Author Topic: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు మరియు సామెతల వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు  (Read 590 times)

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
నేల మీద కూర్చుని తింటే!

ఇప్పుడంటే మనది కాని జీవన శైలికి అలవాటు పడి డైనింగ్ టేబుళ్ల మీదే తింటున్నాం కానీ... ఒకప్పుడు అంతా నేల మీదే తినేవారు కదా! ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంలోని వారంతా కలిసి తినాలనుకుంటే హాయిగా నేలమీదే కూలబడతారు. ఇంతకీ ఈ సంప్రదాయం ఏదో అలవోకగా వచ్చిందీ కాదు. ఒకప్పటి జనాలకి బల్లలు, కుర్చీలు అందుబాటులో లేకా కాదు. నేల మీద కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే... - భోజనం చేసేందుకు కూర్చునే స్థితిలోనే ఒక ఆసనం కనిపిస్తుంది. ఇలా నేల మీద కాళ్లు మడుచుకుని కూర్చునే భంగిమలు సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేయటానికీ, వెన్ను నిటారుగా ఉండటానికీ, మానసిక ప్రశాంతతకూ ఈ ఆసనాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. - కూర్చుని తినడం వల్ల పొట్ట, ప్రతి ముద్దకీ... ముందుకీ, వెనక్కీ వంగుతూ ఉంటుంది. ఇలాంటి కదలికల వల్ల రెండు లాభాలు. ఒకటి- పొట్ట చేసే ఇలాంటి కదలికల వల్ల జీర్ణరసాలు తగినంతగా ఊరుతాయి. రెండు- తగినంత ఆహారం తీసుకుని పొట్ట నిండుగా మారిన వెంటనే ఇక తినాలనిపించదు. కాబట్టి మితాహారం తీసుకోవాలని తపించేవారికి ఇదో గొప్ప చిట్కా! - చిన్నప్పటి నుంచి ప్రతిరోజూ నేల మీదే కూర్చుని భోజనం చేసేవారిలో కీళ్లనొప్పులు తక్కువగా ఉండటాన్ని గమనించవచ్చు. ఎందుకంటే నేల మీద కూర్చుని తినడం మన కీళ్లకి చక్కని వ్యాయామం. ఇలా కీళ్లని మడిచే అలవాటే లేకపోతే కొన్నాళ్లకి అవి పట్టేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి వృద్ధాప్యంలో సైతం ఒకరి సాయం లేకుండా నేల మీదకి కూర్చుని, నిల్చొనే శక్తి ఉండటానికి ఈ అలవాటు దోహదపడుతుంది. - నేల మీద కూర్చుని తింటున్నప్పుడు తల నుంచి తొడల వరకూ ప్రతి భాగమూ కదులుతుంది. తొడల దగ్గర్నుంచీ ముడుచుకుని ఉండటం వల్ల రక్త ప్రసారం అంతా శరీరపు పైభాగంలో కేంద్రీకృతమవుతుంది. జీర్ణవ్యవస్థకు, గుండె పనితీరుకి కూడా ఇది చాలా మేలుచేస్తుంది. తద్విరుద్ధంగా కుర్చీ మీద కూర్చుని ఆహారం తీసుకుంటే రక్తప్రసారం అంతా కాళ్ల వైపుకి ప్రయాణిస్తుంది. - తినే ప్రతిసారీ నేల మీద కూర్చోవడం అన్నది మనం ఆహారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నమన్న సూచనను మెదడుకి అందిస్తుంది. దానికి అనుగుణంగానే మన ఒంట్లోని లాలాజలం మొదల్కొని సకల జీర్ణ రసాలనూ మెదడు సిద్ధం చేస్తుంది. - నేల మీద కూర్చుని తినడం, నేల మీద పడుకోవడం అంటే ప్రకృతికి వీలైనంత దగ్గరగా ఉండటమే. ఇలాంటి చర్యలు మనకు అమ్మ ఒడిలో ఉన్నంత తృప్తిని కలిగిస్తాయి. దీనికి తోడు సుఖాసనం/ అర్ధపద్మాసనాలు మానసిక ప్రశాంతతను కల్గిస్తాయని ముందుగానే చెప్పకున్నాము. తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావడానికీ, జీర్ణం అయిన ఆహారం ఒంటపట్టడానికీ ఇవి సాయపడతాయి.

source:teluguone.com
« Last Edit: July 05, 2016, 02:59:09 PM by Pa1Kalyan »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
పుట్టు వెంట్రుకలు తీయడం వెనక రీజన్స్ ఏంటి ?

పుట్టు వెంట్రుకలు తీయటం అని వ్యవహారంలో చెప్పబడే ఒక సంస్కారం ఇది. దీనిని కేశఖండనం, ముండనం, క్షౌర కర్మ అని కూడా అంటారు. తల్లి కడుపులోనుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటి మారు వెంట్రుకలు తీయించే కార్యక్రమం. ఏ పనినైనా మొదటి మారు చేసేప్పుడు ఆ పనికొక గౌరవాన్ని ఆపాదించటానికి, దాని వల్ల ఆ జీవికి మేలు కలిగించటానికి ఒక సంస్కారంగా మలచారు మన పెద్దలు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నిండ కుండా గాని, మూడవ సంవత్సరంలో గాని నిర్వహిస్తు ఉంటారు. అదీ కుదరనప్పుడు ఐదవ సంవత్సరంలో చేస్తారు. కుదరక పోవటానికి తల్లి మళ్ళీ గర్భిణిగా ఉండటం ప్రధాన కారణ మవుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తల్లి ఒడిలో కూర్చోబెట్టి చేస్ “బలాయుర్వర్చోభి వృద్ధిశ్చ చూడకర్మ ఫలం స్మృతమ్. ” ఈ చూడా కర్మ చేయటం వల్ల దేహానికి బలం, ఆయుస్సు, తేజస్సు, కలుగుతాయని స్మృతులు చెపుతున్నాయి.

“కేశ ఖండనం సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, కలిగించి ఉత్సాహాన్ని వృద్ధి చేస్తుంది. ”  అని చరక సంహిత చెపుతుంది. గోళ్ళు, జుత్తు మృత కణ జాలంకదా! (పైగా జుత్తుకి మనిషి చేసిన పాపాలు సంక్రమిస్తాయట. కనుక ఎన్నో సందర్భాలలో, వైదిక క్రియ కలాపాలలో శిరోముండనం చేయించటం కనపడుతుంది. వెంట్రుక శరీరం మీద కాక మరెక్కడ కనపడినా దోషంగా భావించ బడుతుంది.) కేశ ఖండనానికి కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి. అందులోనూ శిశువు శరీరానికి మొదటి మారు కత్తి వంటి వాడి ఆయుధాన్ని తాకిస్తారు, కనుక మామూలుగానే జాగ్రత్త వహించ వలసిన అవసరం ఉంది. దానిని ఒక పవిత్ర కార్యకలాప మంటే, సంప్రదాయ మంటే ఎంతో భయ భక్తులతో వ్యవహరిస్తారు.

ప్రస్తుత నాగరక సమాజంలో కేశ ఖండనం, ముఖ్యంగా మగ పిల్లలకు తప్పని సరి. చిన్నతనంలో జుట్టు పెరగటం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు. చికాకు తగ్గించటానికి, ఆరోగ్య దృష్టితోను జుట్టుని చిన్నదిగా ఉంచటం మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనులు కేశఖండనాన్ని చూడాకర్మమనే సంస్కారంగా మలచారు.

పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల లోపలి సంధులు కూర్చ బడవు. అందుకే చిన్న పిల్లల తల పై భాగం మెత్తగా లోతుగా ఉంటుంది. ఆ మెత్తని భాగాన్ని మాడు అంటారు. కొన్ని నెలల నుండి రెండు మూడు సంవత్సరాలకు అది గట్టి పడుతుంది. దానిని మాడు పూడటం అంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏర్పడిన జుట్టు మెత్తని ఆ మాడు భాగాన్ని భద్రంగా కప్పి ఉంచి కాపాడుతుంది. కొంత మంది పిల్లలకు త్వరగా కొద్ది నెలలకే గట్టి పడినా సాధారణంగా ఎక్కువ మందికి ఒకటిన్నర రెండు సంవత్సరాలకి మాడు గట్టి పడుతుంది . అప్పటితో పుట్టినప్పుడున్న జుట్టు అవసరం తీరిపోతుంది. దానిని తీసివేయాలి. తరువాత తాజాగా కొత్త జుట్టు వస్తుంది. పుట్టుకతో వచ్చిన జుట్టు తల్లి గర్భంలో ఉండగా అక్కడి మలిన జలాలలో నాని ఉంటాయి. వాటిని తొలగించటం వల్ల మలినమైన జుట్టు పోయి కొత్తగా పొడవైన బలమైన జుట్టు వస్తుంది.

గృహ్య సూత్రాలలో చెప్పబడిన చూడాకర్మ మంత్రాలు వైదిక సాహిత్యంలోనివి అవటం వల్ల ఇది చాలా ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. తూర్పు ముఖంగా బిడ్డని తల్లి ఒడిలో కూర్చుండ బెట్టి, ఆచమనం, సంకల్పం, ఈశ్వర స్తుతి అగ్ని ప్రజ్వలనం, ఆహుతి సమర్పణం చేయాలి. చల్లటి నీటితో, ఆ పై వేడి నీటితో కేశాలని తడిపి, వెన్నతో కానీ, పెరుగుతో కానీ తుడవాలి. ముందుగా కత్తిని స్తుతించి తలమీద మూడు దర్భలను పెట్టి, కత్తిరించి పార వేయాలి.

“ ఓం శివో నామాసి స్వధితిస్తే  పితా నమస్తే అస్తు మామా హిగ్ మ్ సీః ” (పటిష్ఠమైన లోహంతో తయారు చేయ బడిన ఖడ్గమా! నీకు నమస్కారం. మాకెట్టి హాని కలుగ చేయకుందువు గాక!) అని ప్రార్థించటం, క్షురకుని సూర్యుని అవతారంగా భావించి సన్మానించటం ప్రతి పని ముట్టుని, ప్రతి వృత్తిని గౌరవించే సంప్రదాయానికి అద్దం పడుతుంది. ఎందుకంటే మనిషి జీవితం సుఖంగా సాగటానికి అన్ని వృత్తుల వారి సహకారం అవసరం. కనుక అన్నింటికి సమ ప్రాధాన్యం ఇవ్వబడింది. దర్భలను కత్తిరించి చేతికి కొంచెం అలవాటు అయిన తరువాత ఎడమ చెవి వెనుక నుండి మొదలు పెట్టి ప్రదక్షిణంగా జుట్టుని తీయాలి. శిశువుకి స్నానం చేయించి కొత్త బట్టలు ధరింప చేసి, తల్లి ఒడిలో కూర్చో బెట్టి, క్షురకునికి ధాన్యం ఇవ్వాలి. అందరకు నమస్కరింప చేసి , పురోహితునికి దక్షిణ తాంబూలాదుల నిచ్చి ఆశీర్వదాన్ని ఇప్పించాలి. బిడ్డకి హారతి ఇవ్వాలి.

మొదటి కత్తెర మేన మామ వేయటం కొంత మంది తెలుగు వారి ఇంటి ఆచారం. ఇటువంటి భేదాలెన్నో ప్రాంతాలని బట్టి, వంశాచారాలని బట్టి కనపడుతుంటాయి .  కొంత మంది ఇళ్ళలో  ఆడ పిల్లలకి కూడా పుట్టు వెంట్రుకలు తీయించే ఆచారం ఉంది. మగ పిల్లలకి మాత్రం తప్పని సరి. ఈ రోజుల్లో ఎందుకైనా మంచిదని ఏదో  దేవాలయంలో జుట్టు తీయించి మొక్కు తీర్చుకుంటున్నారు.  అలా చేస్తే ఏ పద్ధతిని పాటించ నవసరం లేదు కదా!

source:teluguone.com
« Last Edit: July 05, 2016, 08:34:40 PM by Pa1Kalyan »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
ప్రదక్షిణ ఎందుకు!

ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకు ప్రదక్షిణ చేసే ఆచారం ఒకటి ఉంది. ఇతర మతాలలో కాస్త అరుదుగా కనిపించే ఈ ఆచారానికి హిందూ ధర్మంలో మాత్రం అధికమైన ప్రాధాన్యతే ఉంది. ప్రదక్షిణ లేకుండా గుడి లోపలికి ప్రవేశిస్తే మనసులో ఏదో వెలితి కలిగేంతటి ప్రాముఖ్యత ఉంది. ఇంతకీ ఈ ప్రదక్షిణ వెనుకనున్న ఆంతర్యం...
 
- మనకంటే పెద్దవారు, మహాత్ములు కనిపించినప్పుడు నమస్కారం చేయడం ఒక ఎత్తైతే.. వారి గౌరవార్థం ప్రదక్షిణ చేయడం ఒక ఎత్తు. భగవంతుని కూడా మనం గురువుగా, మహాత్మునిగా ఆరాధాస్తాం కనుక ఆయన ఆశీస్సులను కోరుతూ ప్రదక్షిణను సాగిస్తాము. ఈ సూక్ష్మాన్ని తెలిసినవాడు కాబట్టే వినాయకుడు తన తల్లిదండ్రుల చుట్టూనే ప్రదక్షిణాలు చేసి ముల్లోకాలనూ దర్శించినంత భాగ్యాన్ని పొందాడు.
 
- గుడి లోపలికి ప్రవేశించిన మనిషి రకరకాల ఆలోచనలతో ఉంటాడు. లౌకిక వ్యవహారాలు ఇంకా అతని మనసుని ఆక్రమించుకునే ఉంటాయి. అలాంటి మనిషి నేరుగా గర్భగుడిలోకి అడుగుపెట్టేసి భగవంతుని దర్శించుకుంటే అది యాంత్రికంగా సాగిపోతుంది. అందుకని భగవంతుని సన్నిధిలోకి చేరేందుకు అవసరమయ్యే భక్తి భావనలను ప్రేరేపించేందుకు ప్రదక్షిణల సమయం ఉపయోగపడుతుంది.
 
- మనిషి వలయాకారంలో నడిచేటప్పుడు అతని ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. అలాంటి సమయంలోనే లౌకికమైన విషయాలను పక్కనపెట్టి భగవన్నామాన్ని స్మరిస్తూ సాగితే... మనసు ప్రశాంతతను సాధిస్తుంది.
 
- ధార్మిక జీవనంలో భగవంతుడే కేంద్ర బిందువు. ఆయన చుట్టూ తిరగడం అంటే... ‘మేము నిన్ను ఆశ్రయించుకునే ఉన్నాము’ అన్న సందేశాన్ని భౌతికంగా అందించడమే!
 
- ప్రదక్షిణ అంటేనే దైవాన్ని గౌరవించడం. అందుకనే దైవం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేని పూజాదికాల వంటి సందర్భంలో ‘ఆత్మ ప్రదక్షిణ’ చేసుకోమని చెబుతుంటారు పెద్దలు. ఎందుకంటే మనలోనూ దైవం ఉందన్నది ఒక నమ్మకం కదా!
 
- ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపునే ఉండాలి. కుడి శుభానికీ, రుజువర్తనకీ, స్వచ్ఛతకూ ప్రతీక. పైగా ప్రదక్షిణ చేసేందుకు కూడా సులువు.
 
- ఏదో క్రతువులాగా ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్లిపోయేవారే కాదు... తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకునేందుకు, కోరికలను ఈడేర్చుకునేందుకు ప్రదక్షిణను కూడా ఒక మార్గంగా భావించేవారూ ఉంటారు. కొందరు సహస్రనామాలు చదువుకుంటూ ముందుకుసాగితే మరికొందరు స్థిరచిత్తంతో పదుల కొద్దీ ప్రదక్షిణలు చేస్తారు.కొందరు పాద ప్రదక్షిణతో ముగిస్తే మరికొందరు పొర్లుదండాలు సాగిస్తారు.
 
- ప్రదక్షిణ మనసుకే కాదు, శరీరానికి కూడా వ్యాయామమే! నడకను మించిన ఆరోగ్యదాయకమైన వ్యాయామం మరేముంటుంది? శరీరం అలసినప్పుడు మనసూ కుదుటపడుతుంది. అందుకే డిప్రెషన్‌తో కుంగిపోయేవారిని ఏదో ఒక వ్యాయామం చేయమని సూచిస్తూ ఉంటారు పెద్దలు. అంటే ప్రదక్షిణతో అటు పుణ్యమూ ఇటు పురుషార్థమూ ఏకకాలంలో సాధ్యమవుతాయన్నమాట!

source:teluguone.com
« Last Edit: July 05, 2016, 08:34:56 PM by Pa1Kalyan »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
ఆషాఢంలో గోరింటాకు ఎందుకు!

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు... గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు పోరుతూ ఉంటారు. ఎందుకంటే...
 
జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాల ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు, ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ, చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది.ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.
 
ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.

ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట, వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
 
ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు... పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే! గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.
 
ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో, కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.

source:teluguone.com
« Last Edit: July 05, 2016, 08:35:06 PM by Pa1Kalyan »

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
పుట్టిన రోజు ప్రత్యేకత ఏమిటి?

పుట్టిన రోజుని ఒక వేడుకగా జరుపుకోవటం అన్ని దేశాల సంస్కృతులలోను అంతర్భాగం. అవతార పురుషులు,  అధ్యాత్మిక గురువులు, జాతిని నడిపించిన నాయకులు, ఏవైనా ఘనకార్యాలు చేసినవారు కల కాలం గుర్తుంచుకోవలసిన వారు కనుక వారి జన్మ దినాన్ని జయంతి పేరుతో వైభవంగా జరుపుకుంటాం.ప్రతి వ్యక్తి తనని  తాను విశిష్టుడుగానే పరిగణించుకుంటాడు. తన పుట్టుక ఒక ఘన కార్యంగా భావించుకుంటాడు. కనుక ఆ రోజుని పండుగ గా జరుపుకోవాలనుకుంటాడు. ఐతే, ఆ వేడుకని ఎలా జరుపుకోవాలో మాత్రం సరిగా తెలియదు. తలంటి పోసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, అర్ధరాత్రి కొవ్వొత్తులు ఆర్పి కేకులు కోయటం, అందరి మొహానా దానిని రుద్దటం , స్నేహితులతో కలిసి సరదాగా సినిమాలు, షికార్లు తిరగటం ..... ఇంతే ! అనే అభిప్రాయం అందరి మనస్సుల్లో బాగా నాటుకు పోయింది. అంతేనా? ఇవి ఎప్పుడైనా ,ఏ పండగకైనా చేసేవే కదా? పుట్టిన రోజు ప్రత్యేకత ఏమిటి?

 

రాబోయే సంవత్సరం అంతా ఎటువంటి పీడ లేక సుఖ శాంతులతో, శుభావహంగా ఉండాలని కోరుతూ చేసే క్రియా కలాపమే పుట్టిన రోజు వేడుక.  దీనికి మన పెద్దలు ఒక పద్ధతిని సూచించారు. ఉదయం (ఒకప్పుడు అందరు సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచే వారు. కనుకనే వారికి కంటి చూపు బాగుండేది.) నిద్రలేవగానే ఇంట్లో పెద్దలు తలకి నూనె పెట్టి , మంగళ  హారతి ఇచ్చిన తరువాత అభ్యంగన స్నానం చేయాలి.  క్రొత్త బట్టలుధరించి, ఇంట్లో దేవుడికి నమస్కారం చేయాలి. పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకోవాలి. వీలైతే దేవాలయానికి వెళ్ళటం ఉత్తమం. భోజనంలో పరమాన్నం తప్పక చేస్తారు సంప్రదాయం తెలిసిన పెద్దలు. పాలు (వీలైతే ఆవు పాలు), బెల్లంతో వండిన అన్నం శుభప్రదం. దేవతా ప్రీతికరం. ఆయుర్వృద్ధి కరం. అందుకనే అన్ని శుభ కార్యాలలో పరమాన్నం చేస్తారు.

 

పూర్వపు  రోజుల్లో పిల్లల పుట్టిన రోజంటే పేరంటం చేసే వారు. ముత్తైదువ లందరు కలిసి పాటలు పాడుతూ మంగళ హారతులిచ్చే వారు. అక్షతలు వేసి ఆశీర్వదించే వారు. వారందరికీ పసుపు కుంకుమలు,  తాంబూలాలతో పాటు తమ శక్తి కొద్ది కానుకలు కూడా ఇచ్చే వారు. ఇపుడు పేరంటాల స్థానంలో పార్టీలు వచ్చాయి. మంగళ హారతి స్థానాన్ని అమంగళ కరమైన దీపాలార్పటం ( కొవ్వొత్తుల నార్పటం) ఆక్రమించింది. దీపం వెలిగించటం శుభం. దీపం ఆర్పటం అశుభం. శుభ కార్యాన్ని దీపం వెలిగించి ప్రారంభించటం భారతీయ సంప్రదాయం. పుట్టిన రోజు పండుగ ,అంటే శుభ కార్యమే కదా. దేవతా ప్రీతికరంగా, దైవానుగ్రహం కోరి చేసే పనిలో కోడి గ్రుడ్డుతో చేసిన కేకు ప్రాధాన్యం వహిస్తోంది . ఈ రెండు పద్ధతుల్లో ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా!

 

మరి ,  పుట్టిన రోజుని ఈ రోజులకు తగినట్టుగా చేసుకునే విధానం ఏదైనా ఉందా? అంటే, ఉన్నదనే చెప్పాలి. మనం చాంద్ర మానాన్ని అనుసరించే వారం కనుక తిథుల ననుసరించి పుట్టిన రోజు జరుపుకోవటం సరైన పద్ధతి.  ఇంట్లో అమ్మ కానీ, ఇంకా పెద్దవారు కాని, ముఖాన బొట్టు పెట్టి, నువ్వుల నూనెతో తల అంటి, హరతిచ్చాక అభ్యంగన స్నానం చెయ్యాలి. కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. అంత కన్నా ముందు ఇంట్లో దేవుడికి, పెద్దలకు  నమస్కారం చేయాలి. పేరంటం అన్నది పాత పద్ధతి అయి పోయింది . కనుక పార్టీ అనుకునే విధంగా బంధు మిత్రులని ఆహ్వానించి ఇష్ట దైవం ముందు ఎన్నో పుట్టిన రోజో అన్నీ దీపాలు “ ఉద్దీప్యస్వ .................నిరృతిమ్ మమ” అనే మంత్ర చదువుతూ  వెలిగించి, వేడుక ప్రారంభించాలి. పాలు తేనె కలిపిన మిశ్రమాన్ని పాత్రలో పోసి,  ఉద్ధరిణ (చెమ్చా)తో గుండ్రంగ కలుపుతూ  “ త్ర్యంబకం యజా మహే సుగంధిం పుష్టి వర్ధనం ...... “ అనే మృత్యుంజయ మంత్రాన్ని ముమ్మారు పలకాలి.

 

దానిని స్వీకరించాలి. మెత్తని మధుర పదార్థాన్ని ( హల్వా , కలాఖండ్ వంటివి) పళ్ళెంలో నింపి, దానిపై వజ్రపు గుర్తుని (ముందుగా మిఠాయిని సగం చేస్తూ మధ్యలో నిలువు గీత, దానిని ఖండిస్తూ అడ్డ గీత, ఈ గీతల నాలుగు కొనలని కలుపుతూ నాలుగు గీతలు, వీటి నన్నింటిని చుట్టి పరిధిలాగా ఒక వృత్తము ) నెమ్మదిగా , మృదువుగా లిఖించాలి.  ఆ సమయంలో వచ్చిన వారందరు మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడు మంగళ  హారతి నిచ్చి పెద్దలు అక్షతలను వేసి ఆశీర్వదించాలి. చిన్న వారు పాదాల వద్ద పూలు ఉంచి , నమస్కారం చేసి, వారి ఆశీర్వచనం తీసుకోవాలి. అప్పుడు ఆ తీపి పదార్థాన్ని అందరూ భగవంతుని ప్రసాదంగా తీసుకోవాలి. ఆ పై విందులు వినోదాలు యథేచ్ఛ.   ఈ విధానం లో పెద్దల ఆశీస్సులు, భగవంతుని అనుగ్రహం పొందటం, ఆనందం ఉన్నాయి .

 

పుట్టిన రోజు చేసిన పని ఏదైనా సంవత్సరమంతా నిరాఘాటంగా సాగుతుందని నమ్మకం . అందుకని ఆ రోజు మంచి పనులు చేయాలనుకుంటారు. అందుకనే బీదలకు అన్న దానం , అనాథాశ్రమాల్లో, ఆసుపత్రుల్లో పళ్ళు, ఫలహారాలు , వస్త్రాలు, దుప్పట్లు మొదలైనవి పంచటం వంటి సామాజిక కార్య క్రమాలు చేసి తమకు వారి ఆశీర్వాదం లభించిందని తృప్తి  పొందుతూ  ఉంటారు.

 

నిజానికి జీవితంలో ఒక సంవత్సరం గిర్రున తిరిగి వచ్చిందంటే , కొత్త సంవత్సరం మొదలయిందంటే  అప్పటివరకూ, కనీసం జరిగి పోయిన సంవత్సరం, ఏం సాధించామని పర్యాలోచన చేసుకొని లక్ష్య సాధనకు కేటాయించ బడిన సమయంలో ఒక ఏడాది అయి పోయింది కనుక ఇక ముందు ఏమి సాధించ దలచుకున్నామో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. అందుకనే అప్పుడు పెద్దల ఆశీస్సులతో పాటు మార్గ దర్శనం అవసరమౌతుంది.     

source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTARగుడి ముందు గోపురం ఎందుకు?

భారతదేశం అనగానే ఆధ్మాత్మికత... ఆ ఆధ్యాత్మికతను ప్రతిబింబాలైన ఆలయాలు గుర్తుకువస్తాయి. భారతదేశమంతటా ఒకో ప్రాంతంలోని ఆలయాలు ఒకో శైలిలో ఉంటాయి. కానీ దక్షిణాదికి వచ్చేసరికి భారీ గోపురాలే ఇక్కడి ఆలయాల ప్రత్యేకతగా కనిపిస్తాయి. ఇప్పటికీ దక్షిణాది ప్రజలు గోపురాలని తమ సాంస్కృతిక వారసత్వంగా భావిస్తారు. అందుకనే తమిళనాడు రాజముద్ర మీద సైతం శ్రీవిల్లిపుత్తూరు గోపురమే దర్శనమిస్తుంది. ఇంతకీ ఈ గోపురాలు కేవలం ఆడంబరానికేనా, లేకపోతే వీటి వెనుక పెద్దలు ఆలోచించిన కారణాలు ఏమన్నా ఉన్నాయా అంటే...

 

- ఇప్పుడంటే అంతస్తులకొద్దీ ఎత్తైన భవంతులను కట్టేస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఊరంతటికీ ఎత్తైన భవనం ఆ ఊరి గోపురమే. ఒక ఊరికి వెళ్లేందుకు దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఈ గోపురాలు కనిపించేవి. అందుకేనేమో గోపురం అన్న మాటకి ‘పట్టణ ద్వారం’ అన్న అర్థం కూడా ధ్వనిస్తుంది. ఇప్పటికీ కంచికి వెళ్లే దారిలో దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచే ఆ ఊరి గోపురాలు కనిపిస్తూ ఉంటాయి.

 

- ఊరిలోనే ఎత్తైన, సురక్షితమైన భవనం కాబట్టి ప్రకృతి విపత్తులలో గోపురాన్ని మించిన ఆపన్న హస్తం ఉండదు. విపత్తులలో స్వామివారి ఆధ్యాత్మిక అభయం ఎలాగూ ఉంటుంది. ఇక భౌతిక రక్షణ కూడా వారి పాదాల చెంతనుండే గోపురం దగ్గర లభిస్తుందన్నమాట!

 

- ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లే బాటసారులకి అన్నిచోటలా సత్రాల వసతి ఉండదు. కానీ గుడి లేని ఊరు మాత్రం కనిపించదు. ఆ గుడి గోపురం నీడన కాసింత సేదతీరి, చీకటివేళన బడలికను తీర్చుకుని, ఇంత ఆహారం తీసుకుని మళ్లీ బయల్దేరేవారు బాటసారులు.

- గత సహస్రాబ్ది అంతా ఏదో ఒక యుద్ధంలోనే గడిచిపోయింది. ఎప్పుడు ఎటు వైపు నుంచి శత్రుసైన్యం విరుచుకుపడుతుందో, ఏ వైపు నుంచి అల్లరి మూకలు చెలరేగుతాయో తెలియని పరిస్థితి. ఇక తరుష్కుల దండయాత్రలు, బ్రిటిషర్ల దురాక్రమణలు సరేసరి! ఇలాంటి సమయంలో ఊరి వైపుగా ఎవరన్నా శత్రువులు వస్తున్నారేమో అని గమనించే ‘వాచ్‌ టవర్లు’గా గోపురాలు ఉపయోగపడేవి.

 

- గోపురాల విషయంలో చాలామంది విశ్వసించే అంశం... పిడుగుల నుంచి రక్షణ. గోపురాల పైన ఉండే కలశాలు పిడుగుపాటుని నిర్వీర్యం చేసే ‘ఎర్త్‌’లాగా పనిచేస్తాయని చాలామంది నమ్మకం. ఊరిలో ఉండే కట్టడాలన్నింటికంటే గోపురాలే పై ఎత్తున ఉంటాయి కాబట్టి, పిడుగులని దిగమింగి ఊరిని సురక్షితంగా ఉంచుతాయంటారు. గోపుర నిర్మాణానికి వాడే సామాగ్రి కూడా పిడుగులను నిర్వీర్యం చేసేందుకే అనువుగా ఉంటుందట.

 

- భౌతికమైన విషయాలను పక్కనపెడితే... ఉన్నతమైన గోపురాలు, వాటి మీద చెక్కిన కళాఖండాలు అంతులేని ప్రశాంతతని అందిస్తాయి. భగవంతుని వైభవానికి భక్తుడు అందించే చిరుకానుకగా తోస్తాయి. గోపురం దగ్గరకి వచ్చి తల ఎత్తి చూడగానే మనసు మరో లోకంలోకి ప్రవేశించేందుకు సిద్ధపడిపోతుంది. గోపురం లోపలికి అడుగుపెట్టగానే ఆధ్మాత్మిక సామ్రాజ్యంలోకి కాలుమోపిన అనుభూతి కలుగుతుంది.

 

భౌతికంగా, ఆధ్మాత్మికంగా గోపురాలను ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే, వేయి సంవత్సరాలకు పూర్వం మొదలైన ఈ తరహా కట్టడాలను ఇప్పటికీ ఆదరిస్తున్నారు, అనుసరిస్తున్నారు.

 
source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
కాటుక కళ్లతో లోకానికే అందం!

మానవ సమాజం అడుగులు వేస్తున్న కొద్దీ కొన్ని ఆచారాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో కొన్ని కాలంతో పాటు కలిసిపోతే, మరికొన్ని కాలపు పరీక్షలను తట్టుకుని వేల సంవత్సరాలుగా నిలిచి ఉంటాయి. ఒక్కసారి ఆగి అవి ఇన్నాళ్లుగా ఎందుకు ఆదరణను పొందుతున్నాయో పరిశీలిస్తే, వాటి వెనుక ఉన్న ఆలోచన ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి ఒక ఆచరణే కాటుకని ధరించడం

 

కాటుకని ధరించే ఆచారం ఈనాటిది కాదు! అది కేవలం భారతీయులకు మాత్రమే పరిమితమైనదీ కాదు! దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టు వాసులు కాటుకని ధరించేవారన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆనాటి చిత్రాలను గమనించినప్పుడు వారు కాటుకని ధరించి ఉండటాన్ని గమనించవచ్చు.

 

కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం! ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుడ్డు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది. దీనినే స్క్లెరా అంటారు. ఈ తెల్లటి భాగం వల్లే కనుగుడ్డు ఎటు కదులుతోందో? మనిషి కళ్లు పలుకుతున్న భవాలు ఏమిటో? తెలుస్తాయి. ఈ స్క్లెరా చుట్టూ కాటుకని పూయడం వల్ల కళ్ల పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు, తప్పకుండా కాటుకను ధరించి తీరతారు.
తెల్లటి భాగం చుట్టూ నల్లటి కాటుకని అద్దడం వల్ల ఒక కాంట్రాస్ట్‌ ఏర్పడి కంటి అందం ఇనుమడిస్తుంది. కాటుక కళ్లు అన్నమాట ఊరికనే రాలేదు కదా! అయితే కాటుకతో ఇలాంటి అంచుని తీర్చిదిద్దడం వల్ల మరో ఉపయోగం కూడా ఉంది. ఏ వస్తువునైతే చూస్తున్నామో, ఆ దృశ్యం మీద చూపు స్పష్టంగా నిలుస్తుంది. తుపాకీ గురిలాగా... కనురెప్పలకీ, కాటుకకీ మధ్య కనిపించే దృశ్యం మీదే కంటి చూపు నిశితంగా నిలుస్తుంది.

 

కాటుక తయారీలో గంధం, ఆముదాలదే ముఖ్య పాత్ర. ఈ రెండింటికీ కూడా కంటికి చలువ చేసే గుణం ఉంది. వంటింటి పొగ నుంచి కంప్యూటర్‌ తీక్షణత వరకూ స్త్రీలు ఎక్కడ పనిచేసినా ఈ కాటుక వారికి రక్షగా నిలుస్తుంది. కళ్లను అలవనీయకుండా అడ్డుపడుతుంది. చాలామంది మగవారు సైతం కళ్లు మంటగా ఉన్నప్పుడు ఒక చుక్క ఆముదాన్ని కళ్లలో వేసుకుంటూ ఉంటారు.

 

కంటికి అందాన్నిచ్చే మరో ముఖ్య భాగం కనురెప్పలు. కనురెప్పలు విశాలంగా ఉంటే అందం ఇనుమడింపచేస్తుంది. అలాంటి కనురెప్పలకి నిరంతరం ఆముదంతో కూడిన కాటుక తగులుతూ ఉంటే, వాటికి ఉండే వెంట్రుకలు పొడవుగా అందంగా పెరుగుతాయి.

 

ఆడా, మగా అన్న బేధం లేకుండా పిల్లలకు తప్పకుండా కాటుకని పెట్టడం ఇప్పటికీ ఆచారంగా వస్తున్నదే! రోజూ కాటుకని అద్దితే పిల్లలకు దిష్టి తగలదనీ, వారి కంటి నరాలు త్వరగా బలాన్ని పుంజుకుంటాయనీ, మెల్లకన్నులాంటి దృష్టిదోషాలు దరిచేరవనీ పెద్దల నమ్మకం.

 

ఇస్లాంలో కూడా సుర్మాకు (కాటుక) ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వారు మన కాటుకలాగా కాకుండా ఒక ప్రత్యేకమైన రాయితో సుర్మాను తయారుచేసుకుంటారు. ఇది తీక్షణమైన సూర్యకిరణాల నుంచి కంటిని కాపాడుతుందనీ, దృష్టిదోషాలు రాకుండా నివారిస్తుందనీ వారి నమ్మకం. సాక్షాత్తూ మహమ్మద్‌ ప్రవక్తే సుర్మాను ధరించేవారని చెబుతారు. అందుకనే పవిత్రమైన రంజాన్‌ మాసంలో తప్పకుండా సుర్మాను ధరిస్తారు.

 

ప్రాంతాన్ని బట్టీ, నమ్మకాలను బట్టి కాటుకను వేర్వేరు రకాలుగా తయారుచేస్తూ ఉంటారు. కొంతమంది కేవలం గంధం, ఆముదాల మసితో కాటుకను రూపొందిస్తే... మరికొందరు కరక్కాయ, పచ్చకర్పూరం, నువ్వులనూనె వంటివి కూడా ఉపయోగిస్తారు. మరికొందరు ఔషధులను కూడా కాటుక తయారీలో చేరుస్తారు. సంప్రదాయబద్ధంగా తయారుచేసే ఇలాంటి కాటుకలన్నీ కంటి ఆరోగ్యాన్ని పెంపొందించేవే! కాకపోతే బయట బజార్లో కాటుకను కొనేటప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ కాటుకని పడితే ఆ కాటుకను వాడిపారేస్తే వాటిలో ఉండే సీసం వంటి రసాయనాల వల్ల అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా పిల్లలకు కాటుకని పెట్టాలనుకున్నప్పుడు కాటుక తయారీలోనూ, కొనుగోలులోనూ మరింత జాగ్రత్త అవసరం! ఈ కాస్త జాగ్రత్తను తీసుకుంటే చాలు కాటుక కళ్లు ఈ లోకాన్ని మరింత కాంతిమంతం చేస్తాయి.

source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
తొలి ఏకాదశి విశేషాలెన్నో..
 
ఏడాది పొడవునా ఎన్ని ఏకాదశిలు ఉన్నా... ఆషాఢంలో వచ్చే ఏకాదశి తీరే వేరు. ఎందుకంటారా...
తొలి ఏకాదశి- కాలాన్ని ఎవరు నిర్వచించగలరు. ఇది మొదలు, ఇది తుది అంటూ ఎవరు విభజించగలరు. ఏదో మన సౌలభ్యాన్ని బట్టి, జీవన విధానం బట్టి... ఇది తొలి, ఇది మలి అంటూ నిర్వచించుకుంటాం. అలాగే ఏకాదశిలు అన్నింటిలోకీ వర్షరుతువు ఊపందుకున్నాక వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణించడం మొదలుపెట్టారు. పైగా ఈ పక్షం నుంచే హైందవుల పండుగలు, పబ్బాలు ఒకదాని తరువాత ఒకటిగా వస్తాయి కాబట్టి తొలి అన్న పదం సరిగ్గా సరిపోలుతుంది. సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు.
 
శయన ఏకాదశి- ఈ రోజు నుంచి విష్ణుమూర్తి నాలుగు మాసాలపాటు పాలకడలిపై యోగనిద్రలోకి జారుకుంటాడని నమ్మకం. లౌకికరీత్యా ఈ రోజు నుంచి రాత్రివేళలు మరింత పెరుగుతాయి కాబట్టి, వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించడ సబబే! ఇలా నిదురించిన విష్ణుమూర్తి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు వచ్చే ఉత్థాన ఏకాదశి నాడు మేలుకుని తన భక్తులకు దర్శనమిస్తాడని ప్రతీతి.
 
చాతుర్మాసవ్రతం- శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకూ ఉండే నాలుగు నెలల పాటు చేసే వ్రతాన్ని చాతుర్మాస వ్రతం అంటారు. భౌతిక రీత్యా ఈ నాలుగు మాసాలలో మన శరీరం దుర్బలంగా ఉంటుంది. ఒక పక్క నుంచి వర్షాలు, మరో పక్క పెరిగిపోతున్న రాత్రివేళలు, ఇంకో వైపు ఉధృతంగా సాగే పొలం పనులు... మానసికంగా, శారీరకంగా మనం నీరిసించిపోతాము. పైగా రాత్రివేళలు పెరగడం అంటే చంద్రుని ప్రభావం మన మీద అధికంగా ఉండటమే! జాతకరీత్యా చంద్రుడు మనఃకారకుడు కదా! ఇలాంటి పరిస్థితుల మధ్య ఉపవాసం, జాగరణ, భగవన్నామస్మరణ... వంటి ఆయుధాలతో అటు మనసునీ, ఇటు శరీరాన్నీ దృఢంగా ఉంచే సాధనమే చాతుర్మాసవ్రతం.
 
చాతరుర్మాసవ్రత కాలంలో వచ్చే ఏకాదశి వంటి పుణ్య తిథులలో ఉపవాసం ఉండటమే కాకుండా, ఒకో మాసంలో ఒకో రకమైన ఆహారాన్ని విసర్జించాలని చెబుతారు పెద్దలు. శ్రావ‌ణ‌మాసంలో కొన్ని రకాలైన ‌కూర‌లు,  భాద్రపదంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తికంలో రెండు బ‌ద్ద‌లుగా వ‌చ్చే గింజ‌ల‌ను (పెస‌లు, మినుములు వంటివి) విజర్జించాలని సూచిస్తారు. ఆయా కాలాలలో మన శరీరంలో ఏర్పడే పిత్త, వాత, కఫ సంబంధమైన దోషాలను పరిహరించేందుకు ఈ నియమాలను ఏర్పరిచి ఉంటారు.
 
ఈ చాతుర్మాసవ్రతం మనకే కాదు, యతులకు కూడా ముఖ్యమైన ఆచారమే! ఈ నాలుగుమాసాలపాటు వారు ఎటువంటి ప్రయాణాలూ సాగించకుండా, ఒకచోట స్థిరంగా ఉండి భక్తులకు బోధ చేస్తుంటారు. దీని వెనుకా ఒక భౌతిక కారణం కనిపించకపోదు. యతులు సాధారణంగా పర్వతాలు, అడవులలోనే కదా సంచరించేది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, వాగువంకలు పొంగిపొరలడం సహజం. ఈ కాలంలో ప్రయాణం ప్రాణాంతకం! కాబట్టి ఒకచోట స్థిరంగా ఉండి తపస్సుని ఆచరించుకోవడం కోసం వారికి చాతుర్మాసవ్రతాన్ని సూచించి ఉంటారు. పైగా ఈ సమయంలో తమ ఊరిగుండా వెళ్లే యతులను కలిసి, వారిని సేవించి, ఆతిథ్యాన్ని అందించి... వారి నుంచి ప్రవచనాలను స్వీకరించే భాగ్యమూ సామాన్యులకు కలుగుతుంది.
 
ఉపవాస విధానం- ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించేవారు అంతకు ముందురోజైన దశమినాటి సాయంవేళ నుంచే దీక్షను ప్రారంభిస్తారు. ఇక ఏకాదశి తిథినాడు నిరాహారంగా ఉండి, భగవన్నామస్మరణతో మనసుని పవిత్రంగా ఉంచుకుంటారు. ఏకాదశి ఉదయాన ఉపవాసంతో శరీరాన్ని క్షీణింపచేస్తే, రాత్రివేళ జాగరణతో మనసుని శుష్కింపచేస్తారు. ఉపవాసంతో శరీరం జాగరూకమై తనను తాను స్వస్థత పరుచుకుంటుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇక జాగరణతో మనసు జాగరూకమైన తనలో ఏర్పడే ఆలోచనల పట్ల ఎరుకను సాధిస్తుందన్నది పెద్దల మాట. అలా ఉపవాస, జాగరణలతో సాగిన దీక్ష మరుసటిరోజు తెల్లవారుజామునే ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా ఒక ముగింపుకి వస్తుంది. ఈ దీక్షకు కొనసాగింపుగా ద్వాదశినాడు అతిగా భుజించకూడదన్నది నియమం. ఇదీ ఏకాదశి విశేషం!

source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
హారతి ఎందుకు?

ఆలయంలోకి వెళ్లి ఆ దైవాన్ని దర్శించుకున్నా, ఇంట్లోనే ఉండి పూజలు నిర్వహించినా.... హారతి ఇవ్వనిదే మన మనసుకి తృప్తిగా ఉండదు. షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే, పూజ సంపూర్ణం కాదు. మరి ఆ హారతిని ఎందుకు ఇస్తామంటే...
 
- హారతిని సాధారణంగా కర్పూరంతోనే ఇస్తాము. ఈ కర్పూరం అనేది సంస్కృత పదం. వేదకాలం నుంచీ మన జీవన విధానంలో ఇమిడిపోయిన పదార్థం. అందుకే ఆంగ్లంలోని ‘camphor’ అనే మాట సైతం కర్పూరం అన్న పదం నుంచే వచ్చింది.
 
- ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడు ధ్వజస్తంభానికి మొక్కుతూ, ప్రదక్షిణలు చేస్తూ, భగవన్నామస్మరణను సాగిస్తూ... చివరికి గర్భాలయాన్ని చేరుకుంటాడు. ఆ గర్భాలయంలోని దైవం నూనెదీపాల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తే, అతని మనసులో ఏదో ఒక మూల అసంతృప్తి కలగడం సహజం. హారతి ప్రకాశంతో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దేదీప్యమానంగా చూసే అవకాశం కలుగుతుంది. అప్పటివరకూ భగవద్దర్శనం కోసం తపించిపోయిన మనసు సేద తీరుతుంది. ఇప్పటికీ కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఒక్కసారి ఆ భగవంతుని చూపించండి అని భక్తులు అడగడం, పూజారిగారు హారతిని వెలిగించి వలయాకారంగా తిప్పుతూ ఆ మూర్తిని దర్శింపచేయడం జరుగుతుంటుంది.
 
- ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. ఈ తేమతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇక కర్పూరం వెలిగిస్తే... దుర్గంధం అన్న మాట ఎక్కడిది.
 
- ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతటి సాంకేతికత ఎక్కడిది! దానిని పూర్తిగా కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.
 
-  భగవంతునికి అందించిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.
 
- హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. అదే సమయంలో మనం కళ్లు మూసుకుని హారతిని అద్దుకుంటూ ఉంటాము. అంటే మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా... ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.
 
చివరగా.... కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండు- సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది మన పెద్దల అభిలాష కాబోసు. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ... జీవించినంతకాలమూ జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ పెద్దల అభిమతం కావచ్చు.
 
source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
కొత్త బట్టలకు పసుపు ఎందుకు!

పసుపు విశిష్టత గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. చర్మరోగాల నుంచి క్యాన్సర్‌ వరకూ పసుపు ఎన్నో రోగాలకు దివ్యౌషధం అంటూ పరిశోధనలన్నీ తేటతెల్లం చేస్తున్నాయి. ఇలాంటి పసుపుని భారతీయులు తమ జీవితంలోనే ఒక భాగంగా మార్చేసుకున్నారు. మరీ ఎంత గొప్ప పదార్థమైతే మాత్రం... కొత్తబట్టలకు కూడా పసుపుని రాసుకుని తిరగాలా అని చిరాకుపడిపోతుంటారు కుర్రవాళ్లు. మరి ఆ చిరాకు ఎంతవరకు సబబో చూద్దాం..
 
- కొత్త బట్టలని ఉతకకుండానే ధరించేస్తాం. ఇప్పటి బట్టల తయారీలో రకరకాల రసాయనాలని వాడేస్తున్నారు. అలాగే పూర్వకాలంలోనూ గంజి, అద్దకాలతో బట్టలను రూపొందించేవారు. ఇటు రసాయనాలైనా, అటు గంజి వంటి పదార్థాలైనా నిలువ ఉన్నప్పుడు తప్పకుండా క్రిములకు ఆస్కారం ఇచ్చేవే. కొత్తబట్టలకు పసుపుని రాయడం వల్ల వాటి మీద ఉన్న సూక్ష్మక్రిములను కొంతవరకైనా నాశనం చేసే అవకాశం ఉంటుంది.
 
- కొత్త బట్టలు ధరించడం ఒక యోగం. చేతిలో డబ్బులు ఆడుతున్నాయి కాబట్టి ఈ మధ్య ఎప్పుడు కావాలన్నా బట్టలు వేసుకోగలుగుతున్నాము. కానీ ఒకప్పుడు పండుగలు, పెళ్లిళ్లు, పుట్టినరోజులు వంటి శుభసందర్భాలలో మాత్రమే బట్టలను కొనుగోలు చేసే అలవాటు ఉండేది. మరి పసుపు లేనిదే మన సంప్రదాయంలో ఏ శుభకార్యమూ గడవదు కదా! పూజ చేయాలన్నా కూడా పసుపు ముద్ద ఉండాల్సిందే! అలాంటి ఓ శుభసందర్భంలో భాగంగా బట్టలను కూడా చేరుస్తున్నాము కాబట్టి... అందుకు సూచనగా శుభప్రదమైన పసుపుని ముట్టించేవారు.
 
- కొత్త బట్టలలు గంజివాసన వేస్తాయి. గోదాముల్లో నెలల తరబడి ఉన్నా ముక్కవాసన వస్తాయి. ఈ వాసనను పసుపు కొంతవరకూ నిలువరిస్తుంది.
 
- కొత్త బట్టలకు పసుపు రాయడం అనేది ఇంట్లోని ఆడవారి చేతుల మీదుగా జరుగుతుంది. అలా వారి ఆశీర్వచనం, ప్రేమ కూడా అందించినట్లు అవుతుంది.
 
- ఒకప్పుడు పసుపుని కూడా బట్టలకు అద్దకంగా వాడేవారు. అంటే ఇది బట్టలకు అంటుకుంటే ఒక పట్టాన పోదన్నమాట. కాబట్టి బట్టలను జాడించిన ప్రతిసారీ పసుపు కాస్త కాస్తగా కరుగుతూ తనలోని క్రిమిసంహారక లక్షణాన్ని బట్టలకు అందిస్తుంది.
 
- కొత్త బట్టలు, అందునా తెల్లబట్టలు వేసుకుని వెళ్తే అందరి కళ్లూ వారి మీదే ఉండటం ఖాయం. అందుకని బట్టలకు పసుపుని తాకించడం వల్ల పలువురి దృష్టి పడటం వల్ల కలిగే దోషాలను నివారిస్తుందని పెద్దల నమ్మకం.
 
- పసుపంటే బంగారు వర్ణం. అది వైభవానికీ, భగవంతుని మహిమకూ చిహ్నం. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు, దైవదర్శనానికి వెళ్లేటప్పుడు పసుపు బట్టలు (పీతాంబరాలు) ధరించి వెళ్లాలంటారు పెద్దలు. కొత్తబట్టలకు కాసింత పసుపుని జోడిస్తే అది కూడా పీతాంబరంగానే మారిపోతుంది. జీవితమనే వైభవానికి తీపి గుర్తుగా మిగిలిపోతుంది.

source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
మగవారి చేతికి కడియం ఎందుకు!

ఆడవారు చేతులకు గాజులు ఎందుకు వేసుకుంటారో చాలాచోట్ల చదివే ఉంటాము. మరి మగవారు కూడా చేతికి కడియాలు ధరించే ఆచారం ఉంది కదా! కాస్త పరిశీలించి చూస్తే దీని వెనుక కూడా చాలా కారణాలే కనిపిస్తాయి...
 
ధర్మాన్ని గుర్తుచేస్తూ- సిక్కు మతంలో ‘ఖల్సా’ సంప్రదాయాన్ని అనుసరించేవారంతా తప్పకుండా కడియాన్ని ధరించితీరాలి. ఈ కడియం, వారు తమ గురువుల పట్ల విధేయులై ఉన్నారని నిరంతరం గుర్తచేస్తూ ఉంటుందట. పైగా తమ చేతులతో దానధర్మాలను చేయాలనీ, ఇతరుల పట్ల స్నేహంతో మెలగాలనీ, ఆ కడియ ధారణ సూచిస్తుందట. అంటే గురువుగారి విధేయతనూ, సత్ప్రవర్తన పట్ల ఎరుకను ఈ కడియం సూచిస్తుందన్నమాట.
 
మణికట్టుకి కవచం- శారీరిక శ్రమతో కూడిన పని చేసేటప్పుడు ఒకోసారి మణికట్టు తెగే ప్రమాదం ఉంటుంది. మణికట్టు తెగితే రక్తం ధారకట్టి... ఒకోసారి మరణానికి కూడా దారితీస్తుంది. అలాంటి ప్రమాదం నుంచి చేతి కడియం రక్షగా ఉంటుంది. పదునై వస్తువు మీదకు వచ్చినప్పుడు అది కడియానికి తగిలి ఆగిపోయే అవకాశమే ఎక్కువ!
 
ఆరోగ్యానికి రక్ష- ఒకో లోహంతో చేసిన కడియం ఒకో తీరున శరీరాన్ని ప్రభావితం చేస్తుందని పెద్దల నమ్మకం. ఉదాహరణకు రాగితో చేసిన కడియం శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తే, వెండితో చేసిన కడియం శరీరంలోని విద్యుత్‌తరంగాలను ప్రభావితం చేస్తుంది.
 
జాతకరీత్యా- జాతకాలను నమ్మేవారు, వివిధ గ్రహసంబంధమైన దోషాలను కడియాలను ధరించడాన్ని కూడా ఒక ఉపశమనంగా భావిస్తారు. సుప్రసిద్ధ గ్రంధం ‘ఒక యోగి ఆత్మకథ’లో సైతం ఇలాంటి ప్రస్తావన ఒకటి కనిపిస్తుంది. ‘‘విద్యుత్‌, అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉన్నాయి; మనిషి శరీరానికి అవి మంచీ చెయ్యవచ్చు, చెరుపూ చెయ్యవచ్చు. అనేక యుగాల కిందట మన రుషులు, సూక్ష్మమైన విశ్వకిరణ ప్రభావాల దుష్ఫలితాల్ని పోగొట్టే సమస్యను గురించి ఆలోచన చేశారు. స్వచ్ఛమైన లోహాలు గ్రహాల ప్రతికూలాకర్షణలకు శక్తిమతమైన ప్రతిక్రియ చేసే సూక్ష్మకాంతిని విడుదల చేస్తాయని కనిపెట్టారు’’ అని అంటారు పరమహంస యోగానంద గురువుగారైన యుక్తేశ్వర్‌గారు. అంతేకాదు! యోగానందను కొన్ని జాతక సమస్యల నుంచి తప్పించేందుకు, ఒక నిర్దిష్టమైన కడియాన్ని ధరించమని కూడా సూచిస్తారు.
 
ఆత్మరక్షణ కోసం- అవసరమైనప్పుడు శత్రువు మీద కడియంతో ముష్టిఘాతాలు చేసిన సందర్భాలూ చరిత్రలో బోలెడు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా సిక్కు ఖల్సా వీరులు తాము ధరించే కడియాలను, ఆత్మరక్షణ కోసం కూడా వాడుకునేవారట.గౌరవానికి సూచన- పూర్వం పండితులు లేదా బాగా పలుకుబడి ఉన్నవారు... తమ ప్రతిభకు లేక పేరుకు చిహ్నంగా బంగారు కడియాలను ధరించేవారు. అలా బంగారు కడియం ఎప్పటినుంచో ఒక ‘స్టేటస్‌ సింబల్‌’గా నిలుస్తోంది.
 
శరీరాన్ని పట్టి ఉంచే సాధనం- ధ్యానంలో ఉన్నత స్థితులను చేరుకున్న కొందరు శిష్యులను ఇంకా ఇహలోక సంబంధమైన విషయాలకు పట్టి ఉంచేందుకు రాగితో చేసిన ఉంగరం లేదా కడియాలను వారి చేతులకు ధరింపచేస్తూ ఉంటారు. ఇప్పటికీ జగ్గీ వాసుదేవ్‌ వంటి గురువులు ఈ పద్ధతిని పాటించడం గమనించవచ్చు.అన్నింటికీ మించి, చాలా తక్కువ ఆభరణాలను ధరించే ఆస్కారం ఉన్న మగవారికి కడియం చక్కటి ‘హస్తభూషణం’గా నిలుస్తుంది. ఎంతటి నాస్తికుడికైనా చేతి కడియం ఒక అందం!
 
source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
అన్నా చెల్లెళ్ల అనురాగం రక్షబంధన్


రాఖీ/ ర‌క్షాబంధ‌న్‌

అగ‌స్టు నెల వ‌చ్చిందంటే చాలు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భార‌తీయులంతా రాఖీ ఏ రోజు వ‌చ్చిందా అని కేలండ‌ర్ తిర‌గేస్తారు. ర‌క్త‌సంబంధం ఉన్నా లేకున్నా అన్నాచెల్లెళ్లుగా, అక్కాత‌మ్ముళ్లుగా బంధాల‌ని పంచి పెంచే పండుగే రాఖీ! కుల‌మ‌తాల‌కు అతీతంగా చేసుకునే వేడుక ఇది. నువ్వే నాకు రక్ష.. ఎల్లలు ఎరగని నీ వాత్సల్యం, అనురాగం, అప్యాయతలో నేను కలకాలం చల్లగా ఉండాలి.. అని ఆకాంక్షిస్తూ ప్రతి సోదరీ తన సోదరుని రక్త సంబంధాన్ని రక్షా బంధనంతో ముడివేస్తూ కోరుకుంటుంది. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షా బంధన దారాలు అనురాగాల మొగ్గలు తొడిగి అప్యాయతా కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి.
పురాణాల్లో రాఖీ...
రాఖీ పండుగ ఈనాటిది కాదు. దీని మూలం మ‌హాభార‌తంలోనే ఉంది! శ్రీకృష్ణునికి శ్రుత‌దేవి అనే మేన‌త్త ఉండేది. ఆమెకు "శిశుపాలుడు" అనే వికృత‌మైన పిల్ల‌వాడు పుట్టాడు. ఎవ‌రి చేయి త‌గిలితే అత‌ను సాధార‌ణంగా మారిపోతాడో, అత‌ని చేతిలోనే శిశుపాలుడు మ‌ర‌ణిస్తాడ‌ని పెద్ద‌లు చెబుతారు. ఒకరోజు శ్రుత‌దేవి ఇంటికి శ్రీకృష్ణుడు వ‌చ్చాడు. అత‌ని చేతిలో శిశుపాలుని ఉంచ‌గానే, చ‌క్క‌టి పిల్ల‌వాడుగా మారిపోయాడు . పిల్ల‌వాడు మామూలు రూపానికి వ‌చ్చాడ‌ని మొద‌ట సంతోషించినా, అత‌ని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉంద‌ని తేలిపోవ‌డంతో శ్రుత‌దేవి భ‌య‌ప‌డిపోయింది. త‌న కుమారుడిని చంపే ప‌రిస్థితి వ‌చ్చినా, పెద్ద‌మ‌న‌సుతో క్ష‌మించ‌మ‌ని శ్రీకృష్ణుని వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు క‌రిగిపోయి `స‌రే! ఆత్త ఇత‌ను చేసే త‌ప్పులను క్ష‌మిస్తాను. కానీ వంద త‌ప్పులు దాటితే మాత్రం దండించ‌క త‌ప్ప‌దు` అని వ‌ర‌మిచ్చాడు. శిశుపాలుడు పెరిగిపెద్దవాడ‌యి "చేది" అనే రాజ్యానికి వార‌సుడ‌య్యాడు. ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణునికి బంధువు... అయినా ఎంతో దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తించేవాడు శిశుపాలుడు. రాజ్యంలో వారిని పీడించ‌డ‌మే కాకుండా, చీటికీమాటికీ కృష్ణునితో గొడ‌వ‌ప‌డుతూ ఉండేవాడు. అలా ఒక‌సారి, నిండుస‌భ‌లో శ్రీకృష్ష్ణుని దూషించ‌డం మొద‌లుపెట్టాడు.
ఆ రోజు చేసిన పొర‌పాటుతో శిశుపాలుని వంద త‌ప్పులూ పూర్త‌వ‌డంతో, శ్రీకృష్ణునిలో సహనం నశించింది. అంతే త‌న సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుని మీద‌కు ప్ర‌యోగించాడు.  అలా `బుద్ధిగా ఉంటే బ‌తికిపోతావు` అని చెప్పినా విన‌కుండా శిశుపాలుడు త‌న ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నాడు.
కృష్ణుడు ఎంతో ఆవేశంతో సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ప్ర‌యోగించాడు క‌దా! ఆ స‌మ‌యంలో అత‌ని వేలు కూడా కాస్త తెగింది. ఆ వేలికి క‌ట్టుక‌ట్టేందుకు న‌లుగురూ నాలుగు దిక్కుల‌కీ ప‌రుగుదీశారు. కానీ అక్క‌డే ఉన్న ద్రౌప‌ది మాత్రం, ఏమాత్రం ఆలోచించ‌కుండా త‌న చీర‌కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి ర‌క్ష‌గా చుట్టింది.
`న‌న్ను అన్న‌గా భావించి ఆదుకున్నావు కాబ‌ట్టి, నీకు ఎలాంటి ప్ర‌మాదం వ‌చ్చినా నన్ను త‌లుచుకో! వెంట‌నే నిన్ను ఆదుకుంటాను` అని అభ‌య‌మిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘ‌ట‌నే ర‌క్షాబంధ‌నానికి నాందిగా నిలిచింది. త‌రువాతి కాలంలో ద్రౌప‌ది చీరను లాగి కౌర‌వులు నిండుస‌భ‌లో అవ‌మానించాల‌ని అనుకుంటే, దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు.
అప్ప‌టి నుంచి శ్రావ‌ణ‌మాసంలో వ‌చ్చే పౌర్ణ‌మి రోజున అక్క‌చెల్లెళ్లంతా త‌మ అన్న‌ద‌మ్ముల‌కు రాఖీని క‌డతారు. అందుకు బ‌దులుగా జీవితాంతం వాళ్ల‌ని కంటికిరెప్ప‌లా కాచుకుంటాన‌ని వాగ్దానం చేస్తారు సోద‌రులు. ఇదొక్కటే కాదు రాఖీ ప్రస్తావన అనేక సందర్భాల్లో వచ్చింది. దేవదానవ యుద్ధంలో ఇంద్రుడికి విజయం కలగాలని శచీదేవి రక్ష కడుతుంది. చారిత్రకంగా గ్రీకు రాజు అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. ఈ క్రమంలో జీలం నదికి అవల ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడుతో యుద్ధానికి తలపడ్డాడు. అయితే పురుషోత్తముని శక్తిసామర్ధ్యాల గురించి విన్న అతని భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడిని శరణుకోరి అతనికి రాఖీ కడుతుంది. రుక్సానాను సోదరిగా భావించిన పురుషోత్తముడు, యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతనిని చంపకుండా వదిలివేస్తాడు. పూర్వకాలంలో రాజవంశీకులకు ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయానే కారణంగా, వాటి నుంచి రక్షణ పొందడానికి కట్టుకునే ఆనవాయితీ నుంచి ఈ రక్షాబంధనం వచ్చినట్లు తెలుస్తోంది. పురాణ కాలంలో రాజులు యుద్ధాలకువెళ్లే ముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకొని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీ పౌర్ణమీ రోజు కట్టే రక్షలో ఆసామాన్యమైన శక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. 
 
రాఖీని ఎప్పుడు కట్టాలి

సంప్రదాయం ప్రకారం పొద్దున్నే లేచి, తలంటు స్నానం చేసి, రక్షను పూజించాలి. ఆ తరువాత అన్నదమ్ములకు నుదుట తిలకం పెట్టాలి. శ్రావణ పౌర్ణమి రోజున మధ్యాహ్న సమయంలో రాఖీ కట్టాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. ఆ తర్వాత నోరు తిపి చేయడం సంప్రదాయం. మనం చేసే ప్రతి పనికి కర్మసాక్షి ఆ సూర్యనారాయణుడు, మధ్యాహ్న వేళ సూర్యకిరణాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంతటి తేజస్సు రాఖీలో ఇమిడి ఉంటుందని, ఆ సమయంలోనే రాఖీని కట్టించుకోవాలన్నది శాస్త్రం చెబుతుంది. ఇదిలావుండగా పెళ్లి అయిన ఆడపడుచులు తమ పుట్టింటికి వెళ్లి సోదరులకు రాఖీలను కట్టడం మన సంప్రదాయంలో ఆచారంగా చెప్పుకోవచ్చు.
శ్రావ‌ణ పౌర్ణ‌మి రోజున కేవ‌లం రాఖీ పండుగే కాదు. దేశ‌వ్యాప్తంగా ఎన్నో పండుగ‌లు జ‌రుగుతాయి. చాలామంది ఈ రోజున కొత్త జంథ్యాల‌ను వేసుకుంటారు, కాబ‌ట్టి దీన్ని జంథ్యాల పౌర్ణ‌మి అంటారు. ప‌శ్చిమ‌బెంగాల్, ఒడిషా రాష్ట్రాల‌లో రాధాకృష్ణుల విగ్ర‌హాల‌ను ఊయ‌ల‌లో ఉంచి ఊపుతారు, ఈ పండుగ‌ను వారు ఝూల‌న్ పౌర్ణ‌మి అంటారు. ఉత్త‌ర‌భార‌త‌దేశంలోని కొన్ని రాష్ట్రాల‌లో, `క‌జ‌రి పౌర్ణ‌మి` పేరుతో ఈ రోజు గోధుమ నాట్ల‌ను వేస్తారు. ఇక మ‌హారాష్ట్ర, కేర‌ళ‌ల్లో `న‌రాళీ పౌర్ణ‌మి` పేరుతో, స‌ముద్ర‌దేవునికి పూజ‌లు చేస్తారు. కానీ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశ‌మంతా జ‌రుపుకొనే పండుగ మాత్రం `ర‌క్షాబంధ‌న‌మే`!

source:teluguone.com

Offline Pa1Kalyan

 • Global Moderator
 • Mega Member
 • *****
 • Posts: 10,763
 • DIE HARD FAN OF POWERSTAR
తెలుగువారి వరాలు- పంచారామాలు

మన దేశమంతా విస్తరించి ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి తరచూ వింటూనే ఉంటాము. ఈ క్షేత్రాలన్నింటినీ కలుపుతూ ఏదో ఒక పురాణగాథ ఉండటమూ తెలిసిందే! కానీ పంచారామాలుగా పేరొందిన ఓ అయిదు శైవక్షత్రాలు కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటమే ఆశ్చర్యం. ఆ పంచారామాలు ఏమిటో, అవి ఎక్కడెక్కడ ఉన్నయో, వాటి వెనుక ఉన్న గాథ ఏమిటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది!

తారాకాసురుని కథ!
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు, శివుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. పైగా బాలుని చేతిలో తప్ప అన్యుల చేత తనకు మరణం లేని వరాన్ని సైతం సాధించాడు. సహజంగానే రాక్షస ప్రవృత్తి ఉన్న తారకాసురుడు, ఈ వరాలన్నీ పొందగానే ముల్లోకాలనూ పీడించడం మొదలుపెట్టాడు. తారకాసురుని ధాటికి తట్టుకోలేని దేవతలంతా విష్ణుమూర్తికి మొరపెట్టుకోగా, శివపార్వతుల తనయుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అన్న ఉపాయాన్ని సూచించాడు ఆ నారాయణుడు. అలా తారకాసురుని సంహరించేందుకు పార్వతీ గర్భాన జన్మిస్తాడు కుమారస్వామి.
 
దేవతలంతా తన మీద ఉంచిన బాధ్యతను గుర్తించిన కుమారస్వామి, తారకాసురుని సంహరించేందుకు యుద్ధానికి బయల్దేరతాడు. కానీ ఎన్ని దివ్యాస్త్రాలను ప్రయోగించినా అవి తారకాసురుని నాశనం చేయలేకపోవడం చూసి, కుమారస్వామి ఆశ్చర్యానికి అంతులేకుండా పోతుంది. చివరికి, తారకాసురుని శరీరంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తే తప్ప, అతనికి చావు తప్పదని తెలుసుకున్న కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని ఛేదించడంతో తారకాసురునికి మృత్యువు సంభవిస్తుంది. అలా కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం అయిదుచోట్ల పడిందనీ, ఆ అయిదు ప్రాంతాలే పంచారామాలుగా రూపొందాయన్నది ఐతిహ్యం.
 
ఇవే పంచారామాలు!అమరారామము (అమరావతి) - ఇక్కడి లింగం సాక్షాత్తూ ఆ ఇంద్రుని చేతే ప్రతిష్టింపబడిందన్నది స్థలపురాణం. బహుశా అందుకేనేమో ఇంద్రలోకపు రాజధాని అయిన అమరావతి పేరుతోనే ఈ క్షేత్రమూ ప్రచారంలో ఉంది. అంతేకాదు! కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కూడా రాజధానిగా మారింది. పది అడుగులకు పైబడి ఉండే ఇక్కడి అమరలింగేశ్వరుని పూర్తిగా దర్శించుకోవాలంటే రెండంతస్తులుగా ఉన్న మెట్లను ఎక్కాల్సిందే!ద్రాక్షారామము- తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి అత్యంత సమీపంలో ఉండే ఈ ద్రాక్షారామం, పంచారామాల్లోనే అత్యంత ప్రముఖమైన శైవక్షేత్రం. దక్షప్రజాపతి యజ్ఞం చేసిన చోటు కావడంతో, ఈ ప్రాంతానికి ద్రాక్షారామం అన్న పేరు వచ్చిందంటారు. ఇక్కడి భీమేశ్వరస్వామి సహచరి అయిన మాణిక్యాంబను అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తిస్తారు. అంతేకాదు దక్షిణకాశిగా, త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా (ద్రాక్షారామం, కాళేశ్వరం, శ్రైశైలం) ఈ ఆలయాన్ని గౌరవిస్తారు.సోమారామము- పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి అతి సమీపంలో ఉన్న గునుపూడి అనే గ్రామంలో ఉన్న శివక్షేత్రమే సోమారామం. ఇక్కడి శివలింగం చంద్రుని చేత ప్రతిష్టింపబడింది కాబట్టి, ఈ క్షేత్రానికి సోమారామం అన్న పేరు వచ్చింది. పేరుకి తగినట్లుగానే చంద్రుని కళలతో పాటుగా పౌర్ణమి, అమావాస్యలకు మధ్య ఇక్కడి శివలింగం రకరకాల రంగులలో మారడాన్ని భక్తులు ఓ అద్భుతంగా భావిస్తారు. చాళుక్య రాజు అయిన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి, ఈ పంచారామానికి భీమారామము అన్న పేరు కూడా ఉంది.కుమారభీమారామం- ఈ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు అతి సమీపంలో ఉంది. కుమారస్వామి స్వయంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి కుమారారామమని పిలుచుకుంటారు. ఇక చాళుక్య రాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు కాబట్టి కుమారభీమారామంగా పేరుపొందింది. చైత్ర, వైశాఖ మాసాల్లోని సూర్యకాంతి ఉదయపు వేళలలో అయ్యవారి పాదాలనీ, సాయం వేళలలో అమ్మవారి పాదాలనూ తాకడం ఇక్కడి విశేషం!క్షీరారామము- ఇది పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఉంది. సాక్షాత్తూ ఆ శ్రీరాముడే ఈ లింగాన్ని ప్రతిష్టించాడు కాబట్టి, ఇక్కడి స్వామికి రామలింగేశ్వరుడు అన్న పేరు స్థిరపడింది. ఇక ఇక్కడి శివలింగం తెల్లటి పాలరంగులో ఉంటుంది కాబట్టి, ఈయనను క్షీరారామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. శివలింగం పైభాగం కాస్త మొనదేలి ఉండటం వల్ల ఈయనకు కొప్పురామలింగేశ్వరుడు అన్న పేరు కూడా ఉంది.
 
ఈ పంచారామాలన్నీ కూడా ఒకే రాష్ట్రంలో ఉండటం వల్ల, ఒకే రోజున వీటన్నింటినీ దర్శించుకునే వీలు ఉంది. అందుకు అనుగుణంగా ఆర్‌.టి.సి వివిధ బస్సులను కూడా నడుపుతోంది. వందల సంవత్సరాల నాటి శిల్పకళలతో, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్థలపురాణాలతో... పచ్చని ప్రకృతి మధ్య అలరారే ఈ పంచారామాలను దర్శించుకోవడం తెలుగువారికి అత్యంత సులువైన ప్రయాణం.

source:teluguone.com

 

Related Topics