Exclusive: Ram Charan Interview about Govindhudu Andarivadele

govindudu-andari-vadele-release-posters

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తను వరుసగా చేస్తున్న రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చి తన స్టైల్ మార్చి చేసిన పూర్తి కుటుంబ కథా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ తో కాసేపు ముచ్చటించి గోవిందుడు అందరివాడేలే సినిమా గురించి, చిరంజీవి గారి 150వ సినిమా గురించి పలు విషయాలను తెలుసుకున్నాం.. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) మొదటగా ‘గోవిందుడు అందరివాడేలే’ టైటిల్ ఎలా పెట్టారు.? ఆ టైటిల్ ని ఎలా జస్టిఫికేషన్ చేసారు.?

స) ఆలోచిస్తూ.. మీరు ఇలా అడిగే సరికి ఆలోచించాల్సి వస్తోంది… ఈ టైటిల్ ని సినిమాలోని ఓ పాత్రని డిఫైన్ చేయడం కోసం ఈ టైటిల్ పెట్టాము.. ఈ టైటిల్ ని బట్టి ఈ సినిమాలో ఉండే వ్యక్తి మన అందరివాడే, ఇతను అందరినీ కలుపుకొని పోతాడు అనే ఫీలింగ్ వస్తుందని ఈ టైటిల్ పెట్టాము. అంతేకానీ ఇందులో నా పేరు గోవిందుడు కాదు.. ఇందులో నా పేరు అభిరామ్.

ప్రశ్న) కృష్ణవంశీ తో పనిచేయడానికి మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి.?

స) కృష్ణవంశీ గారి మెయిన్ స్త్రెంగ్థ్ అంటే ఎమోషనల్ డ్రామా మరియు ఫ్యామిలీ వాల్యూస్.. ‘మగధీర’ తర్వాత ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ చెయ్యాలనుకుంటున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఆ తర్వాత చాలా మంది కథ చెప్పినప్పటికీ నాకు నచ్చలేదు. ఫ్యామిలీ మూవీలో ఫ్యామిలీ మూవీలానే ఉండాలి, అందులో యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఉండకూడదు. నాకేమో ప్యూర్ ఫ్యామిలీ కంటెంట్ మాత్రమే చెయ్యాలని ఉంది. అలా చెయ్యాలి అంటే చరణ్ ని పెట్టుకొని కూడా నేను ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ మూవీ చెయ్యగలననే నమ్మకం డైరెక్టర్ కి ఉండాలి. ఆ నమ్మకం నేను కృష్ణవంశీలో చూసాను.

ప్రశ్న) కృష్ణవంశీ ప్రస్తుతం వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. అసలు తనతో సినిమా చేయాలనే ఆలోచన ఎవరిది.?

స) ఇప్పటి వరకూ నేనెప్పుడూ సక్సెఫుల్ డైరెక్టర్స్ లేదా సక్సెస్ఫుల్ రైటర్స్ వెనక పడలేదు. చెప్పాలంటే వినాయక్ ఒకరితోనే ఎప్పటి నుంచో ఉన్న కమిట్ మెంట్ వల్ల చేసాను. అలాగే నేనెప్పుడూ కథ ఫైనలైజ్ అయ్యేంతవరకూ సినిమాకు కమిట్ అవ్వను. కృష్ణవంశీ అంటారా ఆయన డైరెక్టర్ గా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఆయన ఎంచుకున్న పాయింట్స్ ఫెయిల్ అయ్యాయి అంతే. నాకు ఆయన తీసిన ‘మురారి’, ‘నిన్నేపెళ్ళాడతా’, ‘చందమామ’ సినిమాలు అంటే ఇష్టం.

ప్రశ్న) కృష్ణవంశీ అంటే కాంప్రమైజ్ అవ్వడు. యాక్టర్స్ ని నటనపరంగా పిండుతాడు అనే వార్తలు ఉన్నాయి. అవి మీపై ఎంతవరకూ పడ్డాయి.?

స) నాకు కూడా అలా కాంప్రమైజ్ కాకుండా తీసే డైరెక్టర్ ఏ కావాలి. కథని నమ్ముకొని కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రిప్పింగ్ గా సినిమా తీసే డైరెక్టర్స్ లో కృష్ణవంశీ బెస్ట్. ఇక నటీనటుల నుంచి నటనని రాబట్టుకోవడంలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మమ్మల్ని కూడా బాగానే పిండి నటనని రాబట్టుకున్నారు. ఆయన నటుల్ని ఇబ్బంది పెట్టాలని అలా పిండరు, ఆయనకి కావాల్సిన దానికోసం మళ్ళీ మళ్ళీ చేయమంటారు. మేము కూడా రీ టేక్స్ తీసుకొని ఆయనతో ఆడుకున్నాంగా(నవ్వులు)..

ప్రశ్న) ఈ మూవీ జర్నీలో కృష్ణవంశీ నుంచి మీరు నేర్చుకున్న విషయం ఏమిటి.?

స) ప్రతి రోజు సెట్ కి వెళ్తాను కార్ వాన్ లో సీన్ పేపర్ ఇస్తారు.. దాన్ని అంతా చూసుకొని ఒక తరహాలో మైండ్ సెట్ చేసుకొని బయటకి వస్తాను.. కానీ అయన దగ్గరికి రాగానే దాన్ని పూర్తిగా మార్చి చెప్తారు. దీన్ని ఇలా కూడా చేస్తారా అని షాక్ అవుతాము. అలాగే స్పాట్ ఇంప్రవైజేషణ్ కూడా చాలా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బింగ్ లో కూడా సీన్ లో చాలా ఇంపాక్ట్ మార్చేయవచ్చని ఈ సినిమాతో ఆయన ద్వారానే తెలుసుకున్నాను.

ప్రశ్న) కాజల్ తో ఇది మూడవ ఫుల్ లెంగ్త్ సినిమా. తనతో వర్కింగ్ ఎలా ఉంది? అలాగే ఈ మూవీలో ఓ రొమాంటిక్ సాంగ్ చేసారు. అది చేసేప్పుడు ఏమీ ఇబ్బంది పడలేదా.?

స) కాజల్ తో చాలా కంపర్టబుల్ గా ఉంటుంది. ఈ సినిమాలో మీరు ఇప్పటి వరకూ చూసిన కాజల్ కంటే చాలా డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. మీరన్నట్టు ఓ రొమాంటిక్ సాంగ్ ఉంది దాన్ని చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాను, కృష్ణవంశీకి వద్దు అని కూడా చెప్పాను. కానీ పట్టు బట్టి చేయించాడు. ఆ సాంగ్ బాగా వచ్చింది.

ప్రశ్న) ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ ఏ మేరకు సహాయం అందించారు.?

స) చాలా వరకూ సహాయం చేసారని చెప్పాలి. కథ పూర్తిగా కృష్ణవంశీదే, స్క్రీన్ ప్లే కూడా 80% ఆయనే రాసాడు. ఎక్కడెక్కడ చిన్న చిన్న తప్పులున్నాయి, ఫ్యామిలీ లో రావాల్సిన సున్నితమైన బావోద్వేగాలు, ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ రావాలి అనే వాటిని వాళ్ళు మేకోవర్ చేసారు.

ప్రశ్న) ఇప్పటివరకూ యాక్షన్ మూవీస్ చేసిన మీరు రూటు మార్చి చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మీ అభిమానులు ఆశించే అన్ని ఎపిసోడ్స్ ఉంటాయా.?

స) అవును అభిమానులు ఆశించే అన్నీ ఉంటాయి. మనం గత 3-4 సంవత్సరాలుగా వచ్చిన సినిమాలు ఒక ఫార్మాట్ లో ఉన్నాయి. ఇది కూడా అదే ఫార్మాట్ లో ఉంటుంది. ట్రీట్ మెంట్ కాస్త కొత్తగా ఉంటుంది. అంతే కానీ అర్థం కాని ఫార్మాట్ అయితే కాదు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది.

ప్రశ్న) రాజ్ కిరణ్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్ రీప్లేస్ చేయడం వలన ఏమన్నా ఉపయోగపడిందా.?

స) అవును.. ప్రకాష్ రాజ్ గారి వల్ల చాలా హెల్ప్ అయ్యింది. ఆయన వల్ల మా మధ్య సీన్స్ ఇంకా బెటర్ మెంట్ అయ్యాయి, అలాగే తాత – మనవడిలా కెమిస్ట్రీ బాగా కుదిరింది. మరోసారి ప్రకాష్ రాజ్ స్టామినా ఏంటనేది ఈ సినిమాలో చూస్తారు.. రాజ్ కిరణ్ గారు కూడా మంచి యాక్టర్ కానీ ఆయన మన నేటివిటీకి ఎందుకో సెట్ అవ్వడం లేదని మార్చాము.

ప్రశ్న) ఈ మూవీ ఆల్బంలో మొత్తం 6 సాంగ్స్ ఉన్నాయి కానీ ఎందుకు 5 పాటలతోనే రిలీజ్ చేస్తున్నారు.?

స) మొత్తం ఆరున్నాయి కానీ సినిమా పరంగా ఇంకో పాట పెడితే ఎక్కడో ఫీల్ మిస్ అవుతోంది. అందుకే ఆ పాట తీసేసాం. చెప్పాలంటే కో కోడి సాంగ్ నా ఫేవరైట్ సాంగ్. అందుకే సినిమా రిలీజ్ అయిన 12 లేదా 13 వ రోజు స్పెషల్ బోనస్ లా ఆ సాంగ్ ని జత చేయాలనుకుంటున్నాం.

ప్రశ్న) సీతారామయ్య గారి మనవరాలు సినిమాకి ఇది మెల్ వర్షన్ అంటున్నారు. దీనిపై మీ కామెంట్.?

స) ఓ యాంగిల్ లో ఈ సినిమా దానికి స్ఫూర్తి అని అనుకోవచ్చు కానీ ఈ సినిమా కథ – కథనం – టేకింగ్ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే అందులో ఉండే విషాద ముగింపు ఇందులో ఉండదు. ఇదొక ఎనర్జిటిక్ అండ్ ఫుల్ లెంగ్త్ పాజిటివ్ మూవీ.

ప్రశ్న) కథ ఫైనలైజ్ అవ్వకుండా కమిట్ అవ్వను అన్నారు, మరి పూజ చేసిన కొరటాల శివ సినిమా ఎందుకు ఆగిపోయింది.?

స) నేను సినిమా కథ ఓకే అయ్యి, మరో వారంలో సెట్స్ పైకి వెళ్తాం అనుకున్నప్పుడే అడ్వాన్స్ తీసుకుంటాను. కొరటాల శివ పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు, మంచి ముహూర్తం అని బండ్ల గణేష్ పూజ చేయించేసాడు. కొరటాల శివ స్టొరీ లైన్ బాగుంది, కానీ నేను పూర్తి కుటుంబ కథా చిత్రం చెయ్యాలని పక్కన పెట్టాను. ఫ్యూచర్ లో తనతో కచ్చితంగా సినిమా చేస్తాను.

ప్రశ్న) ఎప్పుడూ కమర్షియల్ సినిమాలేనా లేక ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తారా.?

స) ప్రస్తుతానికి ప్రయోగాత్మక సినిమాలు చేయలేను. ఎందుకంటే మనల్ని నమ్మి నిర్మాత చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు. అతను నష్టపోకూడదు అందుకే నేను ప్రేక్షకులు మెచ్చేలా ఉంటూ నిర్మాతకి మనీ వచ్చే సినిమాలనే ఎంచుకుంటాను.

ప్రశ్న) మీ బాలీవుడ్ ఎంట్రీ మూవీకి విమర్శకుల నుంచి చాలా నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. వాటిని మీరెలా తీసుకుంటారు. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ లో ఏమన్నా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.?

స) ‘జంజీర్’ పరంగా విమర్శకుల నుంచి నేను చాలా నెగటివ్ ఫీడ్ బ్యాక్ విన్నాను. ఏమో ఆ సినిమాలో ఏదో ఒక పాయింట్ కి కనెక్ట్ కాకపోవడం వల్లే అలా జరిగి ఉంటుందనుకుంటున్నాను. కానీ వాళ్ళ ఓపినియన్ ని నేను తప్పు పట్టడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాం, కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడటం చాలా తొందరపడినట్టు అవుతుంది.

ప్రశ్న) మణిరత్నం, శ్రీను వైట్ల, గౌతమ్ మీనన్, కోన వెంకట్ – గోపి మోహన్ ఇలా చాలా మంది కథలు చెప్పారని, లైన్ లో ఉన్నారని అంటున్నారు. మరి మీరు ఎవరెవరితో కమిట్ అయ్యారు.?

స) శ్రీను వైట్ల గారు మూడు నాలుగు సార్లు కలిసి కథ చెప్పారు కానీ ఇంకా ఓకే అవ్వలేదు. అలాగే మణిరత్నం గారు వచ్చి ఓ కథ చెప్పారు కానీ అది నాకు, నాన్నకి సెట్ అవ్వదు అని చెప్పేసాం. ఇప్పుడు అదే సినిమాని మమ్ముట్టి అబ్బాయితో చేస్తున్నాడు. కానీ కచ్చితంగా మణిరత్నం గారితో ఓ సినిమా చేస్తాను. గౌతమ్ మీనన్ తో కూడా ఓ కమిట్ మెంట్ ఉంది. ఆయన తన కమిట్ మెంట్స్ ఫినిష్ చేసుకొని మంచి కథతో వస్తే నెక్స్ట్ ఇయర్ చేస్తాము. కోన వెంకట్ – గోపి మోహన్ చెప్పిన స్టొరీ లైన్ నాకు బాగా నచ్చింది. ప్రస్తుతం వాళ్ళు పూర్తి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. అది నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్తుంది. డైరెక్టర్ ని త్వరలో ఫైనలైజ్ చేస్తాం.

ప్రశ్న) నాన్నగారితో చేయనున్న 150వ సినిమా ఎంత వరకూ వచ్చింది. అసలు మీరే నిర్మించాలాని ఎందుకు అనుకున్నారు.?

స) చాలా కథలు విన్నాం. అందులో 3 సెలక్ట్ చేసాం. వాటిలో ఫైనల్ వన్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్నాం. అతి త్వరలోనే ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంది. మా అమ్మకి ఎప్పటి నుంచో సినిమా నిర్మించాలని ఉంది. అందుకే ఈ 150వ సినిమాని మేమే నిర్మిస్తున్నాం.

ప్రశ్న) చివరిగా టాలీవుడ్ హీరోస్ కి 8వ సినిమా ఫోబియా అని ఒకటి ఉంది. మీరు కూడా ఆ ఫోబియాని ఫీలవుతున్నారా.?

స) ఏమో అండి నాకు తెలియదు.. రెండు రోజుల క్రితమే నా మేనేజర్ చెప్పాడు ఈ 8వ సినిమా ఫ్లాప్ అనే ఫోభియా గురించి, కానీ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో 8వ సినిమా ఫ్లాప్ అనే ఫోభియాని నేను బ్రేక్ చేస్తాను. నా 8వ సినిమా కూడా హిట్ అవుతుందని చాలా నమ్మకంగా చెప్పగలను.

అంతటితో రామ్ చరణ్ తో మా ఇంటర్వ్యూని ముగించి, చరణ్ మొదటి సారిగా ట్రై చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

 

source:123telugu

We will be happy to hear your thoughts

Leave a reply

Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun and MegaFans Site - ChiranjeeviBlog.com
Logo