: www.caluniv.ac.in
మద్రాస్ యూనివర్సిటీ (1857): దక్షిణభారతదేశంలో తొలిగా ప్రారంభమైన మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీ. తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతంలో ఏర్పడిన ఎన్నో విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలిచిన సంస్థ.
వెబ్‌సైట్: www.unom.ac.in
అలహాబాద్ యూనివర్సిటీ: ఇంగ్లిష్ మాధ్యమంలో కోర్సులు అందించిన ఈ యూనివర్సిటీ 1887లో ఏర్పాటైంది. ‘ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్’ అని ప్రశంసలు పొందిన విద్యా సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఒకటి. 
వెబ్‌సైట్: www.allduniv.ac.in
బెనారస్ హిందూ యూనివర్సిటీ: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, న్యాయ కోవిదుడు.. పండిట్ మదన్ మోహన్ మాలవ్య అకుంఠిత కృషితో పవిత్ర పుణ్యధామం.. కాశీ (వారణాసి)లో 1916లో ఏర్పడిన ఈ యూనివర్సిటీ.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. అంతేకాకుండా రెసిడెన్షియల్ విధానంలో ఏర్పాటైన మొదటి విశ్వవిద్యాలయం.