Author Topic: ఇంటర్వ్యూ : బాబీ – పవన్ గారితో కనెక్ట్ అయిపోతే ఆ కిక్కే వేరు!  (Read 208 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,169
  • DIE HARD FAN OF POWERSTAR

బాబీ.. ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారి మెప్పించిన ఈ రచయిత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కొట్టేసి సంవత్సరం క్రితం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. భారీ అంచనాల మధ్యన ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు…

ప్రశ్న) ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అవకాశం ఎలా వచ్చింది?

స) ‘పవర్’ సినిమా రిలీజ్ అయినప్పుడే శరత్ మరార్ గారు ఫోన్ చేసి, ‘పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తావా?’ అనడిగారు. పవన్ కళ్యాణ్ గారితో ఫోటోతో దిగితే చాలు అనుకునేవాడిని, అలాంటిది సినిమా అవకాశం అంటే కాదని ఎలా అంటాను? దానికితోడు పవన్ గారు రాసిన కథ కూడా చాలా బాగుంది. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశా.

ప్రశ్న) పవన్ కళ్యాణ్ రాసిన కథను మీరు డైరెక్ట్ చేయాలంటే ఎలా అనిపించింది?

స) ముందే చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు రాసిన కథ చాలా బాగా నచ్చింది. దానికి నేను, ఆయన.. ఇద్దరం కలిసి కొన్ని మార్పులు అవీ చేశాం. దాదాపుగా స్ర్కిప్ట్ వర్క్‌పైనే ఐదు నెలలు కూర్చున్నాం.

ప్రశ్న) మేకింగ్ పరంగా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్‌మెంట్ ఏమైనా ఉందా?

స) కథ విషయంలో పవన్ గారు, నేనూ ఇద్దరం పనిచేశాం. దర్శకుడిగా మాత్రం పవన్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనివ్వాలన్నది ఆయన ఎప్పుడూ ఫాలో అయ్యే సిద్ధాంతం. ఈ సినిమా విషయంలో మేకింగ్ పరంగా ఆయనెక్కడా ఇన్వాల్వ్ కాలేదు.

ప్రశ్న) పవన్ కళ్యాణ్‌తో పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

స) పవన్ గారికి ఒక్కసారి కనెక్ట్ అయిపోతే ఆయనతో చేసే ప్రయాణంలో ఉండే కిక్కే వేరు. ఆయనకు ఏదైనా బలంగా నచ్చితే ఆ అంశం గురించి ప్రశంసించే తీరు, అందరిముందూ ఆ అంశాన్ని ప్రస్తావించే తీరు అద్భుతం. చిరంజీవి గారితో కూడా నా గురించి మంచి మాటలు చెప్పడం ఎప్పటికీ మరచిపోలేను.

ప్రశ్న) ఈ సినిమాలో చిరంజీవి ఫ్యాక్టర్ కూడా ఉంది? ఆ పోర్షన్ ఎందుకు పెట్టారు?

స) ఇందులో చిరంజీవి గారి ఫేమస్ వీణ స్టె‌ప్‌ను పవన్ ట్రై చేశారు. ఆ వీణ స్టెప్ కావాలనే, చిరు గారి ఫ్లేవర్‌ను సినిమాలో పెట్టాలని ముందు నుంచీ అనుకోవడంతోనే పెట్టేశాం. దానికి మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉంది.

ప్రశ్న) కథంతా ట్రైలర్‌లోనే చెప్పేశారు. కారణం?

స) కథంతా ట్రైలర్‌లో చెప్పేయాలన్నది ముందునుంచే ఉన్న ఆలోచన. సినిమాలో ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని ముందే చెప్పేస్తే, భారీ అంచనాల మధ్యన వస్తోన్న సినిమాల విషయంలో ఇబ్బందులు ఉండవు. ట్రైలర్‌ను ఒకలా పరిచయం చేసి, సినిమా ఇంకోలా ఉండడమన్నది మంచిది కాదు. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలూ ఈ పద్ధతినే ఫాలో అవుతున్నాయి.

ప్రశ్న) అప్పటికప్పుడు సినిమాను ఏప్రిల్‍కు ఫిక్స్ చేయడం, ఇప్పుడు హిందీలోకీ డబ్ చేయడం.. వీటన్నింటినీ ఎలా మేనేజ్ చేశారు?

స) నిజానికి జనవరి వరకూ సినిమాను ఆడుతూ, పాడుతూ పూర్తి చేశాం. ఎప్పుడైతే పవన్ గారు ఏప్రిల్‌లో సినిమా విడుదల చేస్తే బాగుంటుందని అన్నారో, అప్పట్నుంచే వేగం పెంచాం. రెండు మూడు టీమ్స్‌గా ఏర్పడి విశ్రాంతి అంటూ లేకుండా సినిమాను రెడీ చేశాం. అదేవిధంగా హిందీలో డబ్ చేయాలన్నది కూడా పవన్ గారి ఆలోచనే! నార్త్ ఇండియా నేపథ్యంలో నడిచే కథ కావడంతో అక్కడ కూడా సినిమా బాగా కనెక్ట్ అవుతుందని హిందీ వర్షన్ ఐడియా ఇచ్చారు.

ప్రశ్న) తదుపరి సినిమా ఏంటి?

స) సర్దార్ గబ్బర్ సింగ్‌తో కొన్నాళ్ళు పూర్తిగా బిజీ అయిపోయా. ఇప్పుడిక వారం తర్వాత ఫ్రీ అయిపోతా. కొద్దిరోజులు కుటుంబం కోసం సమయం కేటాయించాలనుకుంటున్నా.

source:123telugu.com


 

Related Topics