Author Topic: బ్రహ్మచారిగా ఉందామనుకొన్నా.. ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది!  (Read 164 times)

Offline Pa1Kalyan

  • Global Moderator
  • Mega Member
  • *****
  • Posts: 10,217
  • DIE HARD FAN OF POWERSTAR
పవన్‌ కల్యాణ్‌... ‘అభిమానం’ అనే పదాన్ని ‘భక్తి’ స్థాయికి తీసుకెళ్లిన కథానాయకుడు.
తన ఆలోచనల్ని ‘ఇజం’గా మార్చిన భావకుడు. హీరోయిజానికి కొత్త ఉత్సాహాన్ని ఇంజెక్ట్‌
 చేసిన నటుడు. ఆయనకు సమాజం అంటే ప్రేమ. పుస్తకాలంటే పిచ్చి. చదివింది ఆచరిస్తాడు.
ఆచరించేదే చెప్తాడు. పవన్‌లో ఆ నిజాయతే అభిమానులకు నచ్చుతుంది. పవన్‌ కనిపిస్తే..
పవన్‌ మాట్లాడితే.. అంత ఉత్సాహంగా వూగిపోవడానికి కారణం అదే. ఓవైపు కథానాయకుడిగా, మరోవైపు నాయకుడిగా పవన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వసూళ్లలో గత రికార్డుల్ని తిరగరాస్తోంది. ఈ సందర్భంగా పవన్‌తో సంభాషించింది ‘ఈనాడు సినిమా’. అటు రాజకీయాల గురించీ, ఇటు సినిమాల గురించీ, తన వ్యక్తిత్వం గురించీ పవన్‌ కల్యాణ్‌ ఇలా చెప్పుకొచ్చారు.


వాడికి నేనంటే కోపం
‘‘అకీరాకు నేనంటే చాలా ఇష్టం. వాడు సినిమా వాతావరణానికి దూరంగా ఉంటున్నాడన్న సంతోషంగా ఉన్నా నా దగ్గర లేడనే బాధగా ఉంది. వాడికీ ఆ బాధ ఉంది. అందుకే వాడికి నాపై కోపం. నా స్టార్‌ స్టేటస్‌, ఇమేజ్‌కు అకీరా దూరంగా ఉండటం మంచిదే. భవిష్యత్తులో తను ఏం చేస్తాడన్నది తన ఇష్టాయిష్టాల్నిబట్టే ఉంటుంది’’

ఏంటి... ఆధునిక మహాభారతం పుస్తకం ఇప్పుడు తిరగేస్తున్నారు?
 (నవ్వుతూ) గుంటూరు శేషేంద్ర శర్మగారు రాసిన పుస్తకం ఇది. ఆయన అభివ్యక్తి బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్నీ ప్రతిబింబించే పుస్తకం ఇది. కొన్ని పుస్తకాల్ని పదే పదే చదువుతుంటా. అలాంటి పుస్తకాల్లో ఇదొకటి.
మన ఇతిహాసాల్లో మీకు నచ్చిన పాత్రేమిటి?
పరశురాముడు అంటే ఇష్టం. ఆయన ‘నేను’ అనే అహంకారాన్ని చంపిన వ్యక్తి. సాధారణంగా నేను రామాయణ మహాభారతాల్ని ఓ కథగా అనుకోను. అందులో ఏ విషయం ఉన్నా అది నాకు అన్వయించుకుంటా. ఓ ఘట్టంలో పైకి కనిపించే కథ వేరు. లోపల పొరల్లో దాగున్న భావం వేరు. ఆ భావం ఏమిటో వెతుకుతూ చదవడం నాకిష్టం.

పుస్తకాలు మీలోని కోపాన్నీ ఆవేశం పెంచాయా? దూరం చేశాయా?
నా ఆవేశం, నా కోపం ఓ సమస్యమీదే. నా కళ్ల ముందు ఏదైనా తప్పు జరిగితే కోపం వచ్చేస్తుంది. నా సినిమా ఫ్లాప్‌ అయ్యిందనో, అప్పుల పాలయ్యాననో నాపై, నా చుట్టూ ఉన్న వ్యక్తులపై కోపం తెచ్చుకోను. ‘ప్రజారాజ్యం’ పెట్టినప్పుడు ఎన్నికల్లో ఓడిపోయాం. అప్పుడేమీ ఆవేశపడలేదు.

భారీ పారితోషికం తీసుకొనే కథానాయకుడు మీరు. ఆర్థికంగా నిలబడకపోవడమేమిటి?
నా కెరీర్‌లో నాకొచ్చింది నేను చేసుకొంటూ వెళ్లా. డబ్బుల గురించి ఆలోచించలేదు. ఈ సినిమాకొచ్చిన డబ్బులతో ఓ ఇల్లు కొనాలి, ఓ స్థలం కొనుక్కోవాలి, దాచుకోవాలి.. అంటూ జాగ్రత్త పడలేదు. అలా జాగ్రత్త పడాలని చెప్పినవాళ్లు లేరు. నేను ఎంత సంపాదిస్తే అంతా ఖర్చయిపోయేవి. నా కెరీర్‌లో చేసింది 20 సినిమాలే. నాకు పెద్దగా డబ్బులు అవసరం లేదు. నా చుట్టూ చాలా మంది ఉంటారు. ఖర్చులుంటాయి. నేనెక్కడికీ ఒంటరిగా వెళ్లలేను. సెక్యూరిటీ కావాలి. అలాంటి కనిపించని ఖర్చులుంటాయి. అవన్నీ తడిసి మోపెడయ్యేవి. మనీ మేనేజ్‌మెంట్‌ విషయంలో జాగ్రత్తగా లేను.

‘జాని’ పరాజయంవల్లే మళ్లీ దర్శకత్వం వైపు అడుగు వేయలేదా?
నాకు ప్రయాణం ముఖ్యం. ఫలితం కాదు. ఓ వ్యక్తి గురించి మాట్లాడాలంటే వాడు పుట్టినప్పటి నుంచీ చనిపోయేంత వరకు వాడి జీవితం చూసి నిర్ణయానికి రావాలి. అంతే తప్ప 24 గంటలూ గెలిచాడా, లేదా? అంటూ లెక్కలేసుకోకూడదు. దర్శకత్వం ఓ సృజనాత్మక పక్రియ. అనుకొన్నది అనుకొన్నట్టుగా తీయడానికి కొన్ని పరిమితులుంటాయి. ‘జాని’ ఓటమిని నేను ఆనందంగానే స్వీకరించినా నా చుట్టూ ఉన్నవాళ్లు భరించలేకపోయారు. వాళ్లే ఓడిపోయినంత బాధపడ్డారు. వీళ్లేంటి ఇంత బాధపడుతున్నారు అనిపించింది. ‘జాని’ ఫ్లాప్‌ కంటే వాళ్ల అంచనాలే నాపై ఒత్తిడి పెంచాయి. అలాగని వాళ్లను వదిలి దూరంగా వెళ్లలేను. వాళ్లతోనే ఉండి రోజూ పోరాడలేను.‘జాని’ తరవాత సినిమాలు మానేద్దాం అనుకొన్నా. ‘కానీ ఈ ఒక్క సినిమా చేయ్‌..’ అనేవారు. దాని తరవాత ఇంకో సినిమా.. ఆ తరవాత మరోటి. ఇలా పదేళ్లు గడిచిపోయాయి.

మీకు చాలా సిగ్గట.. కెమెరా ముందు అదంతా ఏమవుతుంది?
 (నవ్వుతూ) కెమెరా ముందూ ఆ సిగ్గు ఉంటుంది. డ్యాన్స్‌ చేయాలన్నా, నటించాలన్నా సిగ్గే. రోడ్డు మీదకు తీసుకెళ్లి.. ‘ఇక్కడో స్టెప్పు వేయండీ’ అంటే కుచించుకుపోతా. అందుకే విదేశాల్లో ఎవరూ లేని చోట నాకు తోచిన స్టెప్పులేస్తా (నవ్వుతూ). కథకి అనుగుణంగా ఉందనిపించినప్పుడు మాత్రం నడిరోడ్డుపై సీన్‌ తీయాలన్నా అందుకు సిద్ధమవుతా. నా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడటం నచ్చదు. ‘మేం పొడిచేశాం.. ఇంత ఖర్చు పెట్టాం’ అని చెప్పుకోలేను.

సినిమా విడుదలయ్యాక ఫలితం, వసూళ్ల గురించి ఆరా తీయరా?
నేను నటుణ్ని. ట్రేడ్‌ ఎనలిస్ట్‌ని కాదు. నా పని నటించడం వరకే. ఎంత వసూలు చేసింది అనేది నిర్మాత, పంపిణీదారులు లెక్కలేసుకోవాలి. నా సినిమా ఎలా ఉంది? అని ఎవర్నీ అడగను. ‘బాగుంది..’ అన్నా. ‘బాగోలేదు’ అని చెప్పినా ఒకటే స్పందన. సినిమా బాగుందని తల ఎగరేస్తే.. రేపు ఫ్లాప్‌ వచ్చినప్పుడు ఆ తలే దించుకోవాల్సి వస్తుంది. రెండూ నాకు ఇష్టం ఉండదు. నా సినిమాల గురించే కాదు. చుట్టుపక్కల సినిమాల విషయాలూ పట్టించుకోను. ఈ మనస్తత్వానికీ కారణం మా అన్నయ్యే. ‘ఖైదీ’ హిట్‌ అయ్యాక నా స్నేహితులు అన్నయ్య గురించి గొప్పగా మాట్లాడారు. ఆ తరవాత ఓ సినిమా ఆడలేదు. ఎగతాళి చేయడం మొదలెట్టారు. ఓ వ్యక్తిని అభిమానించినప్పుడు అలానే అభిమానించాలి. సినిమా సినిమాకీ ఆ స్థాయి మారకూడదు.

పుస్తకాల ప్రభావం

‘‘నేను పాండిత్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. నాకు తోచింది చదువుకుంటూ వచ్చా. చదివింది నలుగురికి చెప్పడం కంటే ఆచరణలో పెట్టడమే నాకు సులభం. పుస్తకాలు నా జీవితంపై చాలానే ప్రభావం చూపించాయి. ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో కాపీ కొడదామనుకున్నా. పక్కనున్న స్నేహితుడు చూపిస్తున్న సమయంలో ఎక్కడో చదువుకొన్న గాంధీగారి మాటలు గుర్తుకొచ్చాయి. ‘కాపీ చేస్తూ దొరికిపోయానని, అలా చేయడం తప్పు’ అని గాంధీజీ చెప్పింది చదివినప్పుడు నాకు భలే అనిపించింది. కానీ నేను అదే చేస్తున్నా. ‘నా స్థానంలో గాంధీ ఉండుంటే ఇలా చేయరు కదా? ఆయన చెప్పింది చదివి ఏం నేర్చుకున్నావు?’ అని ఆ క్షణమే నాలో ఆలోచన మొదలైంది. వెంటనే పరీక్ష వదిలేసి వచ్చా. పుస్తకాలు నా ఆలోచనా విధానాన్ని మార్చేశాయి. ‘నిజాలు నిర్భయంగా మాట్లాడితే ఏమవుతుంది? మహా అంటే పొడిచేస్తారు, ఇంతకంటే ఏం చేస్తారు?’ అనిపిస్తుంటుంది’’


చదువుకొనే రోజుల్లో ‘చిరంజీవి తమ్ముడు’ అనే మాట ఇబ్బంది పెట్టేదా? లేదంటే గౌరవంగా భావించేవారా?
నాకు అలాంటి గుర్తింపులు ఇష్టం ఉండవు. ‘నేను చిరంజీవి తమ్ముణ్ని’ అనే విషయం ఎవరికీ తెలియకపోతే బాగుండేదనుకొనేవాణ్ని. ఎందుకంటే ఆయన్ని ఇష్టపడేవాళ్లే కాదు. ఇష్టపడనివాళ్లూ ఉంటారు కదా? వాళ్లతో నేను రోజూ గొడవలు పెట్టుకోలేను. నేను ఏదైనా తప్పు చేస్తే ‘ఏరా సినిమా వేషాలేస్తున్నావా’ అనేవారు. నాకు ఆ పదం చిరాకు తెప్పించేది. మా అన్నయ్య ‘నువ్వు మరీ సెన్సిటీవ్‌ అయిపోతున్నావ్‌... ఇలాగైతే బతకలేవురా’ అనేవారు.
ఒకప్పుడు శ్రీశైలం అడవుల్లోకి పారిపోదామనుకొన్నారని చెప్పారు. నిజంగా వెళ్లిపోతే ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోయేవారేమో?
మా అమ్మ ఇదే అంటుంటుంది. ‘ఒరేయ్‌ బ్రహ్మచారిగా ఉండిపోదామనుకొన్నావ్‌. ఇన్ని పెళ్లిళ్లు చేసుకొన్నావ్‌..’ అంటూ ఆ రోజుల్ని గుర్తు చేస్తుంది. జీవితమంటే అంతే. ఎప్పుడు ఎన్ని మలుపులు తీసుకొంటుందో చెప్పలేం. ఎలిజిబెత్‌ టేలర్‌ అన్ని పెళ్లిళ్లు చేసుకొందీ అంటే ‘అలా ఎలా చేసుకొంటారో’ అనుకొనేవాణ్ని. నా జీవితం అలానే అయ్యింది.

మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తి ఎలా కలిగింది?
చిన్నప్పుడు శారీరకంగా బలం ఉండేది కాదు. కొంతమందిని కొట్టాలనిపించేది. కొట్టాలంటే బ్రూస్లీలా కరాటే నేర్చుకోలనుకోవడం తప్ప పెద్దగా తెలీదు. కనీసం ఎవడైనా కొడుతుంటే వాడి నుంచి కాపాడుకోవడానికైనా కొన్ని విద్యలు తెలుసుండాలి అనుకొన్నా. అలా నేర్చుకొన్నవే మార్షల్‌ ఆర్ట్స్‌. వీటిని నేర్చుకోవడం వల్ల సహనం పెరిగింది.

గన్స్‌ లేకపోతే పవన్‌ కల్యాణ్‌ సినిమాలే చేయడు.. అంటుంటారంతా. పూరి జగన్నాథ్‌ ఓసారి గన్స్‌ విషయంలో మీపై సెటైర్‌ వేశారు..
అది సరదాకి అన్నదే. చిన్నప్పుడు దీపావళి జరుపుకొనేటప్పటి నుంచీ గన్స్‌ ఇష్టం. ఇది వరకు నాణేల్ని, స్టాంపుల్నీ సేకరించేవాణ్ని. ఆ హాబీలు మధ్యలోనే వదిలేసినా. గన్స్‌పై మక్కువ పోవడం లేదు.

‘ఖుషి’లో హిందీ పాట పెట్టారు.. ‘సర్దార్‌’లో హిందీ పాటలు వినిపించారు. హిందీ పాటలంటే అంత అభిమానం ఎందుకు?
నాకు ప్రతి భాషా ఇష్టమే. రెండు సంస్కృతుల్ని కలిపే శక్తి కళకు ఉంది. కళాకారుల వ్యక్తిగత బాధ్యత అది. హిందీ పరాయి భాష కాదు. అది మన జాతీయ భాష. అలాంటప్పుడు సినిమాల్లో ఎందుకు టచ్‌ చేయకూడదు అనిపించింది. నాకు జానపద గీతాలన్నా ఇష్టం. నా చిన్నప్పుడు నాన్న ఇంట్లో అలాంటి పాటలు వింటూ ఉండేవారు. నటనలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు శ్రీకాకుళం జిల్లా వాళ్లు పరిచయమయ్యారు. వాళ్ల బాణీ నాకు నచ్చింది. ఏదైనా ఓ పాట, కథ బాగుంటే వీలు కుదిరినప్పుడు సినిమాల ద్వారా గుర్తు చేయడం మన బాధ్యత. ఆ కళ ఉనికిని కాపాడినవాళ్లమవుతాం.నానా భాష సమితి
‘‘మా ఇంట్లో నానా భాషా సమితి కనిపిస్తుంది. మా అమ్మాయి ఆద్య మరాఠీలో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కోసం నేను బ్రోకెన్‌ మరాఠీ మాట్లాడాల్సి వస్తుంది. ఇక ఇంట్లో ఉన్న చిన్న కూతురుతో తెలుగులో మాట్లాడదామంటే ఆ అమ్మాయికి ఇంగ్లిషే వస్తుంది. నాకు అర్థం కాదు. ఇదంతా ఆలోచిస్తే ఎవడో జీవితాన్ని నేను బతుకుతున్నట్టు ఉంది తప్ప నా జీవితాన్ని బతుకుతున్నట్టు లేదు. నా భార్య అన్నా లెజినోవా ఆర్ధోడాక్స్‌ క్రిస్టియన్‌. వాళ్ల విశ్వాసానికి తగ్గట్టుగానే మా అమ్మాయిని పెంచుతున్నా. పోలెనా అని పేరు పెట్టడానికి కారణం అదే. అన్నా లెజినోవా వయొలిన్‌ ప్లేయర్‌. తను లింగ్విస్టిక్‌ ఎబిలిటీలో ట్రాన్స్‌లేటర్‌. తెలుగు చదువుతుంది. మొన్న మావాడు తెలుగు పుస్తకం చదువుతూ ఉంటే పక్కనే కూర్చుని అందులోని అక్షరాల్ని గగం అని తనూ చదువుతూ ఉంది. పక్కనున్న ‘న’ని ఎక్కడ స అంటుందో అని భయపడి నేనే గగనం అని చెప్పా (నవ్వుతూ).’’


 ‘దర్శకుణ్ని పక్కన పెట్టి పవనే సినిమా అంతా తీసుకొన్నాడు’ అనే కామెంట్లు వినిపిస్తుంటాయి..
దర్శకుడు ఏం చెప్పినా సరే.. నాకు ఇష్టమైతేనే చేస్తా. నా బలాలు, బలహీనతలు నాకు తెలుసు. ‘ఎన్టీఆర్‌లానో, చరణ్‌లానో డ్యాన్స్‌ చేయండి’ అంటే నా వల్ల ఏమవుతుంది. ‘నాకొచ్చే మూమెంట్స్‌ ఏడెనిమిది ఉంటాయి. వాటిలో నీకు ఏది నచ్చితే అది చేస్తా’ అంటాను. అందుకే నేను ఇన్‌వాల్వ్‌ అవుతా అంటారేమో?
చిరంజీవి తమ్ముడు.. డాన్సులు బాగా చేయాలనుకోవడం తప్పు కాదేమో!
హీరో అంటే అన్నీ చేయాలనే అభిప్రాయానికి నేను వ్యతిరేకం. నాకొచ్చేదేదో నేను చేస్తా. ‘ఇంద్ర’లో అన్నయ్య వీణ స్టెప్పు వేశారు. ‘సర్దార్‌...’లో నేనూ వేశా. అన్నయ్య నేలపై నుంచి స్టైల్‌గా పైకి లేస్తారు. నేనేదో అక్కడే నిలబడి.. నాకొచ్చింది చేశా. అది నా వీణ స్టెప్పు. ఏదో ఒకసారి డాన్స్‌ చేయమంటే చేస్తా. అదే ఫార్ములా అయిపోతేనే కష్టం. సినిమాల్లోకి వెళ్తాను అనగానే నాగబాబు అన్నయ్య ‘కల్యాణ్‌కి హార్స్‌ రైడింగ్‌ నేర్పించండి’ అన్నారు. అక్కడ మా నాన్న ఉన్నారు. ‘వీణ్ని గుర్రాలు తోలడానికి పంపిస్తున్నారా, నటించడానికి పంపిస్తున్నారా? ముందు నటించడం నేర్చుకో’ అన్నారు. నాన్న ఆ మాట అనగానే నిజమే అనిపించింది. నా పరిధిలో నేను కష్టపడి పనిచేస్తా. నాకు వచ్చిన దాన్ని సిన్సియర్‌గా చేస్తా. మిగిలినవాళ్లతో పోటీపడి నిరూపించుకోవాలనే ధ్యాస ఉండదు.

‘సర్దార్‌’ ఫలితంపై సంతృప్తిగా ఉన్నారా?
అందరూ బాగుంది అంటున్నారు. నేనూ హ్యాపీనే. మేం ఎంత కష్టపడాలో అంత పడ్డాం. ఫలితం చెప్పాల్సింది ప్రేక్షకులే.

ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందా?
నూటికి నూరు శాతం ఉంటుంది. దర్శకుడు ఎవరు? ఎప్పుడు? అన్నది చెప్పలేను.

దాసరి నిర్మాణంలో సినిమా ఎప్పుడు?
దాసరి అంటే నాకు గౌరవం. తెలుగు సినిమాకి ఎంతో చేశారు. అలాంటి వ్యక్తితో సినిమా అంటే నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. మంచి కథ దొరకాలి. ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు సినిమా చేస్తా.

‘సత్యాగ్రహి’ సినిమా ఉంటుందా?
‘సత్యాగ్రహి’లో ఏం చెప్పాలనుకొన్నానో.. అది ‘జనసేన’ పార్టీ ఆవిర్భావంలోనే చెప్పేశా. సినిమాలో చెప్పడం కంటే బయట చేసి చూపించడం బాగుంటుంది అనిపించింది.

తదుపరి చేయనున్న సినిమా ఏది?
ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ఉంది. ఫ్యాక్షనిజంతో కూడిన ప్రేమకథ అది.

సినీ తారల వ్యక్తిగత జీవితం పబ్లిక్‌ అయిపోతుంటుంది. దాన్ని మీరెలా తీసుకొంటారు?
అందులో తప్పేం ఉంది. ఎవరిష్టం వాళ్లది. నా వ్యక్తిగత జీవితం గురించి చాలాసార్లు రాశారు. నా పెళ్లిళ్ల గురించి వెటకారం చేశారు. అది కాదనలేని ఖండించలేని భారం. మీరు రాసుకోండి. నేనేం మారను కదా? మీ కథలు మీవి. నా జీవితం నాది. సెలబ్రెటీల జీవితంలో అదీ ఓ భాగం. అందరూ మన గురించి మంచే మాట్లాడుకొంటారా? అయినా నేనేంటో నాకు తెలుసు కదా? మరొకరు చెప్పాలా? ఒకరు పొడిగితే సంబరపడతానా. తిడితే పట్టించుకొంటానా? ఎవరేం చెప్పినా వింటాను. నూటికి 90 సార్లు భరిస్తాను. మరీ పరిధి దాటి మాట్లాడితే అప్పుడు గట్టిగానే సమాధానం చెబుతా. అలాంటప్పుడు అవతల ఉన్నది ఏ స్థాయి వ్యక్తయినా సరే వదలను. నా గురించి మాట్లాడుతున్నారు సరే.. వాళ్ల జీవితాలైనా సరిగ్గా ఉన్నాయా? మీరంత నిక్కచ్చిగా ఉన్నారా? నాకు బతకడం ఇష్టం. కానీ పిరికితనంతో బతకలేను. విమర్శలకు కుంగిపోయే తత్వం కాదు నాది.
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని రంగంలోకి దించాలని నిర్ణయించారు కదా. కానీ మీరింకా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైనే దృష్టిపెట్టలేదు?
రాజకీయం అనేది ఒక ప్రక్రియ. పార్టీ పూర్తిస్థాయిలో బలోపేతమవడానికి ఏడాది పట్టొచ్చు, రెండేళ్లు పట్టొచ్చు లేదంటే దశాబ్దం కావొచ్చు. ఎల్లుండో, అవతలి ఎల్లుండో నా పార్టీ పూర్తిస్థాయిలో వ్యవహారాల్ని నిర్వహించాలని ఆశించను. ఒక అడుగు ముందుకేశా. ఆ ప్రక్రియ ఎలా తీసుకెళుతుందో నాకూ తెలియదు.
మీకంటే ఎక్కువ ఇమేజ్‌, అభిమానులున్న కథానాయకుడు మీ అన్నయ్య చిరంజీవి. రాజకీయ పార్టీ విషయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. జనసేన విషయంలో మీకా భయాలేమీ లేవా?
ఒక స్టార్‌గా రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఆ ఇమేజ్‌ అలాగే ఉంటుందనుకోను. మొదట నామీద నాకు అన్ని అంచనాలు లేవు. పదవి నా లక్ష్యం కాదు. ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. వాళ్ల గళాన్ని వినిపించే నాయకుడు కావాలి. నా దృష్టి దానిపైనే. ఏ రాజకీయ నాయకుడినైనా తీసుకోండి. అనుభవమే ముఖ్యం. ముందు ప్రజల్లోకి వెళ్తేనే కదా అనుభవం వచ్చేది. పిల్లవాడు పుట్టగానే 20 ఏళ్ల యువకుడు కాలేడు కదా! పార్టీ కూడా అంతే. ప్రజల్లోకి వెళ్లాలి, తిరగాలి, ఎదగాలి. రాజకీయం పరంగా నా పరిధులు నాకున్నాయి. 5 స్థానాల్లో పోటీ చేస్తానో, లేదంటే అన్నిస్థానాల్లో పోటీ చేస్తానో ఆ రోజు పరిస్థితుల్ని బట్టి ఉంటుంది. ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా నేను పార్టీ పెట్టా.

ప్రశ్నించడం కోసమే పార్టీ అన్నారు. ఇప్పుడు ప్రశ్నించడానికి చాలా విషయాలున్నా స్పందించడం లేదన్న విమర్శ మీపై ఉంది?
అది ఒప్పుకుంటా. ఆ రోజు చెప్పావు కదా, మరి ప్రశ్నించడం లేదే అని నన్ను నిలదీసే హక్కు ఎవరికైనా ఉంది. అయితే నేనొక్కడినే ఉన్నానిప్పుడు. నాకంటూ ఒక మిషన్‌ ఏర్పాటయ్యేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. సినిమాల్లో నేనొక్కడినే సులభంగా డైలాగ్‌ చెప్పి ప్రేక్షకుల్ని అలరించగలను. రెండున్నర గంటల్లో అన్ని సమస్యల్ని తీర్చేయగలను. కానీ రాజకీయంలో అలా సాధ్యం కాదు. దశాబ్దాల ప్రయాణమిది. ప్రజల కోసం పోరాడే సహనం, ప్రశ్నించే ధైర్యం నాకుంది. ప్రశ్నించడానికే అన్నది ఎవరో రాసిందే తప్ప నేను రాజకీయ ప్రక్రియ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటా.

గత ఎన్నికల్లో పోటీ చేసుంటే బాగుండేది అనిపించిందా?
అప్పుడు నేను తీసుకొన్నదే సరైన నిర్ణయం. పోటీ చేసే పక్షంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాలి. అది నాకిష్టం లేదు. ఎందుకంటే నాకు తెలంగాణ అంటే ఇష్టం. ఇక్కడే ఎక్కువ కాలం ఉన్నా. ఇక్కడి పరిస్థితులపై నాకు పూర్తి అవగాహన ఉంది. విడిపోవాలనుకొన్నప్పుడు ఆనందంగా విడిపోవాలి. ఆ విభజన వల్ల ఎవరూ నష్టపోకూడదన్నది నా అభిప్రాయం. ‘జై ఆంధ్రా’ ఉద్యమంలోనూ నేను బయటకు రాకపోవడానికి కారణం ఒకటే. ఆ సమయంలోనూ నేను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడాలి. మనసులో వ్యతిరేకత లేనప్పుడు ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఆ సమయంలో అనుభవం ఉన్న పార్టీకీ, నాయకుడికి అధికారం దక్కడమే సమంజసం అనిపించింది. అందుకే తెదేపాకు మద్దతు ఇచ్చా.

ఎన్నికల సమయంలో మీ ప్రసంగాలన్నీ మీ స్నేహితుడు త్రివిక్రమ్‌ చేతే రాయించారట. నిజమేనా?
అలా అనుకోవడంలో తప్పేం లేదు. నా అభిప్రాయాలను నా పక్కవాళ్లతో పంచుకోవడం ఇష్టం. ఎవరేం చెప్పినా వింటాను. అభిప్రాయాల్నీ తెలుసుకొంటా. నాకంటూ ఓ స్పష్టమైన ఎజెండా ఉంది. ఎన్నికల ప్రసంగాలు ఎవరితోనో రాయించుకొంటే మరి ప్రెస్‌మీట్స్‌లో ఎలా మాట్లాడతా? అప్పుడు ‘ఈ ప్రశ్న అడిగారు, ఏం చెప్పమంటారు?’ అని నేను అవతలివాళ్లకి ఫోన్‌ చేయాలా? నేను, త్రివిక్రమ్‌ స్నేహితులం కాబట్టి అలా అనుకొంటుంటారంతే. కానీ నావైన భావాల్నే బయటపెడుతుంటా.
 

source:eenadu.net